logo

ఈవీగోఅన్నా రావట్లే

సులభ వాయిదాల్లో విద్యుత్తు వాహనాలు అందించాలన్న ఈవీ ప్రాజెక్టుకు ఉద్యోగుల నుంచి స్పందన అంతంత మాత్రంగానే ఉంది.

Published : 03 Dec 2022 02:23 IST

సులభ వాయిదాల్లో విద్యుత్తు వాహనాలు అందించాలన్న ఈవీ ప్రాజెక్టుకు ఉద్యోగుల నుంచి స్పందన అంతంత మాత్రంగానే ఉంది. యాప్‌ అందుబాటులోకి వచ్చి.. వారాలు గడుస్తున్నా ఇప్పటికి 14 మంది మాత్రమే దరఖాస్తు చేసుకోవడం పరిస్థితికి అద్దం పడుతోంది.

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), న్యూస్‌టుడే

కాలుష్య నియంత్రణ.. పర్యావరణ పరిరక్షణ.. పెట్రో భారం తగ్గింపే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్తు వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఆ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈఎంఐ పద్ధతిలో వాటిని అందించేందుకు ప్రణాళిక చేసింది. ఇప్పటికే పలు జిల్లాల్లో నెడ్‌క్యాప్‌ ఆధ్వర్యంలో ఈవీ ప్రాజెక్టును అమలు చేస్తోంది. జిల్లాలోనూ ఏడు సంస్థలకు సంబంధించిన 17 రకాల మోడళ్లను అందుబాటులోకి తెచ్చారు. 38 వాయిదాల పద్ధతిలో రకాన్ని బట్టి రూ. 4329 నుంచి రూ.2321 వరకు చెల్లించేవి ఉన్నాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాప్‌లో ఉద్యోగులు విద్యుత్తు ఛార్జింగ్‌తో నడిచే బ్యాటరీ వాహనాల కోసం నమోదు చేసుకోవచ్చు.

వచ్చింది 14 దరఖాస్తులే...

జిల్లాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 50వేల మంది వరకు ఉంటారు. ఈవీ ప్రాజెక్టుకు వీరంతా అర్హులే. గత నెల మొదటి వారంలో దరఖాస్తు చేసుకోవచ్చని నెడ్‌క్యాప్‌ ప్రకటించింది. సంబంధిత యాప్‌ గురించి ఇప్పటికే ఉద్యోగులకు అవగాహన కల్పించారు. కానీ, రోజులు గడుస్తున్నా స్పందన అంతంత మాత్రంగానే ఉంది. ఇప్పటి వరకు 14 మంది మాత్రమే చేసుకున్నారు. వారిలో ముగ్గురికి చెందిన ప్రక్రియ పూర్తయి.. త్వరలో వాహనాలు అందించనున్నారు. మోడళ్ల ఎంపిక మొదలు.. ఆ శాఖ అధికారి ఆమోదం.. బ్యాంకు రుణం మంజూరు, వాహన సంస్థ బండి ఇచ్చే వరకు అన్ని దశలు కాగిత రహితంగానే చేయాల్సి ఉందని.. ఆ క్రమంలో నమోదు తక్కువగా ఉందని అధికారులు చెబుతుండగా- ఇటీవల కాలంలో ఈవీల్లో బ్యాటరీలు పేలుతుండటం.. రాయితీలు లేకపోవడం తదితర కారణాలతో స్పందన తక్కువగా ఉంటోందన్న ప్రచారం జరుగుతోంది. మరికొందరు ఈ ప్రాజెక్టు విజయవంతం కావాలంటే.. మరింత ప్రచారం, అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.

త్వరితంగా ఇచ్చేందుకు చర్యలు
- రామలింగయ్య, జిల్లా నెడ్‌క్యాప్‌ అధికారి

సులభ వాయిదాల్లో విద్యుత్తు వాహనాలను ప్రభుత్వ ఉద్యోగులకు అందిస్తున్నారు. యాప్‌ ద్వారా నమోదు చేసుకునే వారికి త్వరితంగా ఇచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని