logo

కుటుంబ మ్యాపింగ్‌లో.. సవరణలకు అవకాశం

సంక్షేమ పథకాలకు కీలకమైన కుటుంబ మ్యాపింగ్‌(హౌస్‌ హోల్డ్‌ మ్యాపింగ్‌)లో మార్పులు, చేర్పులకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.

Published : 25 Jan 2023 01:51 IST

కందుకూరు పట్టణం, న్యూస్‌టుడే: సంక్షేమ పథకాలకు కీలకమైన కుటుంబ మ్యాపింగ్‌(హౌస్‌ హోల్డ్‌ మ్యాపింగ్‌)లో మార్పులు, చేర్పులకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. కుమారుడు, కుమార్తె వివాహమై వేరుగా ఉంటున్నా.. తల్లిదండ్రులతో పాటు వారినీ ఒకే కుటుంబంగా భావిస్తూ.. ఇప్పటి వరకు లబ్ధిదారులను ఎంపిక చేశారు. ప్రభుత్వం ఆరంచెల విచారణలో (6 స్టెప్‌ వాలిడేషన్‌) భాగంగా కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరి పేరున ఆస్తులు, వాహనాలు ఉన్నాయన్న కారణాలతో కొందరిని పథకాలకు అనర్హులుగా ప్రకటించారు. అలాంటి వారందరికీ ఊరటనిచ్చేలా సవరణలకు అవకాశం కల్పిస్తూ సచివాలయాలకు తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

2019లో సర్వే..

రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో కుటుంబ మ్యాపింగ్‌ విధానాన్ని పాటిస్తోంది. దాని ఆధారంగానే పింఛను, వైఎస్సార్‌ చేయూత, విద్యా, వసతి దీవెనలు, ఆసరా, అమ్మఒడి, వాహనమిత్ర తదితరాలకు లబ్ధిదారులను ఎంపిక చేస్తోంది. గత తెదేపా ప్రభుత్వ హయాంలో ప్రజాసాధికార సర్వే పేరుతో కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేశారు. 2019లో వైకాపా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత. వాలంటీర్లు, సచివాలయ సిబ్బందితో సర్వే చేసి (హౌస్‌ హోల్డ్‌ మ్యాపింగ్‌) కుటుంబ సభ్యుల వివరాలు సేకరించి.. వారంతా ఓ కుటుంబంలా నమోదు చేశారు. కుమారుడు, కుమార్తెలకు పెళ్లిళ్లయి.. వేరుగా ఉంటూ.. రేషన్‌, బియ్యం కార్డులు వేర్వేరుగా ఉన్నా.. వారంతా ఒకే ఇంట్లో నివాసం ఉండటంతో ఒకే కుటుంబంలా భావించి మ్యాపింగ్‌ చేశారు. ఇతర ప్రాంతాల్లో ఉంటున్న కుటుంబ సభ్యులనూ ఆయా కుటుంబాల్లోనే కలిపారు. ఆ తర్వాత మార్పులు చేర్పులకు అవకాశం ఇవ్వకపోవడంతో సమస్యలు మొదలయ్యాయి. కుటుంబ సభ్యుల పేరుతో నాలుగు చక్రాల వాహనం ఉందని.. ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారని, ఇంటి స్థలం ఎక్కువ, విద్యుత్తు బిల్లు అధికంగా వినియోగిస్తున్నారంటూ.. కుటుంబంలో సంక్షేమ పథకాలు పొందుతున్న వారిని అనర్హులుగా ప్రకటించి లబ్ధి నిలిపివేశారు. కొత్తగా ఉద్యోగాలు సాధించిన సచివాలయ ఉద్యోగుల తల్లిదండ్రులకూ సమస్యలు వచ్చాయి. ఆ క్రమంలో మ్యాపింగ్‌లో సవరణలకు అవకాశం కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారు.


సచివాలయాలను సంప్రదించాలి
- ఎస్‌.మనోహర్‌, మున్సిపల్‌ కమిషనర్‌

కుటుంబ మ్యాపింగ్‌లో మార్పులు, చేర్పులు చేసుకునేందుకు సచివాలయాలను సంప్రదించాలి. వివాహమైన వారు భర్త కుటుంబంలోకి వెళ్లాలన్నా.. వేరుగా మ్యాపింగ్‌ చేయించుకోవాలన్నా.. వివాహ ధ్రువీకరణ పత్రం సమర్పించి మార్పులు చేయించుకోవచ్చు. ప్రభుత్వం సూచించిన ఆరు పత్రాల్లో.. ఏదో ఒకటి సమర్పించి సవరణలు చేయించుకోవాలి. లబ్ధిదారుల ఎంపికకు కుటుంబ మ్యాపింగ్‌ కీలకం. అందరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.


పదివేల కుటుంబాలకు ప్రయోజనం

జిల్లాలో సుమారు 6వేల మందికి పైగా సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో అధిక శాతం మందికి వివాహాలై వేరుగా ఉంటున్నా.. వారి తల్లిదండ్రులు, సోదరులకు పథకాలు నిలిచిపోయాయి. కుమార్తెకు పెళ్లి అయి అత్తవారింటికి వెళ్లినా.. తల్లిదండ్రులకు రేషన్‌కార్డు, పింఛన్లు నిలిచిపోయాయి. అలాంటి వారు ప్రస్తుతం భర్త కుటుంబంలో మ్యాపింగ్‌ చేయించుకునే అవకాశంతో పాటు దస్త్రాలపరంగా తల్లిదండ్రుల కుటుంబం నుంచి బయటకు వచ్చే అవకాశం లభించింది. ప్రస్తుత సవరణల వల్ల జిల్లా వ్యాప్తంగా పది వేలపైగా కుటుంబాలకు మేలు జరగనుంది. భర్తనో, భార్యనో మృతి చెంది.. పిల్లలకు దూరంగా ఉంటున్న వారిని సింగిల్‌ మ్యాపింగ్‌ చేయడంతో పాటు మృతులను తొలగించేలా అవకాశం ఇవ్వాలని పలువురు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని