logo

ఈ శుద్ధి బంగారం కానూ..!

సింహపురి.. ఇక్కడ దొరకని ఆహార ఉత్పత్తి ఉండదు. మామిడి, కమలా, నిమ్మ, అరటి, బొప్పాయి, సపోటా, వరి తదితర వ్యవసాయ ఉత్పత్తులే కాదు.. రొయ్యలు, చేపలు, గుడ్లు పుష్కలంగా ఉత్పత్తి చేసే జిల్లా మనది.

Published : 03 Dec 2022 02:23 IST

సింహపురి.. ఇక్కడ దొరకని ఆహార ఉత్పత్తి ఉండదు. మామిడి, కమలా, నిమ్మ, అరటి, బొప్పాయి, సపోటా, వరి తదితర వ్యవసాయ ఉత్పత్తులే కాదు.. రొయ్యలు, చేపలు, గుడ్లు పుష్కలంగా ఉత్పత్తి చేసే జిల్లా మనది. అందులో వినియోగిస్తున్నది మాత్రం కొంతే.. మిగిలిందంతా పారబోతే.. సుమారు 40 శాతం వృథాగా పోతోందని అంచనా.. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆహార శుద్ధి ప్లాంట్లు ఆశా కిరణంగా నిలుస్తున్నాయి. ఎక్కడా ఆహారం వృథా కాకుండా సిరులు కురిపిస్తున్నాయి.

ఈనాడు డిజిటల్‌, నెల్లూరు

ఆహార శుద్ధి రంగంలో సూక్ష్మ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దపీట వేస్తున్నాయి. ఔత్సాహికులకు 35 శాతం రాయితీతో రుణాలు అందిస్తున్నాయి. దీనిపై ప్రతి జిల్లాకు లక్ష్యాలు నిర్దేశించినప్పటికీ.. దరఖాస్తులు ఎక్కువగా వస్తే.. ఆ సంఖ్య పెంచే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వీటి ఏర్పాటులో మహిళా స్వయం సహాయక సంఘాలకు పెద్దపీట వేయనున్నారు. వారికి ప్రత్యేకంగా మూలనిధి సమకూర్చనున్నారు. ఇందుకోసం కేంద్రం ప్రధానమంత్రి ఆహారశుద్ధి పరిశ్రమ క్రమబద్ధీకరణ పథకం ద్వారా జిల్లాలో 200 యూనిట్లు నెలకొల్పాలని లక్ష్యం నిర్దేశించారు. దీంతో జిల్లాలో నిరుద్యోగులు పరిశ్రమల ఏర్పాటుకు పోటీపడుతున్నారు.

5.5 లక్షల ఎకరాల్లో సాగు

జిల్లాలో అన్ని రకాల పంటలు కలిపి సుమారు 5.5. లక్షల ఎకరాల్లో సాగు జరుగుతోంది. వరి ఎక్కువగా 4 లక్షల ఎకరాల్లో సాగు చేస్తుండగా- ఉద్యాన పంటలు 86వేలు, ఆక్వా 50 వేల ఎకరాల వరకు ఉంటుంది. వరి కాకుండా.. జిల్లాలో దాదాపు 6,06,950 మెట్రిక్‌ టన్నుల ఉద్యాన పంటలు ఉత్పత్తి అవుతుండగా- వీటిలో దాదాపు 40 శాతం వృథాగా మారుతోంది. రాయితీలు సద్వినియోగం చేసుకుంటే.. రైతులకు మేలు చేకూర్చడంతో పాటు ఆర్థికంగాను లబ్ధి పొందే అవకాశం ఉంది. స్వీట్‌ ఆరెంజ్‌ 41వేలు, బేర్‌ 68వేలు, పుచ్చకాయ 14,872 మెట్రిక్‌ టన్నుల చొప్పున.. వీటితో పాటు వివిధ రకాల ఆహార ఉత్పత్తులు జిల్లాలో అందుబాటులో ఉన్నాయి.

పది లక్షల వరకు రాయితీ

సూక్ష్మ ఆహారశుద్ధి పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి ప్రభుత్వం 35 శాతం రాయితీ అందిస్తోంది. ఈ పథకానికి 18-55 ఏళ్లవారు అర్హులు. జిల్లాలో ధాన్యం, అరటి, మినుము, పెసర, మొక్కజొన్న, కూరగాయాలు విస్తారంగా పండుతాయి. వీటి ఆధారంగా పరిశ్రమల ఏర్పాటుకు విస్తృత అవకాశాలు ఉన్నాయి. ఔత్సాహికులు 10 శాతం పెట్టుబడి పెడితే బ్యాంకు 90 శాతం రుణం ఇస్తుంది. మొత్తం పెట్టుబడి వ్యయంలో 35 శాతం రాయితీ లభిస్తుంది. ఇందులో 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్నాయి. ఈ రాయితీ యంత్రాలకు మాత్రమే వర్తిస్తుంది. గరిష్ఠంగా రూ.10 లక్షలకు మించకూడదనే నిబంధన ఉంది. పరిశ్రమ నిర్వహణ, అభివృద్ధికి కావాల్సిన శిక్షణ, యూనిట్‌ ఏర్పాటుకు సంబంధించిన అవగాహనను ఉద్యానశాఖ కల్పిస్తుంది. ప్యాక్‌ చేయకుండా తయారు చేసే వాటికి రాయితీ వర్తించదు.

సద్వినియోగంతో ప్రయోజనం

ప్రభుత్వం ఆహారశుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు రాయితీ రుణాలు అందిస్తోంది. జిల్లాలో ఔత్సాహికుల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నాం. నిరుద్యోగులకు ఇది మంచి అవకాశం. ఆహార వృథాను అరికట్టడంతో పాటు.. ఆర్థికంగానూ ఎదిగేందుకు ఉపయోగపడుతోంది. యూనిట్‌ ఎంపిక చేసుకుని అవసరమైన ధ్రువపత్రాలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తే రిసోర్సు పర్సన్లు పరిశీలించి జిల్లా కమిటీకి పంపుతారు. అర్హులైన వారందరికీ రుణాలు ఇస్తున్నాం. 

శ్రీనివాసులు, పీడీ ఏపీఎంఐపీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని