logo

పేరుకే ఆన్‌లైన్‌.. పైసా ఇస్తేనే పనుల్‌

నెల్లూరు నగరానికి చెందిన ఓ వ్యక్తి తన కారును మరొకరికి విక్రయించారు. దాని యాజమాన్య హక్కులను తన పేరుపై మార్చుకునేందుకు కొనుగోలు చేసిన వ్యక్తి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు.

Updated : 02 Oct 2022 02:04 IST

లైసెన్సు మొదలు అన్నింటికీ అదే తీరు
కొత్తరూపు సంతరించుకుంటున్న దళారీ వ్యవస్థ

నెల్లూరు నగరానికి చెందిన ఓ వ్యక్తి తన కారును మరొకరికి విక్రయించారు. దాని యాజమాన్య హక్కులను తన పేరుపై మార్చుకునేందుకు కొనుగోలు చేసిన వ్యక్తి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. ఈ-వాహన్‌లో వివరాలు నమోదు కాలేదని, బీమా సక్రమంగా లేదని.. ఇలా పలు కారణాలతో రెండుసార్లు తిరస్కరించారు. అన్నీ సక్రమంగా ఉన్నా.. ఇలా జరుగుతోందేమిటని తెలిసిన వాళ్లను అడగ్గా.. ఓ దళారి నంబరు ఇచ్చారు. అక్కడికి వెళ్లి వివరాలు చెప్పారు. గతంలో పెట్టిన పత్రాలతోనే మళ్లీ దరఖాస్తు చేసి.. రూ. 2,500 ఇచ్చారు. తర్వాత రోజే ఆమోదం పొందడంతో దరఖాస్తుదారుడు అవాక్కయ్యారు.

స్టోన్‌హౌస్‌పేటకు చెందిన మరో వ్యక్తి ద్విచక్ర వాహనం, కారు నడిపేందుకు లైసెన్స్‌ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. ఆయన పదో తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు నెల్లూరు ఆర్టీఏ కార్యాలయ సమీపంలోని ఓ సర్వీసు సెంటర్‌కు వెళ్లారు. అక్కడున్న వ్యక్తి పరీక్ష కష్టంగా ఉంటుంది. వాహనం నడిపే సమయంలో ఏదైనా ఇబ్బంది వచ్చినా.. అధికారులు ఒప్పుకోరని చెప్పారు. దాంతో ఏం చేయాలని అడగ్గా.. రూ. 3వేలు ఇస్తే మొత్తం నేను చూసుకుంటానని చెప్పాడు. గత్యంతరం లేక అడిగినంత ఇచ్చుకున్నారు.

ఈనాడు డిజిటల్‌, నెల్లూరు

రవాణా కార్యాలయాలకు దళారులు రాకూడదు. అసలు వాళ్లతో పని లేకుండా నేరుగా కార్యాలయానికి వచ్చి పనులు చేయించుకునే విధానం తీసుకొచ్చాం. మా ఉద్యోగులే సహాయకులుగా అన్ని పనులు చేసి పెడతారు. సీసీ కెమెరా నిఘాలో కార్యాలయం ఉంటుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని.. రుసుములు చెల్లించి.. స్లాట్‌ తీసుకుని వెళ్లి పనులు పూర్తి చేసుకోవచ్చు. ఇదీ రవాణాశాఖలో సంస్కరణ గురించి ప్రభుత్వ అధికారులు తరచూ చెప్పే మాట! వాస్తవంలో మాత్రం అక్కడికి దళారీ వ్యవస్థ ఏదో ఒక రూపంలో చొరబడుతూనే ఉంది. వసూళ్ల పర్వానికి ఎక్కడా అడ్డుకట్ట పడకుండా ఉంది. లెర్నింగ్‌ లైసెన్స్‌, వాహన సామర్థ్యం.. ఇలా ప్రతి దశలో వాటా పడితేనే పని అన్న స్థితి నెలకొంది. ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేసినా ఏదో ఒక అడ్డుపుల్ల వేయడం.. అదే దళారి ప్రమేయంతో వెళితే మాత్రం వాహనం నడపడం రాకపోయినా లైసెన్సు చేతులో పడటం ఇక్కడ రివాజుగా మారింది. రవాణా రంగంతో ముడిపడిన వ్యాపారాలను తమ బినామీల ద్వారా శాఖలోని కొందరు ఉద్యోగులే నిర్వహిస్తున్నారన్నది బహిరంగ రహస్యం. ప్రతి సెక్షన్‌లో ఏజెంట్‌ కోడ్‌నో.. పేరో చెప్పందే సిబ్బంది చేయరు. ఒక వేళ నేరుగా దరఖాస్తు చేసినా.. వివిధ కారణాలు చెప్పి పలుమార్లు తిప్పుతుండటంతో ఆ బాధపడలేక ఎంతో కొంత ముట్టజెప్పి పని చేయించుకుంటున్నామని పలువురు వాపోతున్నారు. జిల్లాలో నెల్లూరు ఉప రవాణా కార్యాలయంతో పాటు కావలి, ఆత్మకూరు, కందుకూరుల్లోనూ సిబ్బంది ఏర్పాటు చేసుకున్న ప్రైవేటు వ్యక్తులు నగదు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

వాహన సామర్థ్యం అంటే పండగే..
పాఠశాల బస్సులు, వ్యాన్‌ల తనిఖీల సమయంలోనూ నిబంధనలను పట్టించుకోకుండా ధ్రువీకరణలు ఇస్తున్నారు.  ప్రకాశం జిల్లాలోని గనుల నుంచి పరిమితికి మించిన బరువుతో లారీలు తిరుగుతున్నా.. పట్టించుకోవడం లేదు. గడిచిన రెండు నెలల్లో 400కు పైగా కేసులు నమోదు చేసి.. రూ. రెండు కోట్లకు పైగా జరిమానాలు వసూలు చేశామని అధికారులు చెబుతున్నా.. రీచ్‌లు, స్టాక్‌ పాయింట్లు, గ్రావెల్‌ సరఫరా చేస్తున్న టిప్పర్ల వైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు ఉన్నాయి.

అప్పుడు మామూళ్లు.. ఇప్పుడు ప్రాసెసింగ్‌ ఛార్జీలు
కొత్త వాహనం కొనుగోలు చేశాక.. ఏజెంట్‌ వద్దకు వెళ్లి.. ఆయన అడిగిన మొత్తం ఇచ్చి రిజిస్ట్రేషన్‌ చేయించుకునేవారు. అందులోనే రిజిస్ట్రేషన్‌ రుసుములు, అధికారుల మామూళ్లు, ఏజెంట్‌ వాటా ఉండేవి. రుసుం ఎంతో? మామూళ్ల మొత్తం ఎంతో తెలిసేదికాదు. ఈ విధానాన్ని ప్రక్షాళన చేసేందుకు వాహన డీలరు దగ్గరే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ చేయించుకునే విధానం తీసుకొచ్చారు. కానీ, డీలర్లు గతం కంటే ఎక్కువ వసూలు చేస్తున్నారని కొనుగోలుదారులు గగ్గోలుపెడుతున్నారు. ద్విచక్ర వాహనం రిజిస్ట్రేషన్‌కు నిబంధనల ప్రకారం చెల్లించేది రూ. 935 మాత్రమే. డీలరు మాత్రం రూ. రెండు వేలుపైనే వసూలు చేస్తున్నారు. ఇంత తీసుకుంటున్నారేమిటి? అని ప్రశ్నిస్తే.. ‘ప్రాసెసింగ్‌ ఛార్జీలు.. ఇవన్నీ మాకే కాదు.. ఆర్టీఏ వాళ్లకూ ఇవ్వాలి’ అని తేల్చి చెబుతున్నారు. కారుకు రూ.అయిదు వేల వరకు వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం కొందరు డీలర్లు ఆ మొత్తం అధికారులకు చెల్లించకపోవడంతో వందల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు ఆన్‌లైన్‌ పెండింగ్‌లో ఉంచారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.  

నగదు వసూలు చేస్తే కఠిన చర్యలు
రవాణా కార్యాలయంలో ఎక్కడైనా ప్రభుత్వ ఫీజు కన్నా అధికంగా నగదు డిమాండ్‌ చేస్తే ప్రజలు ప్రశ్నించాలి. ప్రైవేటు వ్యక్తులు, ఏజెంట్లను ఆశ్రయించవద్దు. నేరుగా కార్యాలయంలో పనులు చేసుకోవాలి. జిల్లాలో తమ కార్యాలయాల్లో పనుల కోసం వచ్చిన వారి నుంచి అదనంగా నగదు డిమాండ్‌ చేస్తే సహించేది లేదు. డబ్బు ఎందుకివ్వాలని ప్రశ్నించాలి. నేరుగా కార్యాలయంలో ఫిర్యాదు చేయండి.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.

- బి.చందర్‌, డీటీసీ, నెల్లూరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని