logo

తెట్టుపై చిగురించిన ఆశలు

ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాలో కొంతభాగానికి దశాబ్దాల కలగా ఉన్న రామాయపట్నం ఓడరేవు సాకారం దిశగా అడుగులు పడ్డాయి. ఓడరేవుతోపాటు విమానాశ్రయం, పారిశ్రామికాభివృద్ధి ఒకేచోట ఏర్పాటైతే సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని ప్రభుత్వం తాజాగా సమాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. విమానాశ్రయం ఏర్పాటుకు

Updated : 12 Aug 2022 05:54 IST

విమానాశ్రయం ఏర్పాటు?

ఒకే ప్రదేశంలో సమగ్రాభివృద్ధి

న్యూస్‌టుడే, కందుకూరు పట్టణం

భూములు పరిశీలిస్తున్న జేసీ కూర్మనాథ్‌, ఎమ్మెల్సీ మాధవరావు, ఆర్డీవో, అధికారులు (పాత చిత్రం)

ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాలో కొంతభాగానికి దశాబ్దాల కలగా ఉన్న రామాయపట్నం ఓడరేవు సాకారం దిశగా అడుగులు పడ్డాయి. ఓడరేవుతోపాటు విమానాశ్రయం, పారిశ్రామికాభివృద్ధి ఒకేచోట ఏర్పాటైతే సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని ప్రభుత్వం తాజాగా సమాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. విమానాశ్రయం ఏర్పాటుకు గతంలో ప్రతిపాదించిన దగదర్తితోపాటు తాజాగా గుడ్లూరు మండలంలోని తెట్టు ప్రాంతంలో భూములనూ అధికారుల బృందం పరిశీలించింది. దగదర్తి, తెట్టు ఈ రెండు ప్రతిపాదనలను పంపుతామని, ప్రభుత్వం ఏది నిర్ణయిస్తే అక్కడే విమానాశ్రయం ఏర్పాటుకు రంగం సిద్ధం అవుతుందని ఈనెల 2వ తేదీన కందుకూరు పర్యటనకు వచ్చిన జిల్లా కలెక్టర్‌ చక్రధర్‌బాబు పేర్కొన్నారు. దీంతో తెట్టు ప్రాంతంపై ఆశలు చిగురించాయి.

రెండు జిల్లాలకు సరిహద్దు

తాజాగా ప్రతిపాదించిన తెట్టు ప్రాంతం ప్రకాశం, నెల్లూరు జిల్లాల మధ్య ఉంది. రామాయపట్నం ఓడరేవు ఈ ప్రాంతానికి అతి సమీపంలో ఉండటం కలసివచ్చే అంశం. సముద్ర మట్టం కంటే 25 మీటర్లు ఎత్తులో ఉంది. దగదర్తి వద్ద విమానాశ్రయం ఏర్పాటుకు భూసేకరణ ప్రక్రియలో కొన్ని ఇబ్బందులు తలెత్తినట్లు ప్రచారంలో ఉంది. ఈనేపథ్యంలో తెట్టుపై దృష్టి కేంద్రీకృతమైనట్లు చెబుతున్నారు.

* గత నెల 20వ తేదీన సీఎం జగన్‌ ఓడరేవు భూమిపూజకు వచ్చిన సందర్భంలో ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ఓడరేవు సమీపంలో విమానాశ్రయం ఏర్పాటు అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఆ తరువాత ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జేసీ కూర్మనాథ్‌, ఎమ్మెల్సీ మాధవరావు, ఆర్డీవో సుబ్బారెడ్డి, స్థానిక రెవెన్యూ అధికారులు తెట్టు, వీరేపల్లి ప్రాంతాల్లో జాతీయరహదారి వెంబడి ఉన్న భూములు పరిశీలించారు.

* తెట్టు ప్రాంతంలోని సుమారు 2 వేల అటవీ భూముల్లో వేయి ఎకరాలు తీసుకుంటే సరిపోతుందని ప్రాథమిక నివేదికలను పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి కరికాల వలవన్‌కు పంపారు. ఈ నేపథ్యంలో ఆయన నుంచి భూముల లభ్యతపై నివేదించాలని కలెక్టర్‌కు మెయిల్‌ వచ్చినట్లు సమాచారం.

* అటవీ భూముల సేకరణ చేయాలంటే వెయ్యి ఎకరాలకు ప్రత్యామ్నాయంగా 2 వేల ఎకరాలు రెవెన్యూ భూములు సదరు శాఖకు అప్పగించాల్సి ఉంటుంది. దీనికితోడు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అది సాదారణ విషయం కాకున్నా.. పారిశ్రామికాభివృద్ధి దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో కృషిచేస్తే సాధ్యమవుతుందని ప్రజాప్రతినిధులు కొందరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

* ప్రత్యామ్నాయంగా అటవీశాఖకు కేటాయించేందుకు ప్రకాశం జిల్లా సీఎస్‌.పురం మండలంలో 5 వేలు ఎకరాలు గుర్తించినట్లు సమాచారం. ఓడరేవుతోపాటు విమానాశ్రయం కూడా ఉంటే పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారని భావిస్తున్నారు.

* బెంగళూరు, చెన్నై, హైదరాబాదు, విశాఖపట్నం ప్రాంతాల నుంచి అతి తక్కువ సమయంలోనే ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంటుంది. ప్రయాణంతోపాటు కార్గో సేవలు కూడా చేసుకునేందుకు అవకాశం ఉంది. ఇలాంటి విషయాలన్నీ పరిగణలోకి తీసుకుని సాధ్యాసాధ్యాలు పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందని నిపుణులు భావిస్తున్నారు.


ఆదేశాల మేరకే పరిశీలన

జి.వి.సుబ్బారెడ్డి, కందుకూరు ఆర్డీవో.

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జూలై 25వ తేదీన జిల్లా జాయింట్‌కలెక్టర్‌ కూర్మనాథ్‌తో కలిసి గుడ్లూరు మండలంలోని తెట్టు, ఉలవపాడు మండలంలోని వీరేపల్లి ప్రాంతాల్లోని భూములను పరిశీలించాం. ఆ భూములు అటవీశాఖకు సంబంధించినవి. ఆ భూముల వివరాలను జేసీకి తెలియజేయడం జరిగింది. విమానాశ్రయం విషయం పై ఇప్పటి వరకు మాకు ఎలాంటి ఆదేశాలు అందలేదు.

Read latest Nellore News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని