logo

పర్యాటకం కునారిల్లి.. ఆహ్లాదం ఆవిరి

జిల్లాలో ప్రభుత్వ నిర్లక్ష్యంతో పర్యాటకం కునారిల్లుతోంది. పర్యాటక, దర్శనీయ, ఆహ్లాదం పంచే స్థలాల్లో వసతులు, సౌకర్యాలు సరిగాలేవు.

Published : 25 Jan 2023 01:51 IST

న్యూస్‌టుడే, కోవూరు

రామతీర్థంలో శిథిలమైన గదులు

జిల్లాలో ప్రభుత్వ నిర్లక్ష్యంతో పర్యాటకం కునారిల్లుతోంది. పర్యాటక, దర్శనీయ, ఆహ్లాదం పంచే స్థలాల్లో వసతులు, సౌకర్యాలు సరిగాలేవు. నిధుల్లేక ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఇందుకూరుపేట మండలంలోని మైపాడు బీచ్‌ వద్ద మౌలిక వసతులు కల్పించలేదు. కనీసం రహదారి సౌకర్యం లేదు. విడవలూరు మండలంలోని రామతీర్థంలో మరుగుదొడ్లు లేవు. తాగునీటి వసతి లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక్కడ కొన్ని గదులు నిర్మించి వదలేశారు. కొడవలూరు మండలంలోని జాతీయ రహదారి నుంచి నాయుడుపాళెం మీదుగా రామతీర్థంకు గతంలో ఉన్న రహదారి ధ్వంసమైంది. బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని వవ్వేరు వద్ద కాటన్‌దొర నిర్మించిన కనిగిరి రిజర్వాయర్‌ ప్రాంగణంలో గదులు, బల్లలు శిథిలమవడంతో పర్యాటకులకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. ఇక్కడి రహదారి పూర్తిగా ధ్వంసమైంది. కోవూరు మండలం పాటూరులో.. విడవలూరు మండలం తుమ్మగుంట అయ్యప్ప ఆలయం వద్ద సౌకర్యాలు కల్పించాలి.


పర్యాటక అభివృద్ధి ప్రకటనలకే పరిమితం

పడిపోయిన కట్టడాలతో అస్తవ్యస్తంగా ఉన్న రంగనాయకులస్వామి ఆలయ ప్రాంగణం

ఉదయగిరి: ప్రభుత్వాలు మారిపోతున్నా.. ఉదయగిరి పర్యాటక అభివృద్ధి ప్రకటనలకే పరిమితమైంది. ఎన్నికలప్పుడు, సందర్భం వచ్చిన సమయంలో ఉదయగిరి దుర్గాన్ని పర్యాటక ప్రాంతం చేస్తామంటూ హామీలు గుప్పిస్తున్న పాలకులు, అధికారుల మాటలు నీటి మీద రాతలుగానే మిగిలిపోతున్నాయి. రాజులు, నవాబులు, ఆంగ్లేయుల పాలన వైభవానికి ప్రతీకగా.. చక్కటి పచ్చదనం, ఎత్తైన కొండ శిఖరాలతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తూ చూపరులను ఆకట్టుకుంది ఈ దుర్గం. శ్రీకృష్ణదేవరాయలు పాలనలో విజయనగర సామ్రాజ్యానికి సింహద్వారంగా కొనసాగింది. ఉదయగిరి వీధుల్లో రత్నాలు రాశులుగా పోసి అమ్మారని ఇప్పటికీ పెద్దలు కథలు చెబుతుంటారు. అలనాటి రాజులు, నవాబుల కాలంలో మనస్సు దోచే శిల్పకళా నైపుణ్యంతో నిర్మితమైన అనేక కట్టడాలు కాలగర్భంలో కలిసిపోగా కొన్ని మాత్రం తీపిగుర్తుగా శిథిలావస్థకు చేరి దర్శనమిస్తున్నాయి. సరైన వసతుల్లేక ఆ వైపుగా అభివృద్ధి లేకపోవడంతో దుర్గం పర్యాటక అభివృద్ధి అనాదిగా హామీలు, ప్రకటనలకే పరిమితమైపోతుంది. పర్యాటకంగా అభివృద్ధి చేస్తే ఫలితం ఉంటుంది.


కండలేరు జలాశయం

రాపూరు: జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన రాపూరు మండలం కండలేరు, పెంచలకోన ప్రాంతాలను కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం పర్యాటక ప్రాంతాలుగా ప్రకటించింది. కానీ, 12ఏళ్లు దాటినా ఈ పర్యాటక ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో అభివృద్ధి పనులు జరగలేదు. పర్యాటకులకు అవసరమైన వసతులూ కొరవడ్డాయి. కండలేరులో బోటు షికారు, విశ్రాంతి గదులు ఏర్పాటు చేస్తే పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని స్థానికులంటున్నారు. ఏడాది పొడవునా లక్షల సంఖ్యలో భక్తులు, కోట్లలో ఆదాయం ఉన్న పెంచలకోన పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తుంటారు. ఇంత ప్రాధాన్యత ఉన్నందున దీన్ని టూరిజం కేంద్రంగా గుర్తించడం జరిగింది. బ్రహ్మోత్సవాల సమయంలో నెల్లూరు జిల్లా నుంచే కాకుండా కడప, ప్రకాశం, చిత్తూరు ఉమ్మడి జిల్లాలతోపాటు తమిళనాడు, కర్నాటక రాష్ట్రాట నుంచి కూడా భక్తులు వస్తుంటారు. ఇక్కడ వర్షాలు వస్తే కొండల నుంచి జలపాతం వస్తుంటుంది. దీన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. దీంతో ఆలయం దగ్గర నుంచి జలపాతం వరకు రహదారి సౌకర్యం, టూరిజం రెస్టారెంట్‌తోపాటు, సరిపడా అతిథి గృహాలు, వర్షాలు వచ్చినప్పుడు భక్తులు తలదాచుకునేందుకు గుడికి సమీపంలో యాత్రికుల హాల్స్‌, ఇంకా గదులు దొరకని భక్తులకు లాకర్‌ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తే పెంచలకోన పుణ్యక్షేత్రం స్థాయిలో ప్రసిద్ధి టూరిజంగా అభివృద్ధి చెందుతుందని స్థానికులంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని