logo

అక్రమం చేయి తడిపితే సక్రమం

కల్తీ జరిగిందనో.. నాణ్యత లేదనో తేలితే తమ నివేదికను ఆహార తనిఖీ అధికారులకు అందజేస్తారు. దాని ఆధారంగా యంత్రాంగం సంబంధిత హోటల్‌ను సీజ్‌ చేస్తుంది.

Published : 04 Dec 2022 02:34 IST

ఆహార తనిఖీ విభాగంలో ఇంటి దొంగలు
కళ్లు మూసుకుంటున్న ఇతర విభాగాలు

సింహపురిలో నిత్యావసర సరకుల్లో కల్తీ జరిగితే ఎవరు గుర్తించాలి?

ఇంకెవరు జిల్లాలోని ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లే (ఆహార తనిఖీ అధికారులు)
మరి.. హోటళ్లలో నాణ్యత లేని ఆహార పదార్థాలను విక్రయిస్తే ఎవరు
పట్టుకోవాలి?
అడిగేదేముంది.. అదీ వారే..
తనిఖీ చేసి స్వాధీనం చేసుకున్న నమూనాలను ఎక్కడ పరీక్షిస్తారు?
హైదరాబాద్‌లోని ఐడీఏ నాచారంలోని రాష్ట్ర ఆహార ప్రయోగశాల(ఎస్‌ఎఫ్‌ఎల్‌)లో.. అక్కడ నిపుణులు రసాయన పరీక్షలు నిర్వహించి.. కల్తీ, నాణ్యతలను విశ్లేషిస్తారు. ప్రస్తుతం కొన్ని గుంటూరుకు పంపిస్తున్నారు.

కల్తీ ఉన్నట్లు తేలితే?

కల్తీ జరిగిందనో.. నాణ్యత లేదనో తేలితే తమ నివేదికను ఆహార తనిఖీ అధికారులకు అందజేస్తారు. దాని ఆధారంగా యంత్రాంగం సంబంధిత హోటల్‌ను సీజ్‌ చేస్తుంది.

ఈనాడు డిజిటల్‌, నెల్లూరు: నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే అంతా బాగానే ఉంది? జిల్లాలో.. మరీ ముఖ్యంగా నెల్లూరు నగరంలో అలాంటి చర్యలు కనిపించడం లేదే? తీసుకున్నా.. ఆ ప్రభావం కనిపించడం లేదే? నకిలీ ఉత్పత్తుల కార్ఖానాలు, మాంసం దుకాణాలపై ఇటీవల నగరపాలక సంస్థ అధికారులు దాడులు చేస్తూనే ఉన్నారు. ఆ క్రమంలో అనేక సరకుల్లో బండారం బయటపడుతూనే ఉంది. మరి ఇన్నాళ్లు ఆహార తనిఖీ అధికారులు ఏం చేశారు. అడపాదడపా దాడులు చేసినా కల్తీ లేదా? నకిలీ కేంద్రాలు మూతెందుకు పడటం లేదు అంటే.. అంతా చిదంబర రహస్యం.

అనుమతుల్లోనూ అడ్డదారే!

ఆహార నియంత్రణ పరిరక్షణ ప్రమాణాల చట్టం ప్రకారం.. ఆహార పదార్థాల తయారీదారుల మొదలు వీధుల్లో అమ్మే తోపుడు బండ్ల వరకు అందరూ అనుమతి, రిజిస్ట్రేషన్‌ పొందాల్సిందే. రూ. 12 లక్షల లావాదేవీలు జరిగే వ్యాపార సంస్థ కేవలం.. రూ. 100 చెల్లించి అనుమతులు తీసుకోవచ్చు. రూ. 12 లక్షల నుంచి రూ. 20 కోట్ల వరకు.. రూ. 2వేల నుంచి రూ. 3వేలతో ఏడాది లైసెన్సు పొందాల్సి ఉంది. జిల్లాలో ఇలా అనుమతి పొందిన వ్యాపారుల సంఖ్య తక్కువగానే ఉంది. దీనికోసం కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని.. సంబంధిత పత్రాలు జత చేస్తే సరిపోతుంది. దీంతో అక్రమాలకు తెరలేపిన అధికారులు.. గతంలో కార్యాలయంలో పనిచేసిన పొరుగుసేవల సిబ్బందినే బినామీగా మార్చుకున్నారు.  అనుమతి చేసుకునేందుకు ఎవరు వెళ్లినా.. మీరే ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చని చెబుతూనే.. ఫలానా చోటకు వెళితే చేసి పెడతారని అసలు విషయం బయటపెడుతున్నారు. అతడి ఫోన్‌ నంబరు ఇస్తున్నారు. రూ. రెండు, మూడు వేల నుంచి రూ. 10వేల నుంచి రూ.15వేల వరకు ఇలా వసూలు చేస్తున్నారు. దీంతో తీసుకునేందుకు చాలా మంది ముందుకు వెళ్లడం లేదు.

కొత్తగా వచ్చా..తనిఖీలు చేసి చర్యలు తీసుకుంటాం
- వెంకటేశ్వరరావు, అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌, నెల్లూరు

జిల్లాకు ఇటీవలే కొత్తగా వచ్చా. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలియదు. వెంటనే పరిశీలిస్తాం. అన్ని దుకాణాలను తనిఖీలు చేస్తాం. అనుమతి తీసుకోని వారిపై చర్యలు తీసుకుంటాం. అనుమతి కోసం ఎవరూ డబ్బు అదనంగా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా అడిగితే.. నేరుగా ఫిర్యాదు చేయండి. కఠిన చర్యలు తీసుకుంటాం.

వారే మధ్యవర్తులు

ఆహార తనిఖీ విభాగంలో పనిచేసే కొందరు ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు, గతంలో పనిచేసిన పొరుగు సేవల సిబ్బంది హోటళ్లు, నిత్యావసర సరకుల తయారీ యూనిట్లపై దాడులు చేస్తున్నారంటేనే ఏదో మతలబు ఉండే ఉంటుందనే పరిస్థితి నెలకొంది. మూడు నెలల కిందట నగరంలోని ఓ బేకరీని తనిఖీ చేశారు. కేకులు, కుకీస్‌ నమూనాలు సేకరించారు. ప్రయోగశాలకు పంపగా.. నాణ్యత లేదనే విషయం రూఢీ అయింది. వాస్తవానికి నమూనాలు సేకరించేటప్పుడు నాలుగు భాగాలుగా తీసుకుంటారు. ఒక భాగాన్ని రాష్ట్ర ఆహార ప్రయోగశాలకు పంపుతారు. నాలుగో భాగాన్ని రిజర్వుగా ఉంచుతారు. ఈ క్రమంలోనే కొందరు అక్రమానికి తెరలేపుతున్నారు. తొలుత రాష్ట్ర ఆహార ప్రయోగశాలలో కల్తీగా తేలితే చాలు.. ఆ నివేదికను బూచిగా చూపి యజమానులను బుట్టలో వేసుకుంటున్నారు. హోటల్‌నో.. తయారీ యూనిట్లనో మూసేస్తామని బెదిరిస్తున్నారు. దాంతో గండం గట్టెక్కించేలా చేయాలని యజమానులు వీరినే ఆశ్రయిస్తుండగా- క్లీన్‌చిట్‌ ఇప్పించే బాధ్యతను వీరే తీసుకుని సొంత లాభం చూసుకుంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని