logo

పెట్రోల్‌ బంకుల్లో నిబంధనల ఉల్లంఘన

కోవూరుకు చెందిన వెంకటేశ్వర్లు ఇనమడుగు మినీబైపాస్‌లోని ఓ బంకులో పెట్రోల్‌ కోసం వెళ్లాడు. ఇక్కడ కనీసం నీడ లేకపోవడంతో వినియోగదారులు రద్దీతో ఎండలోనే వేచి ఉండాల్సి వచ్చింది.

Published : 26 Jan 2023 01:58 IST

పట్టించుకోని అధికారులు
అవస్థ పడుతున్న వాహనదారులు
న్యూస్‌టుడే, కోవూరు

* కోవూరుకు చెందిన వెంకటేశ్వర్లు ఇనమడుగు మినీబైపాస్‌లోని ఓ బంకులో పెట్రోల్‌ కోసం వెళ్లాడు. ఇక్కడ కనీసం నీడ లేకపోవడంతో వినియోగదారులు రద్దీతో ఎండలోనే వేచి ఉండాల్సి వచ్చింది.
* కొడవలూరుకు చెందిన రాము జాతీయ రహదారిపై ఓ బంకులో ద్విచక్రవానం టైర్లకు గాలి పెట్టించేందుకు వెళ్లగా.. ఫలితం దక్కలేదు. ఇక్కడ పనిచేయని గాలి యంత్రాన్ని నామమాత్రంగానే ఏర్పాటు చేశారు.
* బుచ్చిరెడ్డిపాళెం పట్టణానికి చెందిన శ్రీకర్‌బాబు తన కారులో డీజిల్‌ కొట్టించేందుకు సమీపంలోని బంకుకు వెళ్లారు. నాణ్యతను పరిశీలించాలని కోరగా.. ఇక్కడ అలాంటి సౌకర్యాలు లేవని యాజమాన్యం చెప్పడంతో శ్రీకర్‌బాబు అవాక్కయ్యారు.
* కావలికి చెందిన శ్రీనివాసులు కోవూరు సమీపంలోని బంకులో తన కారులో డీజిల్‌ పోయించారు. చెన్నైకి వెళ్తున్న ఇతను బంకు ఆవరణలో మూత్రశాలల కోసం వెదికారు. ఈ సౌకర్యం లేకపోవడంతో సిబ్బందిని ప్రశ్నించారు. ఇక్కడ అలాంటివి ఉండవని జవాబివ్వడం గమనార్హం.
* కోవూరు-కొడవలూరు మధ్యలో జాతీయ రహదారిపై ఉన్న బంకులో భాస్కర్‌ తన ద్విచక్ర వాహనంలో రూ.200 పెట్రోల్‌ పోయించారు. కానీ, రీడింగ్‌ మాత్రం రూ.198.88 మాత్రమే వచ్చింది. ఇదేమని ప్రశ్నిస్తే మీటర్‌ అంతే వస్తుందని సిబ్బంది తెగేసి చెప్పారు.

.. ఇలా జిల్లాలోని పెట్రోల్‌ బంకుల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనలను పాటించడం లేదు. తూనికలు, కొలతలు, నాణ్యతా ప్రమాణాలను తుంగలో తొక్కి వాహనదారుల నుంచి అడ్డగోలుగా దోచుకుంటున్నారు. కళ్ల ఎదుటే అక్రమాలు జరుగుతున్నా పట్టించుకునేవారే లేరు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో బంకుల యజమానులు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నారు. కొందరు ప్రయాణికులు ఫిర్యాదు చేసే సమయం లేక మనసులోనే తిట్టుకొని వెళ్లిపోతున్నారు.

కనీస సౌకర్యాలు మృగ్యం

జిల్లాలోని ఎన్‌హెచ్‌-16, ముంబయి జాతీయ రహదారులున్నాయి. వీటిపై నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుండడంతో రహదారుల పక్కనే సుమారు 186పెట్రోల్‌ బంకులు ఏర్పాటు చేశారు. వీటికి తోడు మండల, పట్టణ కేంద్రాల్లో మరో 300వరకు ఉన్నాయి. వీటిలో లారీలు, ట్రావెల్‌ బస్సులు, ట్రాలీలు, టిప్పర్లు, ట్రాక్టర్లు, ద్విచక్రవాహనాలు, కార్లు పెట్రోలు, డీజిల్‌ కొట్టిస్తుంటారు. దూర ప్రయాణాలు సాగించేవారు అలసిపోయినప్పుడు ఈ బంకుల్లో సేద తీరేందుకు వసతి గదులు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, వాహనాలకు గాలిపట్టే యంత్రం, తాగునీటి సౌకర్యం.. ఉచితంగా సేవలు అందించాల్సి ఉంది. కానీ, జిల్లాలో చాలా పెట్రోల్‌ బంకుల్లో ఇలాంటి వసతులు కన్పించవు. అధికారులు వీటి యాజమాన్యాలతో కుమ్మక్కవుతున్నారని వినియోగదారులు ఆరోపించారు.

పెట్రోల్‌ కోత.. చిల్లర దోపిడీ: కోవూరుకు చెందిన రమేశ్‌ తన ద్విచక్రవాహనాన్ని ఇనమడుగు మినీబైపాస్‌లోని ఓ బంకులో రూ.50పెట్రోలు పోయిస్తే రూ.49.64కు మాత్రమే పెట్రోల్‌ పోశారు. ఇదేమని ప్రశ్నిస్తే ‘ఈ సారి మీకు పెట్రోలు పోసేది లేదు. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో’ అని సిబ్బంది దురుసుగా మాట్లాడడంతో రమేశ్‌ నివ్వెరపోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇలాంటి సంఘటనలు వాహనదారులకు నిత్యకృత్యంగా మారాయి.


కఠిన చర్యలు తప్పవు

కృష్ణప్రసాద్‌, సీఎస్‌డీటీ, కోవూరు

పెట్రోబంకుల్లో ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. ప్రతి బంకులో తప్పనిసరిగా మరుగుదొడ్లు, మూత్రశాలలు, తాగునీరు, గాలియంత్రం తప్పనిసరిగా ఉండాలి. జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి.. కఠిన చర్యలు తీసుకుంటాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు