logo

మన సొమ్ము కాదుగా.. ఎలా పోతేనేం!

నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణకు సమకూర్చిన యంత్రాలు, వాహనాలు నిరుపయోగంగా మారాయి.

Updated : 25 Nov 2022 05:49 IST

వాహనాలకు తప్పు.. స్వచ్ఛ లక్ష్యానికి తూట్లు
నెల్లూరు(నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే

పాత మున్సిపల్‌ కార్యాలయంలో చెట్ల కింద ఇలా..

నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణకు సమకూర్చిన యంత్రాలు, వాహనాలు నిరుపయోగంగా మారాయి. స్వచ్ఛాంధ్ర మిషన్‌ నిధులు రూ. లక్షలు పోసి కొనుగోలు చేసినవీ ఎందుకూ కొరగాకుండా పోతున్నాయి. పదుల సంఖ్యలో ఉన్న వీటిని నిలిపేందుకు సరైన వసతి లేక ఆరు బయటే వదిలేయగా.. తుప్పుపడుతున్న దుస్థితి. ఇదంతా అధికారులకు తెలిసినా పట్టీపట్టనట్లు వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తుండగా- మొత్తంగా స్వచ్ఛలక్ష్యం నీరుగారుతోంది.

పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా నెల్లూరు నగరపాలక సంస్థలో 2007 నుంచి 2012 వరకు 12వ ఆర్థిక సంఘం నిధులతో చెత్త తరలింపు వాహనాలు, పరికరాలు కొనుగోలు చేశారు. అలా.. అప్పట్లో కొనుగోలు చేసిన వాటిలో అత్యధికం శిథిలమై మూలకు చేరాయి. ఇక 2018లో స్వచ్ఛాంద్ర మిషన్‌ ఆధ్వర్యంలో రూ. 50 కోట్ల విలువైన వాహనాలు సమకూర్చారు. వీటిలో కొన్ని నిరుపయోగంగా ఉండగా- మరికొన్ని మూలకు చేరాయి. రూ. 17 లక్షల విలువైన హీమ్యాన్‌ బుల్‌డోజరు, రూ. 40 లక్షల ఖరీదైన స్వీపింగ్‌ యంత్రాలు, రూ. 34 లక్షల విలువైన కాంపాక్ట్‌ లోడింగ్‌ యంత్రం, ఈ- ఆటోలు, కాలువల్లో పూడిక తీసే అత్యాధునిక టీఎంఎస్‌ యంత్రాలు.. ఇలా రూ. కోట్ల విలువైన యంత్రాలను నగరపాలక సంస్థ అవసరాలకు అనుగుణంగా సమకూర్చినా.. వీటిని పూర్తిస్థాయిలో సమర్థంగా వినియోగించుకోలేకపోయారు.

ఉపయోగించరు.. పరిరక్షించరు..

చెత్త తరలింపు వాహనాలతో పాటు మురుగు కాలువల్లో సిల్టు తొలగింపు, చెత్తను ట్రాక్టర్లలోకి చేర్చేందుకు యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. వాటిలో కొన్ని ఇరుకు రహదారుల్లో రాకపోకలు సాగించలేవంటూ మూలకు చేర్చారు. వాహనాలు నిలిపేందుకు షెడ్లు, టైర్లు, ట్యూబులు, ఇతరత్రా మరమ్మతులకు మెకానిక్‌ ఉండాలి. చెత్త తరలించిన తర్వాత వాహనాలను నీటితో కడగాలి. అలాంటి ఏర్పాట్లేమీ లేకపోవడంతో ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ తుప్పుపడుతున్నాయి. కొన్ని రెండు నెలలకే మరమ్మతులకు గురై మూలకు చేరాయి.

తగ్గని ఖర్చులు

అధునాతన వాహనాలు సమకూర్చితే ఖర్చు తగ్గాలి. కార్మికులను ఇతర పనులకు వినియోగించే వెసులుబాటు కలగాలి. ఇక్కడ మాత్రం రూ. కోట్ల విలువైన పరికరాలున్నా.. అద్దె వాహనాలు, అదనపు సిబ్బంది సేవలు తప్పడం లేదు. మురుగు కాలువల్లో పూడిక తీయడానికి.. ఇతర ప్రాంతాలకు చెందిన వారికి అదనంగా నగదు చెల్లించి తీసుకువస్తుండటం.. వాహనాల వినియోగ తీరుకు అద్దం పడుతోంది.


షెడ్డులో నిరుపయోగంగా...

మూలకు చేరినవి ఇలా..

ఈ-ఆటోలు: 25
407 లారీలు: 14
ఫాగింగ్‌ ఆటోలు: 3
డంపర్‌ పేసర్లు: 5
మిని స్వీపింగ్‌ మిషన్లు: 9
పెద్ద స్వీపింగ్‌ మిషన్లు: 2
స్ట్రీట్‌ లోడర్లు: 17
టీఎంఎస్‌20: 15
జటాయువులు: 20
పుష్‌కాట్లు: 350

జనాభా 10 లక్షలు
విస్తీర్ణం 149.2 చ.కి.మీ
రోజూ చెత్త ఉత్పత్తి 300 మె.ట.


ఉన్నతాధికారుల దృష్టికి

- సంపత్‌కుమార్‌, కార్పొరేషన్‌ ఎస్‌ఈ

వాహనాలు చాలా వరకు శిథిలావస్థకు చేరాయి. వాటికి మరమ్మతులు చేయించినా పనిచేసే పరిస్థితి లేదు. నేను కార్పొరేషన్‌ ఎస్‌ఈగా బాధ్యతలు తీసుకున్నప్పటికే వాహనాలు పక్కన పెట్టేసి ఉన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతాం.

Read latest Nellore News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts