logo

Nellore: ఈల లేదని కానిస్టేబుళ్లకు మెమోలు

నేర నియంత్రణకు ఈల (విజిల్‌) చక్కగా దోహదపడుతుందని ఎస్పీ సీహెచ్‌ విజయరావు ఉద్బోధించారు. ఈల పెట్టుకోని ఇద్దరు కానిస్టేబుళ్లకు మెమో జారీ చేయాలని ఆదేశించారు. నెల్లూరు సంతపేట పోలీసు స్టేషన్‌ను ఎస్పీ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

Updated : 13 Oct 2022 09:10 IST

తమ వద్ద ఈల ఉందని చూపుతున్న కానిస్టేబుళ్లు

నెల్లూరు(నేర విభాగం), న్యూస్‌టుడే: నేర నియంత్రణకు ఈల (విజిల్‌) చక్కగా దోహదపడుతుందని ఎస్పీ సీహెచ్‌ విజయరావు ఉద్బోధించారు. ఈల పెట్టుకోని ఇద్దరు కానిస్టేబుళ్లకు మెమో జారీ చేయాలని ఆదేశించారు. నెల్లూరు సంతపేట పోలీసు స్టేషన్‌ను ఎస్పీ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌ పరిసరాలను పరిశీలించి.. సిబ్బంది వివరాలు? ఎవరెవరు విధుల్లో ఉన్నారు? బీట్‌కు ఎంత మందిని కేటాయిస్తున్నారు? అనే వివరాలు తెలుసుకున్నారు. ఆ క్రమంలోనే యూనిఫాంతో పాటు విజిల్‌  పెట్టుకోని వారెందరున్నారని ప్రశ్నించారు. ఇద్దరు కానిస్టేబుళ్లు తీసుకురాలేదని గుర్తించి.. దాని ప్రాధాన్యం, ఉపయోగాలను వివరించారు. వారిద్దరికీ మెమో జారీ చేయాలన్నారు. సెట్‌ కాన్ఫరెన్స్‌ బుక్‌ ఎందుకు నిర్వహించడం లేదని ఇన్‌స్పెక్టర్‌ అన్వర్‌బాషాను ప్రశ్నించారు. కేసులపైనా ఆరా తీశారు. జిల్లా వ్యాప్తంగా ఒక్క మర్డర్‌ కేసు కూడా పెండింగ్‌లో లేదని.. సంతపేట పీఎస్‌లో మాత్రం ఒక్క హత్య కేసు ఉందన్నారు. వీలైనంత వరకు సత్వరం పరిష్కరించాలన్నారు. రికవరీ సాధనకు కానిస్టేబుళ్లకు లక్ష్యాలు నిర్దేశించాలని, దోపిడీ కేసులను ఎస్సైలకు కేటాయించాలని సూచించారు. ఎస్పీ వస్తున్నారని.. రోడ్లపై ట్రాఫిక్‌ క్లియర్‌ చేయడం కాదని.. సాధారణ రోజుల్లోనూ ఇదే పరిస్థితి ఉండాలని హితవు పలికారు. స్టేషన్‌లో ఉన్న వాహనాలను పరిశీలించి వేలం వేయాల్సిందిగా సూచించారు. ఎస్పీ వెంట ఎస్‌బీ డీఎస్పీ కోటారెడ్డి, నగర ఇన్‌ఛార్జి డీఎస్పీ అబ్దుల్‌ సుభాన్‌, ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం.నాగేశ్వరమ్మ ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని