logo

జగనన్న కాలనీలో జలగలు

జగనన్న కాలనీలు.. అధికారులు, అధికార పార్టీ నాయకులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. భూసేకరణ మొదలు.. మెరక చేయడం వరకు పెద్దమొత్తంలోనే దోపిడీ చేసిన కొందరు.. ప్రస్తుతం ఇళ్ల నిర్మాణంలోనూ అదే రీతికి తెరదీశారు.

Updated : 24 Nov 2022 05:55 IST

నిర్మాణాలను మధ్యలోనే వదిలేసిన గుత్తేదారులు

నెల్లూరు గ్రామీణంలోని కొండ్లపూడి జగనన్న కాలనీలో అసంపూర్తిగా ఇళ్లు

జగనన్న కాలనీలు.. అధికారులు, అధికార పార్టీ నాయకులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. భూసేకరణ మొదలు.. మెరక చేయడం వరకు పెద్దమొత్తంలోనే దోపిడీ చేసిన కొందరు.. ప్రస్తుతం ఇళ్ల నిర్మాణంలోనూ అదే రీతికి తెరదీశారు. ప్రభుత్వ ధరకే త్వరితగతిన కట్టిస్తామని చెప్పిన గుత్తేదారులు.. మధ్యలోనే వదిలేస్తున్నారు. బిల్లుల మంజూరులో అధికారులు ఇచ్చిన వెసులుబాటును దుర్వినియోగం చేస్తున్నారు. ఫలితంగా ఊర్లు అవుతాయని గొప్పగా చెబుతున్న కాలనీల్లో శిథిలమైన పిల్లర్లు, మొండిగోడలు వెక్కిరిస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందులతో ఇళ్ల నిర్మాణం చేపట్టని పేదలపై.. ‘ఇళ్లు కట్టుకోకుంటే పట్టాలు రద్దు చేస్తా’మని ఒత్తిడి చేసిన అధికార యంత్రాంగం.. బాధ్యత తీసుకున్న గుత్తేదారులు జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క ఇల్లు పూర్తి చేయకున్నా పట్టించుకోకపోవడం గమనార్హం.

ఈనాడు డిజిటల్‌, నెల్లూరు: జిల్లాలో 277 లేఅవుట్లు ఏర్పాటు చేశారు. వీటిలో 72,062 ప్లాట్లు ఉండగా- కేవలం 44,609 మందికి రిజిస్ట్రేషన్‌ చేశారు. ఇళ్లు నిర్మించేందుకు రూ.802.96 కోట్లు అవసరమవుతుందని అధికారులు అంచనా వేశారు. ఆప్షన్‌-3 (ప్రభుత్వమే పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వాలి) కింద జిల్లాలో 20,208 మందిని గుర్తించారు. వీరిని 80 గ్రూపులుగా విభజించి.. స్థానికంగా ఇళ్ల నిర్మాణానికి ముందుకొచ్చే మేస్త్రీలకు అప్పగించాలనేది మొదట్లో ప్రతిపాదన. దాన్ని పక్కనపెట్టి.. పెద్ద సంఖ్యలో ఇళ్ల నిర్మాణాన్ని గుత్తేదారు సంస్థలకు అప్పగించారు. ఎలాంటి టెండరు విధానం లేకుండా రూ.361.89 కోట్ల విలువైన పేదల ఇళ్ల నిర్మాణాన్ని కట్టబెట్టారు. ఇదంతా అధికారులే దగ్గరుండి నడిపించారు. ప్రభుత్వం ఇచ్చే నిర్మాణ వ్యయం నేరుగా గుత్తేదారుడికి ఇచ్చేందుకు నిబంధనలు అడ్డురావడంతో.. లబ్ధిదారుల ఖాతాల్లో వేసే గుత్తేదారులకు మళ్లిస్తున్నారు. ఇంతా చేసినా.. డిసెంబరు నాటికి 13,500 ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవడంలో వెనుకబడ్డారు. పురోగతిలో రాష్ట్రంలో 21వ స్థానానికి దిగజారారు.

ఒక్కటి పూర్తిచేస్తే ఒట్టు

సొంతంగా ఇళ్లు కట్టుకునే లబ్ధిదారులకు అయిదు దశల్లో నగదు ఇస్తుండగా- గుత్తేదారులకు మరింత వెసులుబాటు కల్పించారు. పిల్లర్లు వేసే దగ్గర నుంచి పూర్తయ్యే వరకు తొమ్మిది దశల్లో ఇస్తున్నారు. దీంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న రూ.1.80 లక్షలు, ప్రభుత్వం లబ్ధిదారుడికి పావలా వడ్డీకి ఇప్పించే రూ.35వేలను గుత్తేదారులకు అధికారులే దగ్గరుండి అందజేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే.. ఇళ్ల నిర్మాణం జిల్లాలో శరవేగంగా జరుగుతుందనుకుంటే పొరపాటే. అధికారిక లెక్కల ప్రకారం.. జిల్లాలో 4,657 పూర్తయితే.. ఇవన్నీ లబ్ధిదారులు స్వయంగా నిర్మించుకున్నవే. గుత్తేదారులు కనీసం ఒక్కటి కూడా నిర్మించలేదు. ఇదంతా ఒకవైపు అయితే.. ఇప్పటివరకు వీటి కోసం రూ.138 కోట్లు ఖర్చు చేయగా.. గుత్తేదారులకు దాదాపు రూ.73 కోట్లు చెల్లించారు.

జిల్లాలో లేఅవుట్లు 277
పూర్తయినవి 4,657 (ఇవన్నీ లబ్ధిదారులు నిర్మించుకున్నవే)
ఏర్పాటు చేసిన ప్లాట్లు 72,062
మంజూరైన ఇళ్లు 44,609


వెక్కిరిస్తున్న మొండిగోడలు

జిల్లాలో ఇళ్ల నిర్మాణం ప్రారంభించి దాదాపు రెండేళ్లు పూర్తయింది. కొన్ని చోట్ల ఇప్పుడిప్పడే పనులు చేస్తుండగా.. చాలా వాటిలో మొండిగోడలు వెక్కిరిస్తున్నాయి. గుత్తేదారుల కోసం అధికారుల కల్పించిన వెసులుబాటును వారు ఆదాయవనరుగా మార్చుకున్నారు. బేస్‌మెంట్‌ స్థాయికి వచ్చే సరికి నిర్మాణ వ్యయంలో దాదాపు రూ.70వేలు కాంట్రాక్టర్‌కు చేరుతుంది. దీంతో అక్కడి నుంచి ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు ఆసక్తి చూపించడం లేదు. దీంతో ప్రారంభించిన వాటిలో 10,768 ఇళ్లు బేస్‌మెంట్‌ స్థాయిలో నిలిచిపోయాయి. మిగిలిన వాటిలో 376 మాత్రమే రూఫ్‌ పూర్తి చేసుకోవడం గమనార్హం. గుత్తేదారుల నిర్లక్ష్యం, అధికారులు పట్టింపులేనితనం కారణంగా నెలల తరబడి పనులు నిలిచిపోవడంతో నాణ్యత దెబ్బతింటోందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ఇప్పటి నుంచి ఊపందుకుంటాయ్‌..
- నాగరాజు, పీడీ, గృహ నిర్మాణశాఖ

లేఅవుట్లలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను త్వరితంగా పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. గుత్తేదారులు ఎంత వరకు కట్టారో.. అంత వరకే చెల్లిస్తున్నాం. ఎక్కడా రాజీపడేది లేదు. ప్రస్తుతం పనులు ఊపందుకున్నాయి. ప్రభుత్వం డిసెంబరు 22 నాటికి ఇచ్చిన లక్ష్యం చేరుకుంటాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని