logo

కొత్త మెనూ.. పాత రుచులు!

ఆలస్యంగా వడ్డించడం.. కూరలు రుచించకపోవడం.. సగానికి సగం మంది ఇళ్లకు వెళ్లితినడం.. కొందరు తినలేక పారవేయడం.. ఇవీ జగనన్న గోరుముద్ద అమలులో కనిపిస్తున్న లోపాలు.

Published : 29 Nov 2022 01:47 IST

మింగుడు పడని జగనన్న గోరుముద్ద

‘న్యూస్‌టుడే’ పరిశీలనలో భిన్నాభిప్రాయాలు

న్యూస్‌టుడే నెల్లూరు (విద్య)

ఆలస్యంగా వడ్డించడం.. కూరలు రుచించకపోవడం.. సగానికి సగం మంది ఇళ్లకు వెళ్లితినడం.. కొందరు తినలేక పారవేయడం.. ఇవీ జగనన్న గోరుముద్ద అమలులో కనిపిస్తున్న లోపాలు. వారం కిందట మారిన మధ్యాహ్న భోజన మెనూ ఇంకా రుచించడం లేదు. వడ్డిస్తున్న వంటకాలు కంటికి ఇంపుగా కనిపించడం తప్ప.. నోటికి మింగుడు పడటంలేదని కొందరు విద్యార్థులు చెబుతున్నారు. భోజన పథకంలో మార్పులు చేసి ఈనెల 21 నుంచి అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మధ్యాహ్న భోజనంపై ‘న్యూస్‌టుడే’ బృందం సోమవారం పరిశీలించగా.. కొంచెం ఇష్టం.. కొంచెం కష్టంగా ఉందని విద్యార్థులు తెలిపారు. 


57 శాతం మంది ఇంటికి

పులావ్‌పై భాగంలో కొత్తిమీర, పుదీనా వేసిన దృశ్యం

సంగం : సంగం జడ్పీ ఉన్నత పాఠశాలలో 367 మంది విద్యార్థులు హాజరు కాగా.. వారిలో కేవలం 158 మంది (43 శాతం) మాత్రమే భోజనం తిన్నారు. 57 శాతం మంది ఇళ్లకు వెళ్లారు. వారు ఒక కోడిగుడ్డు, చిక్కీని తీసుకెళ్లారు. భోజనంలో కూరగాయల పులావ్‌, కోడిగుడ్డు కూర వడ్డించారు. పులావ్‌లో కూరగాయలు నామమాత్రంగా కనిపించాయి. ఆ లోపం కనిపించకుండా కొత్తిమీర, పుదీనా ఆకులు చల్లి ఉంచారు. ఇక్కడ నలుగురు పనిచేయాల్సి ఉండగా ఇద్దరు మాత్రమే ఉన్నారు. దాంతో కోడిగుడ్లను విద్యార్థులతో శుభ్రం చేయించారు. సిబ్బంది తక్కువగా ఉండటంతో ఆహార పదార్థాల తయారీ ఆలస్యమవుతోంది. ఈక్రమంలో నాణ్యత దెబ్బతింటోంది. భోజనం తయారీ, విద్యార్థులకు వడ్డించే ప్రదేశాలు అపరిశుభ్రంగా ఉన్నాయి. ప్రధానోపాధ్యాయుడు డి.మాల్యాద్రిని వివరణ కోరగా ఎలాంటి లోపాలు లేకుండా భోజనం అందిస్తున్నామన్నారు.

కోడిగుడ్లను వలుస్తున్న విద్యార్థులు


కావలిలో అంతంత మాత్రం

కావలి : కావలి పట్టణంలోని కచ్చేరిమిట్ట, క్రిస్టియన్‌పేట పురపాలక ప్రాథమిక పాఠశాలల్లో మెనూ ప్రకారమే వడ్డిస్తున్నా నాణ్యత లేకుండా ఉంది. చిక్కీలు అందరికీ అందించారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు బిల్లులు, జీతాలు ఆరు నెలలుగా అందకపోవడంతో పరిశీలనకు వస్తున్న సచివాలయ సిబ్బంది సైతం లోపాలను గుర్తించినా మానవతా దృక్పథంతో మిన్నకుంటున్నారు. ః కచ్చేరిమిట్ట పాఠశాలలో మొత్తం 24 మంది విద్యార్థుల్లో ఒకరు తినలేదు. మరో ముగ్గురు ఇంటికి వెళ్లిపోయారు. పాఠశాలలో తిన్నవారిలో చాలా మంది కొంత తిని మిగతాది పారవేశారు. ః క్రిస్టియన్‌పేట పాఠశాలలో 29 మంది చిన్నారులకు అయిదుగురు హాజరు కాలేదు. పప్పొంగలిలో పెసరపప్పు కనిపించలేదు. కోగుడ్డు కర్రీ పలుచగా ఉంది. 20 నిమిషాలు ఆలస్యంగా వడ్డించారు.


కోవూరులో 66 మందికి ఇళ్లకు..

కోవూరు : కోవూరు జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో హెచ్‌ఎం నరసింహమూర్తి భోజనాన్ని రుచి చూసి విద్యార్థినులకు వడ్డించారు. ఇక్కడ 858 మంది ఉండగా సోమవారం 591 మంది హాజరయ్యారు. వీరిలో 525 మంది బాలికలు అన్నం తినగా.. మిగతా 66 మంది ఇళ్లకు వెళ్లారు. వీరికి కోడిగుడ్డు, చిక్కీని అందించారు.


దగదర్తిలో 100 మంది తినలేదు

దగదర్తి : మండలంలోని దగదర్తి, కట్టుబడిపాళెం ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించారు. కట్టుబడిపాళెం ఉన్నత పాఠశాలలో పూర్తిస్థాయిలో 229 మంది విద్యార్థులు భోజనం చేయగా.. దగదర్తిలో మాత్రం 289 మందికి 189 మంది పాఠశాలలో భోజనం చేశారు. మిగతా 100 మంది ఇళ్లకు వెళ్లి తిన్నారు.


మెనూ అమలుకు చర్యలు

సుబ్బారావు, ఇన్‌ఛార్జి డీఈవో

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించేందుకే ప్రభుత్వం మెనూ మార్చింది. కొత్తది పక్కాగా అమలు చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. దీనిపై పర్యవేక్షణ చేయిస్తున్నాం.

Read latest Nellore News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని