logo

దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే..

దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని జేసీ రోణంకి కూర్మనాథ్‌ అన్నారు.

Published : 26 Jan 2023 01:58 IST

ప్రతిజ్ఞ చేయిస్తున్న జేసీ కూర్మనాథ్‌, అధికారులు

నెల్లూరు(కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని జేసీ రోణంకి కూర్మనాథ్‌ అన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకుని.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నిస్పక్షపాతంగా, బాధ్యతాయుతంగా ఓటుహక్కును వినియోగించుకోవాలని సూచించారు. నెల్లూరులోని శ్రీవెంకటేశ్వర కస్తూర్బా కళాక్షేత్రంలో బుధవారం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించారు. జేసీ కూర్మనాథ్‌, నగరపాలక సంస్థ కమిషనర్‌ డి.హరిత ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. యువత భాగస్వామ్యంతోనే మనదేశం లాంటి అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ విలువలు కాపాడగలమని అభిప్రాయపడ్డారు. గ్రామీణం కంటే.. పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్‌ శాతం తక్కువగా ఉందని, వారు కూడా ఎన్నికల ప్రక్రియలో కచ్చితంగా భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. ఆర్డీవో మాలోల మాట్లాడుతూ.. దేశంలో ఇప్పటికీ 67 శాతం మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సచివాలయ సిబ్బంది, బీఎల్వోలు, విద్యార్థినీ విద్యార్థులతో ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. వయోవృద్ధులైన ఓటర్లు కేవీ చలమయ్య, అరుణాచలం, కాళేశ్వరరావు, చాన్‌బాషా, కృష్ణమూర్తి, అరుణమ్మలను సత్కరించారు. వక్తృత్వ, వ్యాస రచన పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఓటు నమోదు, జాబితాల సవరణల ప్రక్రియ చక్కటి పనితీరు కనబరిచిన 24 మంది బీఎల్వోలకు అవార్డులు అందజేశారు. కార్యక్రమంలో సమగ్రశిక్ష ఏపీసీ ఉషారాణి, జిల్లా వృత్తి విద్యాశాఖ అధికారి మధుబాబు, డీకేడబ్ల్యూ కళాశాల ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్‌ వెంకటేశ్వర్లు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.  ః కలెక్టరేట్‌లో నిర్వహించిన ఓటరు దినోత్సవంలో డీఆర్వో వెంకట నారాయణమ్మ సిబ్బందితో ఓటు హక్కు వినియోగంపై ప్రతిజ్ఞ చేయించారు. ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. కలెక్టరేట్‌ పరిపాలనాధికారి షఫీమాలిక్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని