logo

గ్రామీణ యువతులు..కబడ్డీలో ఘనులు

వారు పల్లెల్లో పుట్టారు.. పేద మధ్యతరగతి కుటుంబాలు. కుమార్తెలను ఉన్నత స్థానంలో చూడాలని తల్లిదండ్రులు శ్రమిస్తున్నారు. వీరి ఆశలకు తగినట్లుగా చదువుకుంటున్నారు

Published : 04 Dec 2022 02:34 IST

 

వారు పల్లెల్లో పుట్టారు.. పేద మధ్యతరగతి కుటుంబాలు. కుమార్తెలను ఉన్నత స్థానంలో చూడాలని తల్లిదండ్రులు శ్రమిస్తున్నారు. వీరి ఆశలకు తగినట్లుగా చదువుకుంటున్నారు. మరోవైపు ఆటలపై ఆసక్తి పెంచుకున్నారు. అందునా గ్రామీణ క్రీడగా గుర్తింపు పొందిన క్రబడ్డీపై మక్కువతో  సాధన చేసి రాటుదేలారు. పోటీల్లో ప్రతిభ చాటుతున్నారు. కోర్టులో దిగితే విజయం సాధిస్తారన్న గుర్తింపు తెచ్చుకున్నారు.  తల్లిదండ్రులకు పేరు తెచ్చారు కావలి నియోజకవర్గంలోని వివిధ సంస్థల్లో చదువుతున్న యువతులు. ఇటీవల జరిగిన పోటీల్లో జిల్లాలో ప్రథమస్థానంలో నిలిచారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈమేరకు శిక్షణ తీసుకుంటున్నారు.

కెప్టెన్‌గా ఆటో డ్రైవర్‌ కుమార్తె

జట్టు కెప్టెన్‌గా పట్టణంలోని చైతన్య డిగ్రీ కళాశాలలో చదువుతున్న కార్తిక వ్యవహరిస్తుంది. ఈమె 2018లో జరిగిన హాకీ జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని సత్తా చాటింది.  విశ్వవిద్యాలయం స్థాయిలో గతంలో ప్రథమస్థానంలో నిలిచిన కబడ్డీ జట్టులో కీలకపాత్ర పోషించింది. ఈమె తండ్రి గోవిందయ్య ఆటో డ్రైవర్‌, తల్లి జయమ్మ గృహిణి. ఏదైనా ఉన్నత ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో చదువుతుంది. ప్రభుత్వం తరఫున క్రీడా సదుపాయాలు విస్తృతమవ్వాలని కోరుతుంది.

తల్లి లేకున్నా క్రీడాకారిణిగా

అల్లూరుకు చెందిన లావణ్య ఓ మంచి క్రీడాకారిణిగా గుర్తింపు పొందుతుంది. ఈమె అల్లూరులోని రామకృష్ణ విద్యాసంస్థల్లో  డిగ్రీ చదువుతుంది. తండ్రి సతీష్‌ జాతీయ రహదారి అంబులెన్స్‌లో ఇఎంఐగా పనిచేస్తున్నారు. తల్లి మృతి చెందింది.  గతంలో రాష్ట్రస్థాయిలో జరిగిన పోటీల్లో పాల్గొంది.  ఒలింపిక్స్‌లో  పాల్గొనాలనే లక్ష్యంగా పెట్టుకొని శ్రమిస్తుంది.

నిఖిత ఆటల్లో దిట్ట

అల్లూరు మండలంలోని ఇస్కపల్లిపల్లిపాలేనికి చెందిన వి.నిఖిత అల్లూరులోని రామకృష్ణ విద్యాసంస్థల్లో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈమె తండ్రి శ్రీను మత్స్యకారుడు, తల్లి తిరుపతమ్మ గృహిణి.  ఆరేళ్లుగా ఆడుతోంది. వివిధ పోటీల్లో సత్తా చాటింది. సింహపురి విశ్వవిద్యాలయం తరఫున కూడా ఆడి ప్రథమస్థాయిలో నిలిచిన జట్టులో ప్రధాన పాత్ర పోషించింది. ఇతర క్రీడల్లో కూడా ఆసక్తి చూపుతోంది. పోలీసు అధికారిణి కావడం ద్వారా సమాజంలో శాంతికి, మహిళల సంరక్షణకు పాటు పడతానని ఈమె తన లక్ష్యాన్ని వివరించింది.  

రాష్ట్రయిలో గెలుస్తాం
- చిరంజీవి, కోచ్‌, కావలి కబడ్డీ జట్టు

మా కావలి జట్టు చాలా హుషారుగా ఉంది. జిల్లా స్థాయిలో ప్రథమస్థానంలో నిలవడం సంతోషంగా ఉంది. అందరు క్రీడాకారిణులు ఎంతో ఉత్సాహంగా ఆడుతున్నారు. రాష్ట్రస్థాయిలో కూడా ప్రతిభ చాటుకుంటాం. వేర్వేరు కళాశాలలకు చెందిన యువతులంతా సమన్వయంగా రాణిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని