logo

ఆ భవనంపై.. కోట్లాట!

నగరంలోని మినీబైపాసులో ఇటీవల ప్రారంభమైన ఓ భవనం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.

Published : 06 Dec 2022 01:27 IST

ఉల్లంఘన నిర్మాణాలపై ప్రజాప్రతినిధుల దందా
మూమూళ్ల మత్తులో అధికారులు
ఈనాడు డిజిటల్‌, నెల్లూరు

నగరంలోని మినీబైపాసులో ఇటీవల ప్రారంభమైన ఓ భవనం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనికి అధికార పార్టీలోని ఓ వర్గం అండగా ఉండగా.. భవన ప్రారంభ సమయంలో ఆహ్వానం లేకపోవడంతో గుర్రుగా చూస్తున్న మరో వర్గం ఆ కట్టడం అనుమతులు, నిబంధనలను తుంగలో తొక్కిన వైనంపై దృష్టిసారించింది. అడ్డగోలుగా నిర్మించిన ఈ భవనం వైపు నగరపాలక సంస్థ అధికారులు దృష్టిసారించక పోవడం గమనార్హం. భవన నిర్మాణం మొదలుకొని.. నిబంధల అతిక్రమణ వరకు రూ.కోటి వరకు చేతులు మారినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నెల్లూరు నగరంలోని మినీబైపాస్‌లో ఇటీవల ప్రారంభమైన వాణిజ్య భవనం కనీస నిబంధనలు పాటించకుండా.. ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతూ.. నిర్మించినా నగరపాలక సంస్థ అధికారులు కళ్లు మూసుకున్నారు. సాధారణంగా 600 గజాల కన్నా ఎక్కువ స్థలంలో కట్టే భవనానికి జీ+4 నిర్మించేందుకు అనుమతి ఇస్తారు. ఇక్కడ ఏకంగా జీ+7 నిర్మించారు. వాణిజ్య భవనం కావడంతో దాదాపు 33 శాతం పార్కింగ్‌ స్థలం ఉండేలా నిర్మాణం చేయాలి. భవన నిర్మాణానికి అన్ని వైపులా ప్రభుత్వ నిబంధనల ప్రకారం సెట్‌బ్యాక్‌లను వదలాల్సి ఉన్నా ఇరువైపులా కనీసం సెంటీమీటరు స్థలం వదలకుండా నిర్మించారు. భవనంలో ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే కనీసం చుట్టూ అగ్నిమాపక వాహనం తిరిగేందుకు వీల్లేకుండా ఉంది. కనీసం వినియోగదారులు వాహనాలు నిలిపేందుకు చోటు లేకపోవడం గమనార్హం. దీనిపై అధికారులను వివరణ అడిగితే.. మాకేం తెలియదని చెప్పడం గమనార్హం.

వైకాపాలో కుంపటి

నెల్లూరులోని అధికార పార్టీలో మరోసారి ముసలం ప్రారంభమైంది. అక్రమ భవనం ప్రారంభం కొత్త కుంపటి పెట్టింది. ఈ కార్యక్రమానికి కొందరిని పిలిచి.. మరికొందరిని దూరంగా ఉంచడంపై తీవ్ర చర్చ నడుస్తోంది. దాంతో మరో వర్గం అందులో లోపాలను వెతికే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం. ఇప్పటికే ఆ భవనం నిర్మాణంపై అభ్యంతరాలు తెలుపుతూ.. పక్క స్థలం వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం కౌంటర్‌ దాఖలు చేయాలని కార్పొరేషన్‌ అధికారులకు నోటీసులు జారీ చేసింది.

రూ.కోటి డీల్‌

నగరపాలక సంస్థ ఆదాయ వనరులను కాపాడాల్సిన కొందరు నాయకులు కంచె చేను మేసిన చందంగా అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. వారితో పాటు.. అనుచరులూ ఇటీవల కాలంలో అక్రమ కట్టడాలనే ప్రధాన ఆదాయ వనరులుగా ఎంచుకున్నారు. ఈ విషయంలో తమకు సహకరించని అధికారులపై వేటు వేసేందుకు వెనకాడటం లేదు. నగరంలోని మినీ బైపాసు వద్ద నిర్మించిన ఓ వాణిజ్య భవనం విషయంలోనూ ఇదే జరిగింది. గ్రామీణ నియోజకవర్గంలోని ప్రముఖ వైకాపా నాయకుడు ఈ వ్యవహారంలో రూ.కోటి చెల్లించేలా డీల్‌ చేసుకున్నట్లు సమాచారం. ఇందులో కార్పొరేషన్‌లోని ఓ ఉన్నతాధికారికి అటువైపు చూడకుండా ఉండేందుకు రూ.10 లక్షలు, ఇతర శాఖలకు కొంత మొత్తాన్ని పంచినట్లు ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. కనీసం అక్కడకు వచ్చే వినియోగదారుల భద్రతను గాలికొదిలేశారు. రూ.కోట్లు ఆదాయం కోల్పోయినా.. ప్రజల ప్రాణాలకు ముప్పు ఉన్నా.. పట్టించుకోకుండా అక్రమార్కులను ప్రోత్సహించిన తీరును నగరవాసులు తప్పు పడుతున్నారు. ఒక్క భవనంలోనే ఇంత మొత్తం చేతులు మారితే.. నగరంలో నిర్మాణమయ్యే భవనాలకు ఇంకా ఎంత దోచుకుంటున్నారనేది నగరంలో చర్చనీయాంశమైంది.

నాకేం తెలియదు : - హరిత, కమిషనర్‌, నగరపాలక సంస్థ

కొత్తగా నిర్మించిన ఆ భవనంపై నాకు ఎలాంటి సమాచారం తెలియదు. నేను రాక ముందు దానికి అనుమతి ఇచ్చారు. నేను దాన్ని పరిశీలించలేదు. ఏం ప్లాన్‌ తీసుకున్నారో కూడా తెలియదు. పరిశీలించి అక్రమ కట్టడమని తేలితే తగు చర్యలు తీసుకుంటాం.

డీజీ ఎన్‌వోసీ ఇచ్చారు

రెండేళ్ల నుంచి భవనాలకు సంబంధించి అగ్నిమాపక అనుమతులన్నీ ఆన్‌లైన్‌లో ఇస్తున్నారు. నూతన భవనానికి సంబంధించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. వారికి గతంలో ఉన్న అగ్నిమాపక శాఖ డీజీ ఎన్‌వోసీ ఇచ్చారు. దాని ప్రకారం పరికరాలు అమర్చారు. అంత కన్నా నాకేం తెలియదు.

శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా అగ్నిమాపక అధికారి
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని