logo

ఇసుక.. ఇక్కట్లే అంతటా!

జిల్లాలో ఇసుక నిల్వలు పుష్కలంగా ఉన్నా.. జిల్లావాసులకు అందడం లేదు. అధికారుల్లో ముందుచూపు కొరవడటం.. గుత్తేదారుల నిర్లక్ష్యం తదితరాలతో నిర్మాణదారులు ఇబ్బంది పడాల్సి వస్తోంది.

Updated : 05 Oct 2022 06:04 IST

ముందు చూపులేక అరకొర నిల్వలు
ఏజెన్సీ మార్పుతో రోజుకో సమస్య

జిల్లాలో ఇసుక నిల్వలు పుష్కలంగా ఉన్నా.. జిల్లావాసులకు అందడం లేదు. అధికారుల్లో ముందుచూపు కొరవడటం.. గుత్తేదారుల నిర్లక్ష్యం తదితరాలతో నిర్మాణదారులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. వర్షాలు, వరదల సాకుతో ధరలు పెంచేయడం.. ఇక్కడి ఇసుకను ఇతర ప్రాంతాలకు ఇష్టానుసారం అమ్మేయడం.. అవసరార్థులకు అందుబాటులో ఉండకపోవడం.. సిఫార్సులు చేయించుకున్నా.. ప్రభుత్వ ధరల కంటే అధికంగా ఉండటం తదితరాలతో నిర్మాణదారులు కుదేలవుతున్నారు.

ఈనాడు డిజిటల్‌, నెల్లూరు

జిల్లాలో అధికారికంగా పది ఓపెన్‌ రీచ్‌లు.. రెండు డీసిల్టేషన్‌ పాయింట్లలో ఇసుక తవ్వకాలకు ప్రభుత్వ అనుమతి ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి పెన్నాకు వరద వస్తుండటంతో.. దాదాపు ఎనిమిది రీచ్‌ల్లో నిలిపివేశారు. పటమటి కంభంపాడు, ముదివర్తి ప్రాంతాల్లో చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నా.. పూర్తిస్థాయిలో తీయడం సాధ్యం కావడం లేదని సమాచారం. దీంతో ప్రస్తుతం ఇసుక కొరత ఏర్పడుతోంది. వర్షాకాలంలో కొరతను ఎదుర్కొనేందుకు కొన్ని నెలలుగా జిల్లాలోని తొమ్మిది ప్రాంతాల్లో నిల్వ చేసినా.. గత కొద్ది రోజులుగా జరుపుతున్న విక్రయాలతో నరసింహపురం, వెంకటాచలం ప్రాంతాల్లో నిల్వలు తగ్గిపోయాయి. మిగిలిన ప్రాంతాల్లోనూ అంతంత మాత్రంగానే ఉండగా.. అమ్మకాలు జరుగుతున్నాయి. దీంతో కొరత ఏర్పడి.. ధరలు పెంచేశారు. గనులశాఖ పట్టించుకోకపోవడంతో.. గుత్తేదారులు ఇష్టానుసారం నచ్చిన ధరకు బహిరంగ మార్కెట్‌లో విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

టిప్పర్‌కు రూ.పదివేలు అదనం
మొన్నటి వరకు విక్రయాలు జరిపిన జేపీ సంస్థ- ఆ బాధ్యతలను ఉపగుత్తేదారుకు అప్పగించింది. జిల్లాకు చెందిన ఓ కీలక నేత అనుచరుడు దాన్ని దక్కించుకున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ప్రక్రియపై అవగాహన లేకపోవడంతో రోజుకో ఇబ్బంది తలెత్తుతోంది. నిల్వలు పెంచేందుకు చర్యలు ప్రారంభించలేదు. అసలు జిల్లాలో నిల్వల పరిస్థితిపై మైనింగ్‌ అధికారులకు కనీస సమాచారం ఇవ్వడం లేదు. గతంలో రవాణా ఖర్చులతో కలిపి లారీ ఇసుక రూ. 15 నుంచి రూ. 17వేలకు లభించేది. ఇప్పుడది రూ. 22 వేల నుంచి రూ. 25వేలకు చేరింది. దీంతో ఇసుకకే ఇంత ఖర్చు చేస్తే.. నిర్మాణాలు ఎలా చేయగలమని నిర్మాణదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగనన్న కాలనీ లబ్ధిదారుల కోసం ఇసుక నిల్వ చేసిన కేంద్రాల వద్ద దందా మొదలుపెట్టారు.

కావలి సమీపంలోని స్టాక్‌ పాయింట్లో ఇసుక నిల్వలు

జగనన్న ఇళ్లకు.. అంతే..
లబ్ధిదారులకు అయిదు యూనిట్ల ఇసుక ఇవ్వాల్సి ఉంది. వేబ్రిడ్జి లేకపోవడం.. అధికారుల పర్యవేక్షణ కొరవడటం.. సీసీ కెమెరాలు పని చేయకపోవడం దందాకు కలిసి వస్తోంది. కూపన్లకు అయిదు యూనిట్లకు బదులు తక్కువగా లోడింగ్‌ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు వేస్టేజీ కింద 20 శాతం లెక్కల్లో తీసేస్తున్న దాన్ని మిగిల్చి అమ్మకాలు చేస్తున్నారనే విమర్శలున్నాయి.

ఇలాగైతే.. ఇబ్బందే..
నెల రోజుల కిందట జిల్లాలోని తొమ్మిది స్టాక్‌ పాయింట్లలో దాదాపు 8.50 లక్షల మెట్రిక్‌ టన్నుల నిల్వలు ఉన్నాయి. నరసింహపురంలో 1,30,000, వెంకటాచలంలో 9,254 మెట్రిక్‌ టన్నులు దాదాపు ఖాళీ అయింది. మిగిలిన వాటిలోనూ విక్రయాలు జరుగుతుండటంతో దాదాపు ఇదే పరిస్థితి. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న నీటితో రీచ్‌ల్లో ఇసుక తీయడం కష్టంగా ఉందని చెబుతున్నారు. మరో పది రోజుల్లో రీచ్‌ల్లో తవ్వకాలు ప్రారంభించకపోతే.. తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.

* దీనిపై గనులశాఖ ఏడీ శ్రీనివాసరావును వివరణ కోరగా.. ‘జిల్లాలో ఇసుక నిల్వలను పెంచేందుకు కృషి చేస్తాం. జగనన్న ఇళ్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సరఫరా చేస్తున్నాం. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే విక్రయించాలి. ఎక్కడైనా ఎక్కువ వసూలు చేసినా.. తక్కువ పరిమాణం ఇచ్చినా ఫిర్యాదు చేయవచ్చు’ అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని