logo

వాట్సాప్‌ ప్రశ్నపత్రాలు.. ఇబ్బందులు

ప్రభుత్వ పాఠశాలల్లో ఎఫ్‌ఏ-2 పరీక్షను వాట్సాప్‌ ఆధారంగా  నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశించింది. జిల్లాలో శుక్రవారం పరీక్షలు ప్రారంభమయ్యాయి.

Published : 03 Dec 2022 02:23 IST

పరీక్షకు హాజరైన విద్యార్థులు

సంగం, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల్లో ఎఫ్‌ఏ-2 పరీక్షను వాట్సాప్‌ ఆధారంగా  నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశించింది. జిల్లాలో శుక్రవారం పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కొన్ని ఇబ్బందులు తలెత్తాయని విద్యార్థులు, ఉపాధ్యాయులు వాపోతున్నారు. పరీక్షకు గంట ముందుగా ఉపాధ్యాయుల ఫోన్‌లోని వాట్సాప్‌కి ప్రశ్నపత్రం విడుదల చేస్తున్నారు. దీంతో ఉపాధ్యాయులు తరగతి గదిలోని బోర్డుపై రాయాల్సి వస్తోంది. విద్యార్థులు దాన్ని ప్రత్యేకంగా ప్రశ్నపత్రం రూపంలో నమోదు చేసుకుని ఆ తరువాత సమాధానాలు రాయాలని సూచించారు. ఇక్కడే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రశ్నపత్రాన్ని బోర్డుపై రాయడం ప్రాథమిక బడుల్లో సాధ్యపడటంలేదు. తొలి పరీక్ష అయిన తెలుగు ప్రశ్నపత్రం పరిశీలిస్తే అందులో వివిధ రకాల బొమ్మలున్నాయి. వాటిని సరిగా గుర్తించి జత చేయాలని సూచించారు. రెండోతరగతి తెలుగు ప్రశ్నపత్రంలో గులాబీ పుష్పం, తేలు, సూది, బెండకాయ తదితర చిత్రాలున్నాయి. వాటిని చిత్రలేఖన ఉపాధ్యాయులు మాత్రమే సక్రమంగా గీయగలరు. మిగిలిన వారికి కష్టమే. ఈ నేపథ్యంలో కొందరు ఉపాధ్యాయులు తమ సొంత ఖర్చుతో ప్రశ్నపత్రాలను ప్రింటు తీయించి పరీక్ష నిర్వహించారు. ఈ విద్యాసంవత్సరంలో నిర్వహించిన ఎఫ్‌ఏ-1 పరీక్ష సందర్భంగా విద్యాశాఖ ఆర్భాటం ప్రదర్శించింది.  వోఎంఆర్‌ విధానంలో పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులకు అవగాహన కలుగుతుందని ప్రకటించారు. ప్రస్తుతం ఆ విధానానికి తిలోదకాలిచ్చారు. ప్రస్తుత వాట్సాప్‌ విధానానికి స్వస్తి పలికి ప్రశ్నపత్రాల ఆధారంగా పరీక్ష నిర్వహించాలని విద్యార్థులు, వారి తల్లితండ్రులు కోరుతున్నారు.


విద్యార్థులకు అసౌకర్యం
- జి.జె. రాజశేఖర్‌, యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు

వాట్సాప్‌ ద్వారా ప్రశ్నపత్రం ఇవ్వటం, దాన్ని బోర్డుపై ఉపాధ్యాయుడు రాస్తే విద్యార్థులు రాసుకుని సమాధానాలు ఇవ్వటం తీవ్ర అసౌకర్యంగా ఉంది. పరీక్ష వ్యవధి 45 నిమిషాలు. ఇందులో ప్రశ్నపత్రం రాసుకునేందుకే సమయం సరిపోతోంది. సమాధానాలు ఎప్పుడు రాయాలి. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఒక ఉపాధ్యాయుడు అయిదు తరగతుల విద్యార్థులకు ఏవిధంగా ప్రశ్నపత్రం రాయాలో అధికారులు ఆలోచించాలి. ప్రభుత్వం ఈ విధానాన్ని మార్చాలి. ప్రశ్నపత్రాలు ఇచ్చి రాయించాలి. పాత పద్ధతినే అమలు చేయాలి.


ఇబ్బందులు లేకుండా చేస్తున్నాం
- జానకీం రాం, మండల విద్యాశాఖాధికారి

ప్రభుత్వ విధానం కొనసాగిస్తున్నాం. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చేస్తున్నాం. ఉపాధ్యాయులతో సమన్వయం చేసుకుని అవసరమైన చోట విద్యార్థులకు  ప్రశ్నపత్రాలు అచ్చు వేసి  ఇచ్చాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని