logo

కడప జిల్లా నుంచే వైకాపా పతనం ప్రారంభం

కడప జిల్లా నుంచే వైకాపా పతనం ప్రారంభం కాబోతోందని.. జగన్‌రెడ్డి ప్రభుత్వ అరాచకాలతో ఇదేం ఖర్మ అని రాష్ట్రంలోని ప్రజలందరూ తలలు పట్టుకుంటున్నారని మాజీ మంత్రి, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు.

Published : 29 Nov 2022 01:47 IST

తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి

మాట్లాడుతున్న మాజీ మంత్రి, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి

చిత్రంలో బీద రవిచంద్ర, అబ్దుల్‌ అజీజ్‌ తదితరులు

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), న్యూస్‌టుడే: కడప జిల్లా నుంచే వైకాపా పతనం ప్రారంభం కాబోతోందని.. జగన్‌రెడ్డి ప్రభుత్వ అరాచకాలతో ఇదేం ఖర్మ అని రాష్ట్రంలోని ప్రజలందరూ తలలు పట్టుకుంటున్నారని మాజీ మంత్రి, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. నెల్లూరులోని జిల్లా పార్టీ కార్యాలయంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన సర్వేపల్లి నియోజకవర్గం నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తెల్లవారి నుంచే రాష్ట్రంలో అవినీతి, అరాచకం, దోపిడీ, కక్ష సాధింపు చర్యలు రాజ్యమేలుతున్నాయని విమర్శించారు. తాను అధికారంలోకి వస్తే ఆక్వా రైతులకు విద్యుత్తు ఛార్జీలు యూనిట్‌ రూ. 1.50కే ఇస్తామని చెప్పిన జగన్‌రెడ్డి.. జోన్ల పేరుతో రైతుల నడ్డి విరగొట్టారన్నారు. సామాన్యుల జీవనం దుర్భరంగా మారిందని.. ఏట్లో దొరికే ఇసుక నుంచి పెట్రోల్‌ వరకు అన్నింటిలోనూ బాదుడే బాదుడు అన్నారు. వెంకటాచలం మండల కేంద్రంలోని సీతమ్మ చలివేంద్రం భూములపై కాకాణి అనుచరుల కన్ను పడిందని.. కనుపూరు కాలువలో అవినీతి ఊట పారుతోందని ఆరోపించారు. ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలోనే ఇరిగేషన్‌పరంగా రూ.70 కోట్ల అవినీతి జరిగిందని.. ఆర్టీఐ ద్వారా సమాచారం అడిగినా మంత్రికి భయపడి అధికారులు ఇవ్వని పరిస్థితి నెలకొందన్నారు. ఇదేం ఖర్మ పేరుతో చేపట్టిన కార్యక్రమం ద్వారా తెదేపా శ్రేణులు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లి వైకాపా ప్రభుత్వ దుర్మార్గాలపై చైతన్యవంతులను చేయాలన్నారు. సమావేశంలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, నెల్లూరు పార్లమెంట్‌ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌, నాయకులు పనబాక కృష్ణయ్య, తాళ్లపాక అనూరాధ, చేజర్ల వెంకటేశ్వర్లురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని