logo

భద్రతపై ప్రత్యేక దృష్టి

భద్రతపై పూర్తిస్థాయిలో ప్రత్యేక దృష్టి సారించినట్లు దిల్లీకి చెందిన చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ రైల్వే ఆర్‌.కె.శర్మ అన్నారు. బుధవారం గూడూరు నుంచి విజయవాడ వరకు ఆయన తనిఖీలు నిర్వహించారు.

Updated : 26 Jan 2023 03:52 IST

ఆర్‌.కె. శర్మ, చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ రైల్వే దిల్లీ

బిట్రగుంటలో తనిఖీలు నిర్వహిస్తున్న ఆర్‌.కె. శర్మ

బిట్రగుంట, నెల్లూరు (రైల్వే స్టేషన్‌), న్యూస్‌టుడే: భద్రతపై పూర్తిస్థాయిలో ప్రత్యేక దృష్టి సారించినట్లు దిల్లీకి చెందిన చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ రైల్వే ఆర్‌.కె.శర్మ అన్నారు. బుధవారం గూడూరు నుంచి విజయవాడ వరకు ఆయన తనిఖీలు నిర్వహించారు. ప్రధానంగా కీలకమైన వంతెనలు, గేట్లు, రైలు మార్గం పటిష్ఠతపై దృష్టి పెట్టారు. అందులో భాగంగానే బిట్రగుంటలో గార్డులు, డ్రైవర్ల క్రూకంట్రోల్‌ కార్యాలయం, రన్నింగ్‌ రూమ్‌ తదితర ప్రాంతాల్లో ఉద్యోగుల పనితీరు, భద్రతపై ఆరా తీశారు. అవసరమైన సూచనలు చేశారు. ఒకటో నంబరు ప్లాట్‌ఫాంపై భద్రతా విభాగాలు ఏర్పాటు చేసిన దుకాణాలను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. భారతీయ రైల్వే ప్రయాణికులు, సరకు రవాణా గమ్యం చేర్చేందుకు భద్రతాపరంగా అనేక ప్రత్యేక నిబంధనలు ప్రవేశపెట్టిందన్నారు. అవి పక్కాగా అమలు జరిగేలా పర్యవేక్షణణుంటుందన్నారు. అంతకు ముందు ఆయన నెల్లూరులోని ప్రధాన రైల్వేస్టేషన్‌ పరిశీలించారు. స్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించడంతో పాటు కొత్తగా నిర్మించిన భవనాలను సందర్శించారు. స్టేషన్‌ సూపరింటెండెంట్‌ ఎం.వి.ఎస్‌.ఎన్‌. కుమార్‌ ఆయా అంశాలను వివరించారు.

నాడు నివాసం ఉన్న బంగ్లా సందర్శన

* తనిఖీల్లో భాగంగా బిట్రగుంటకు వచ్చిన చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ రైల్వే ఆర్‌.కె.శర్మ.. తన ఉద్యోగ ప్రస్థానం ఇక్కడి నుంచే ప్రారంభమైందని వెల్లడించారు. 1991లో ఏడీ, టీఆర్డీ అధికారిగా బిట్రగుంటలో పనిచేసినట్లు చెప్పారు. అప్పట్లో ఆయన కాపురం ఉన్న బంగ్లాను అధికారులతో కలిసి సందర్శించారు. ఆయన వెంట విజయవాడ డివిజనల్‌ మేనేజరు సీవేంద్రమోహన్‌, బిట్రగుంట ఎస్‌ఎస్‌ ఖలీల్‌ అహ్మద్‌ఖాన్‌, క్రూ కంట్రోలర్‌ శేషయ్య, ఐవోడబ్ల్యూ రాజేష్‌, పీడబ్ల్యూఐ సీనియర్‌ సెక్షన్‌ ఇంజినీరు కృష్ణన్‌, వివిధ శాఖల జోనల్‌, డివిజనల్‌, స్థానిక అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని