logo

కలల సాగులో కడగండ్లు

సుమారు 105 కి.మీ... 70వేల ఎకరాలు.. ఈ ఏడాది ఉత్తర కాలువ ద్వారా సాగునీరందించే ప్రతిపాదనలివి. నాణేనికి ఇది ఓ వైపు మాత్రమే. మరోవైపు.. దశాబ్దాలుగా ఉత్తర కాలువ జలాలకు ఎదురుచూసే రైతులు ఉన్నారు.

Published : 29 Nov 2022 01:47 IST

ఆత్మకూరు, ఎ.ఎస్‌.పేట, న్యూస్‌టుడే

సుమారు 105 కి.మీ... 70వేల ఎకరాలు.. ఈ ఏడాది ఉత్తర కాలువ ద్వారా సాగునీరందించే ప్రతిపాదనలివి. నాణేనికి ఇది ఓ వైపు మాత్రమే. మరోవైపు.. దశాబ్దాలుగా ఉత్తర కాలువ జలాలకు ఎదురుచూసే రైతులు ఉన్నారు. మా పెద్దలు ఈ ప్రయోజనాలు పొందకుండానే పరమపదించారు. మా తరంలో అయినా చూస్తామో.. లేదో అన్న ఆవేదన.. నిట్టూర్పు వారి నుంచి వ్యక్తమవుతోంది. వీరి మొరను అధికారులు ఆలకించాల్సిన అవసరం ఉంది.

ఆత్మకూరు మండలం బోయిళ్లచిరువెళ్ల నుంచి నెల్లూరుపాళెం వరకు ఉన్న గ్రామాలకు ఉత్తర కాలువ జలాలు అందడం లేదు. ఏడు గ్రామాల రైతులు ఈ నీటికి రెండు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నారు. అయినా.. అటవీ అనుమతులు లేక.. అసంపూర్తి పనులతో కాలువ సేవలు అందుబాటులోకి రావడం లేదు. గండ్లవీడు చెరువు పరిధిలోని రైతులు సైతం ఉత్తర కాలువపై ఎత్తిపోతల కోసం దశాబ్దాలుగా పోరాడి అలసిపోయారు. ఇక అనుమసముద్రంపేట మండలంలో మరో తీరు. చౌటభీమవరం వద్ద ఈ కాలువ పక్కనే చెరువు ఉన్నా.. నీటి పంపిణీ లేదు. చెరువు ఎత్తులో ఉండటంతో ఎత్తిపోతల ద్వారా అందుబాటులోకి తెస్తామన్నారు. ఆ ఊసే లేదు. వర్షం నీటిపైనే అధికంగా ఆధారపడే పరిస్థితి ఆయకట్టు రైతులది. శ్రీకొలను ఉప కాలువ హసనాపురం తర్వాత కొంత అసంపూర్తిగా ఉంది. దాంతో చెరువు అలుగు కాంక్రీట్‌వాల్‌ పగలగొట్టి చెరువు నీరు వెళ్లేలా చేశారు. దాంతో శ్రీకొలను వాసులు ఉత్తర కాలువ జలాల కోసం హసనాపురం చెరువు నిండే వరకు ఎదురు చూడాల్సి వస్తోంది. మరోవైపు మదారాబాద్‌ చెరువుకు నీటిని తరలించే కాలువ పనులు మధ్యలోనే ఆగాయి. దాంతో ఎప్పటికి ఈ చెరువుకు నీరు అందుతుందో తెలియని స్థితి. ఇలా ఉత్తర కాలువ జలాల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు.


హామీలు ఇస్తూనే ఉన్నారు..

- చీమల మాలకొండయ్య

నాయకులు హామీలు ఇస్తూనే ఉన్నారు. చెరువుకు ఉత్తర కాలువ జలాలు వస్తాయని ఎదురు చూస్తూనే ఉన్నాం. మా చెరువుకు నీటిని అందించే ఉప కాలువ పనులు మధ్యలోనే ఆగాయి. సోమశిల జలాలు ఎప్పటికి అందుతాయో.. ఏమో!


70 వేల ఎకరాలకు...

- వెంకట రమణారెడ్డి, ఈఈ సోమశిల ఉత్తర కాలువ డివిజన్‌

ఈ ఏడాది ఉత్తర కాలువ ద్వారా 70వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నాం. అటవీ అనుమతులు, భూసేకరణ సమస్యలతో 42ఆర్‌ పరిధిలో ఆయకట్టుకు సాగునీరు అందించలేకున్నాం. మదారాబాద్‌ ఉపకాలువ అసంపూర్తిగా ఉంది. శ్రీకొలను చెరువు వరకు సాగునీరు అందించాలనే లక్ష్యం ఉంది.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని