మేమిల్లు కడితే.. మీరు అంటకడతారా!
జగనన్న కాలనీల్లో సొంతింటి నిర్మాణం చేసుకుంటున్న వారికి అవస్థలు తప్పడం లేదు. ప్రభుత్వం ఇచ్చే నగదు సరిపోక.. అప్పులు తెచ్చుకుని మరీ ఇళ్లు కట్టుకుంటుంటే.. సామగ్రి కొనుగోలు చేయాలని అధికారులు ఒత్తిడి చేస్తుండటంతో లబోదిబోమంటున్నారు.
5 రకాల సామగ్రి ఇచ్చేందుకు ప్రభుత్వ నిర్ణయం
తీసుకునేందుకు లబ్ధిదారుల అనాసక్తి
ఓ గోదాములో ఉంచిన సామగ్రి
జగనన్న కాలనీల్లో సొంతింటి నిర్మాణం చేసుకుంటున్న వారికి అవస్థలు తప్పడం లేదు. ప్రభుత్వం ఇచ్చే నగదు సరిపోక.. అప్పులు తెచ్చుకుని మరీ ఇళ్లు కట్టుకుంటుంటే.. సామగ్రి కొనుగోలు చేయాలని అధికారులు ఒత్తిడి చేస్తుండటంతో లబోదిబోమంటున్నారు. కష్టపడి నిర్మించుకుంటున్న ఇంటికి సూచించిన సామగ్రి అమర్చుకోవాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మాకు నచ్చినవి అమర్చుకుంటామని తేల్చిచెబుతున్నారు. పైగా ప్రభుత్వం ఇచ్చే వాటికంటే.. బయట మార్కెట్‌లో లభించే సామగ్రి ధరలే తక్కువ ఉంటున్నాయని.. బలవంతంగా వాటిని అంటగట్టి.. ప్రభుత్వం ఇచ్చే నగదులో సరిపెట్టడం సరికాదని అడ్డం తిరుగుతున్నారు. దీంతో ఏం చేయాలో పాలుపోక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
ఈనాడు డిజిటల్, నెల్లూరు
పేదలందరికీ ఇళ్ల పథకం కింద ఒక్కో యూనిట్‌కు రూ. 1.80 లక్షలు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. గ్రామీణ ప్రాంతంలో రూ. 1.50 లక్షలు కేంద్రం ఇస్తుండగా- రూ.30వేలు నరేగా కింద సర్దుబాటు చేస్తున్నారు. పట్టణ ప్రాంతంలో రూ. 1.50 లక్షలు కేంద్రం ఇస్తుండగా- రూ.30వేలు రాష్ట్రం భరించాల్సి ఉంది. జిల్లాలో 277 లేఅవుట్లు ఏర్పాటు చేశారు. వీటిలో 72,062 ప్లాట్లు ఉండగా- కేవలం 44,609 మందికి రిజిస్ట్రేషన్ చేశారు. దీంతోపాటు సొంత స్థలాల్లో నిర్మించుకునేవారు 13,340 మంది ఉన్నారు. వీరికి ప్రభుత్వమే సిమెంట్, స్టీలు, ఇసుకను రాయితీపై సరఫరా చేస్తోంది. తాజాగా ఇళ్ల నిర్మాణంలో వాడే 15 రకాల నిర్మాణ సామగ్రిని లబ్ధిదారులు తీసుకోవాలని అధికారులు ఒత్తిడి చేస్తుండటం వారిలో అసంతృప్తిని పెంచుతోంది. నాణ్యత లేకపోవడం.. తలుపులు, కిటికీలు ఇనుపవి ఉండటం.. కొన్ని వస్తువులు బయట మార్కెట్ కంటే ఎక్కువ ధర ఉండటంతో తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. దీంతో జిల్లాకు వచ్చి సామగ్రి గోదాముల్లో మగ్గుతోంది.
అదే అడ్డొస్తోంది!
జిల్లాలో గృహ నిర్మాణాలు వేగంగా జరిగేందుకు జిల్లా యంత్రాంగం పలు చర్యలు చేపట్టింది. ఇటుక, కంకర ప్రజలకు సక్రమంగా అందించేందుకు కమిటీలు ఏర్పాటు చేసింది. అయినా ప్రయోజనం లేకుండా ఉంది. ఇటుకలు సక్రమంగా అందించకపోవడంతో చాలా ఇళ్లు మధ్యలోనే ఆగిపోయాయి. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గృహ నిర్మాణాల పురోగతిలో మరింత జాప్యానికి కారణమవుతోంది. జిల్లాలో శ్లాబ్ దశలో ఉన్న ఇళ్లను గుర్తించి.. వాటికి కావాల్సిన సామగ్రికి సంబంధించి ఇండెంట్ పెట్టమని అధికారులను ఆదేశించారు. రూ. కోట్లు ఖర్చు చేసి.. వస్తువులను కొనుగోలు చేశారు. వీటిని ఉంచేందుకు గోదాములు అద్దెకు తీసుకుని మరీ ఉంచారు. ప్రస్తుతం వాటిని తీసుకునేందుకు లబ్ధిదారులు ముందుకు రావడం లేదు. అవి తీసుకుంటేనే బిల్లులు చెల్లిస్తామని అధికారులు చెబుతుండటంతో.. ఈ ప్రభావం నిర్మాణాలపై పడింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బును ఖర్చు చేసినట్లు పత్రం(యూసీ) ఇస్తేనే మళ్లీ నిధులు మంజూరు చేస్తామని చెప్పడంతో.. కమిషన్ల కోసం సామగ్రిని కొనుగోలు చేసి జిల్లాలకు పంపించారని, ప్రస్తుతం వాటిని గోదాముల్లో ఉంచి అద్దెలు చెల్లించాల్సి వస్తోందని గృహ నిర్మాణశాఖకు చెందిన ఓ అధికారి తెలిపారు.
15 రకాలు.. రూ. 62వేలు
పట్టణాల్లో ప్రభుత్వం ఇచ్చిన సెంటు స్థలంలో లబ్ధిదారుడు 342 చదరపు అడుగుల విస్తీర్ణంలో పునాదులు, గోడలు, శ్లాబ్ మాత్రమే నిర్మించాల్సి ఉంది. పునాది పూర్తి చేస్తే రూ. 60వేలు, శ్లాబ్ వేస్తే రూ. 30వేల చొప్పున బిల్లులు చెల్లిస్తున్నారు. ప్లాస్టింగ్, వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణం పూర్తి చేస్తే.. మిగిలిన రూ. 30వేలు అందిస్తున్నారు. వాస్తవానికి లబ్ధిదారుడు శ్లాబ్ పూర్తి చేసే సరికే దాదాపు రూ. 2.60 లక్షల వరకు ఖర్చవుతుంది. ప్రభుత్వం ఇచ్చే నగదు మినహాయించినా.. సుమారు రూ. 80వేలు అప్పు అవుతుంది. ఇప్పటికే అద్దెలు కట్టలేక ఇబ్బందులు పడుతున్న ప్రజలు.. వచ్చిన కాడికి పూర్తి చేసుకుని ఇంట్లో చేరిపోదామని ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో తలుపులు, కిటికీలు, ఎలక్ట్రిక్ కిట్, పైపులు.. ఇలా 15 రకాల వస్తువులను సరఫరా చేస్తుంది. జిల్లాలోని 138 గోదాముల్లో వీటిని ఉంచగా.. అత్యధికంగా అవి కావలి అర్బన్ 20, అల్లూరు 16, వెంకటాచలం 14, కొడవలూరు మండలంలో 10 గోదాములు ఏర్పాటు చేశారు.
లబ్ధిదారుల ఇష్టంతోనే..
- నాగరాజు, పీడీ, గృహ నిర్మాణశాఖ
ప్రభుత్వం నుంచి పది రకాల నిర్మాణ సామగ్రి మాత్రమే వచ్చింది. వాటి నాణ్యత బాగుంది. లబ్ధిదారులకు చూపించిన తర్వాత.. వారి ఇష్టం మేరకే అందజేస్తున్నాం. వారిపై ఎలాంటి ఒత్తిడి చేయలేదు. వీలైనంత త్వరగా ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం.
డివిజన్ 4
మండలాలు 19
గోదా ములు 138
వచ్చిన సామగ్రి 40,624
లబ్ధిదారులకు ఇచ్చినవి 5323
గోదాముల్లో ఉన్నవి 35,301
శాతం 13
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Prince Harry: ప్రిన్స్ హ్యారీకి అమెరికా ‘బహిష్కరణ’ ముప్పు..!
-
India News
Amritpal Singh: అరెస్టైనవారికి సాయం చేస్తాం: అకాలీదళ్
-
Movies News
Social Look: శోభిత కాఫీ కథ.. సిమ్రత్ సెల్ఫీ.. మృణాళ్ విషెస్
-
Movies News
Rashmika: అప్పుడు విమర్శలు ఎదుర్కొని.. ఇప్పుడు రక్షిత్‌కి క్రెడిట్ ఇచ్చి
-
Politics News
Karnataka: మళ్లీ నేనే సీఎం అన్న బొమ్మై.. కలలు కనొద్దంటూ కాంగ్రెస్ కామెంట్!
-
World News
Russia: పుతిన్‌పై విమర్శలు గుప్పించిన రష్యన్ ‘పాప్‌స్టార్’ మృతి