logo

కట్టేద్దాం.. అడిగేదెవరు?

ఇది పాత జడ్పీ కార్యాలయం సమీపంలో నిర్మిస్తున్న నూతన భవనం. టౌన్‌ ప్లానింగ్‌ అధికారుల అనుమతి తీసుకున్నా.. భవనం నిర్మిస్తున్న తీరే విస్తుబోయేలా చేస్తోంది.

Updated : 29 Nov 2022 06:48 IST

భవన నిర్మాణాల్లో యథేచ్ఛగా ఉల్లంఘనలు

ఈనాడు డిజిటల్‌, నెల్లూరు: నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే

ఇది పాత జడ్పీ కార్యాలయం సమీపంలో నిర్మిస్తున్న నూతన భవనం. టౌన్‌ ప్లానింగ్‌ అధికారుల అనుమతి తీసుకున్నా.. భవనం నిర్మిస్తున్న తీరే విస్తుబోయేలా చేస్తోంది. కనీస నిబంధనలు పాటించకుండా.. ఇష్టానుసారం నిర్మిస్తున్న ఈ భవనాన్ని చూసి నగరపాలక సంస్థ కమిషనర్‌ హరితనే అవాక్కయ్యారు. ఈ విధంగా నిర్మిస్తుంటే.. ఏం చేస్తున్నారంటూ టౌన్‌ప్లానింగ్‌ అధికారులపై మండిపడ్డారు. భవిష్యత్తులో పార్కింగ్‌ కష్టాలు వస్తే.. వాటిని తొలగించాల్సిన బాధ్యత మనది కాదా? అని నిలదీశారు. కనీసం ఇచ్చిన అనుమతులు ఏమిటి? భవనం ఏ విధంగా కడుతున్నారు? అన్న కనీస బాధ్యత మరిస్తే ఎలా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో అక్రమ భవన నిర్మాణాలకు ఇది ఓ ఉదాహరణ మాత్రమే.

నిబంధనల అమలుకు ఎక్కడా లేని ఒత్తిళ్లు అడ్డొస్తాయి.. కాసులు కట్టిపడేస్తాయి. అతిక్రమించాలంటే మాత్రం.. అన్ని చేతులూ ఏకమవుతాయి. అడ్డంకులన్నీ దూరమవుతాయి. నిబంధనలు గాలికొదిలేసి.. గాలిమేడల నిర్మాణాలను ప్రోత్సహిస్తారు. కళ్లున్నా చూడలేని పాలకులు.. అధికారమున్నా అడగలేని అధికారులతో ప్రభుత్వ ఉత్తర్వులు నిర్వీర్యమవుతన్నాయి. వెరసి.. అనువుగాని చోట ప్రమాదకర రీతిలో భవంతులు వెలిశాయి. కార్పొరేషన్‌కు ఫీజుల రూపంలో రావాల్సిన ఆదాయాన్ని దొడ్డిదారిన దండుకుంటున్న పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు.. అంతా మా ఇష్టం అన్నట్లుగా యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నారు.


ఈ బహుళ అంతస్తుల భవనం నెల్లూరు గ్రామీణ పరిధిలోనిది. లేఅవుట్‌కు ఎలాంటి ప్రభుత్వ అనుమతి తీసుకోలేదు. కనీసం వ్యవసాయ భూమిని.. వ్యవసాయేతరంగానూ మార్చుకోలేదు. మరి.. ఇంత పెద్ద భవనం నిర్మిస్తున్నా.. అధికారులు ఏం చేస్తున్నారనే ప్రశ్న తలెత్తుతోంది. ఒక వేళ అనుమతికి దరఖాస్తు చేసుకుని ఉంటే.. ఏ పత్రాలు చూసి అనుమతిచ్చారనే విషయం టౌన్‌ప్లానింగ్‌ అధికారులకే తెలియాలి. మొత్తంగా పరిశీలిస్తే.. అవినీతికి తోడు.. రాజకీయ అండతో అటువైపు అధికారులు కన్నెత్తి చూడటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.


సిబ్బంది కొరత పేరుతో...

గతంలో అక్రమ భవన నిర్మాణాలను కూల్చివేసే చర్యలున్నా.. నేడు పూర్తిగా ఆ విషయాన్ని అధికారులు విస్మరించారు. అతిక్రమణలపై గతంలో విజిలెన్స్‌ విభాగం దృష్టిసారించి కేసులు నమోదు చేసి.. ప్రభుత్వానికి రహస్య నివేదికలు పంపేవారు. ఇటీవల కాలంలో ఆ తనిఖీలు సైతం లేకపోవడంతో నగరపాలక సంస్థ ప్రణాళికా విభాగం అధికారుల ప్రత్యక్ష, పరోక్ష సహకారంతో అన్ని డివిజన్ల పరిధిలో పెద్దఎత్తున అనధికార, ప్లానుకు విరుద్ధంగా కట్టడాలు పెద్దసంఖ్యలో వెలుస్తున్నాయి. అదేమని ప్రశ్నిస్తే.. సిబ్బంది కొరత అని తప్పించుకుంటున్నారు. సీపీ పోస్టులో ఉన్న అధికారి దీర్ఘకాలిక సెలవులో ఉన్నారని.. డీసీపీ పోస్టు ఖాళీగా ఉందని చెబుతున్నారు. ఇద్దరు ఏసీపీలు ఉండాల్సి ఉండగా- ఒక్కరే ఉన్నారని, ఆరు టీపీఎస్‌ పోస్టులకు నలుగురే విధుల్లో ఉంటున్నారని.. దీంతో అక్రమ భవనాలపై దృష్టి పెట్టలేకపోతున్నామని చెబుతుండటం గమనార్హం.

చిల్లర కోసం.. రూ.కోట్లకు గండి

నగరపాలక సంస్థ అధికారులు.. టౌన్‌అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ ఆదేశాలకు భిన్నంగా వ్యవహరిస్తూ.. భవన నిర్మాణ నిబంధనలు.. ప్రభుత్వ ఉత్తర్వులు.. మార్టిగేజ్‌ షరతులు తుంగలో తొక్కుతున్నారు. అక్రమ నిర్మాణాలను అడ్డు పెట్టుకుని దోచుకోవడం.. దాచుకోవడమే వారి వ్యవహారంగా మారిపోయింది. అక్రమార్కులు ఇచ్చే చిల్లరకు కక్కుర్తిపడుతున్న కొందరు.. నగరపాలక సంస్థకు రావాల్సిన రూ.కోట్ల ఆదాయానికి గండికొడుతున్నారు. నిబంధనలు.. నిర్దేశిత చర్యలు.. ఫీజు రూపంలో ఎందుకంత చెల్లించాలి? ఎందుకొచ్చిన తలనొప్పి అనుకుంటున్న అక్రమ నిర్మాణదారులు.. వక్రమార్గాన కొందరు అధికారుల చేతులు తడుపుతూ తమ పని కానిచ్చేస్తున్నారు.


నాకేం తెలియదు.. కొత్తగా వచ్చా

 హయాత్‌, ఇన్‌ఛార్జి సిటీ ప్లానర్‌, నెల్లూరు

నెల్లూరు నగరంలో పరిస్థితి నాకు తెలియదు. నేను కొత్తగా వచ్చాను. పట్టణ ప్రణాళికా విభాగంలో ఉన్నతాధికారులు లేరు. దీంతో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకే సమయం పట్టేలా ఉంది. అనుమతి లేని భవనాలు ఎన్ని ఉన్నాయి? వాటిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో కూడా తెలియదు. నిబంధనలు అతిక్రమించి నిర్మిస్తున్న భవనాలపై దృష్టిసారిస్తాం. కమిషనర్‌ దృష్టికి తీసుకువెళ్లి తగు చర్యలు తీసుకుంటాం.

Read latest Nellore News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని