logo

ధాన్యం కొనుగోళ్లలో... లోపాలు జరిగితే బాధ్యులు మీరే

ధాన్యం కొనుగోళ్లలో అడుగడుగునా జాగ్రత్తలు పాటించాలని.. ఆ విషయంలో పూర్తి బాధ్యత సిబ్బందే తీసుకోవాలని జేసీ కూర్మనాథ్‌ స్పష్టం చేశారు.

Published : 26 Jan 2023 01:54 IST

నెల్లూరు(జడ్పీ), న్యూస్‌టుడే: ధాన్యం కొనుగోళ్లలో అడుగడుగునా జాగ్రత్తలు పాటించాలని.. ఆ విషయంలో పూర్తి బాధ్యత సిబ్బందే తీసుకోవాలని జేసీ కూర్మనాథ్‌ స్పష్టం చేశారు. లోపాలు జరిగితే బాధ్యులవుతారని హెచ్చరించారు. జడ్పీ సమావేశ మందిరంలో బుధవారం సాయంత్రం ధాన్యం కొనుగోళ్లు- సేకరణపై సాంకేతిక సహాయకులు, గ్రామ వ్యవసాయ సహాయకులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, సేకరణ ఏజెన్సీ ప్రతినిధులకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జేసీ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలులో రైతుల సమక్షంలోనే పరిశీలన జరిపి వివరాలు, ఫొటోను పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలని ఆదేశించారు. ధాన్యం వాహనాల్లో లోడింగ్‌ చేసిన తర్వాత.. తూకం వేసి.. ఆ చిత్రాలనూ అప్‌లోడ్‌ చేయాలన్నారు. ధాన్యం లారీలను రైసు మిల్లులకు తరలించిన అనంతరం.. అక్కడ ప్రత్యేక అధికారి రైసుమిల్లులో అన్‌లోడింగ్‌ చేయించి.. ఆ చిత్రాలనూ పెట్టాలన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసి.. రైస్‌మిల్లులకు తరలించడంలో మిల్లర్ల ప్రమేయం ఉండరాదని అన్నారు. ప్రధానంగా రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం సేకరణపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించాలని ఆదేశించారు. రైస్‌ మిల్లర్లు రవాణా ఖర్చులను ముందుగా భరిస్తే.. సంబంధిత నగదును తిరిగి జమ చేస్తారన్నారు. శిక్షణలో జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, తూనికలు, కొలతలశాఖ అధికారి ఎస్‌.ఈశ్వరరావు, వ్యవసాయశాఖ నుంచి వై.రాధ, జిల్లా పౌరసరఫరాల సంస్థ సహాయ మేనేజరు ఇబ్రహీం, సహాయ అధికారి అంకయ్య, డిప్యూటీ తహసీల్దార్లు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని