logo

మహనీయుల స్ఫూర్తితో ప్రగతికి అడుగులు

దేశ స్వాతంత్య్రం కోసం ఎనలేని త్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకుంటూ.. భారత రాజ్యాంగ నిర్మాతలకు జోహార్లు తెలుపుతూ.. 74వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని కలెక్టర్‌ చక్రధర్‌బాబు అన్నారు.

Published : 27 Jan 2023 01:41 IST

గణతంత్ర వేడుకల్లో కలెక్టర్‌ చక్రధర్‌బాబు
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
ఈనాడు డిజిటల్‌, నెల్లూరు: కలెక్టరేట్‌, న్యూస్‌టుడే

పోలీసుల కవాతు

దేశ స్వాతంత్య్రం కోసం ఎనలేని త్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకుంటూ.. భారత రాజ్యాంగ నిర్మాతలకు జోహార్లు తెలుపుతూ.. 74వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని కలెక్టర్‌ చక్రధర్‌బాబు అన్నారు. నెల్లూరు నగరంలోని పోలీసు కవాతు మైదానంలో గురువారం గణతంత్ర దిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా కలెక్టర్‌ జాతీయ పతాకాన్ని ఎగరవేశారు.ఎస్పీ విజయరావుతో కలిసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. సాయుధ దళాల కవాతు ఆకట్టుకుంది. తర్వాత శాంతి కపోతాలు, త్రివర్ణ బెలూన్లను ఎగరవేశారు. ఈ సందర్భంగా చక్రధర్‌బాబు జిల్లా ప్రగతిపై మాట్లాడారు. రాజ్యాంగ స్ఫూర్తితో జిల్లాను ప్రగతి దిశగా ముందుకు తీసుకువెళుతున్నామని.. సంక్షేమమే పరమావధిగా ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రజల దరి చేర్చేందుకు 16,460 మంది వాలంటీర్లను నియమించినట్లు తెలిపారు. ప్రభుత్వం నవరత్నాల్లో భాగంగా అమలు చేస్తున్న పథకాల వల్ల జిల్లా ప్రజలకు ఒనగూరుతున్న లబ్ధిని వివరించారు. ప్రసంగం వివరాలు ఆయన మాటల్లోనే...

పట్టణాల్లో అభివృద్ధి పనులు

ఏఐఐబీ  సహకారంతో సమగ్ర తాగునీటి సరఫరా పథకం కింద నెల్లూరు నగరంలోని విలీన గ్రామాలకు తాగునీటిని అందించేందుకు చేపట్టిన పైప్‌లైన్‌ నిర్మాణం పురోగతిలో ఉంది. దీనికి రూ. 114.19 కోట్లు ఖర్చు చేస్తున్నాం. తఎన్‌డీబీ ప్రాజెక్టు కింద మండలం నుంచి జిల్లా కేంద్రానికి రెండు వరుసల రోడ్లు నిర్మించేందుకు రూ. 422.85 కోట్లతో 15 పనులు ఆమోదించాం. సీఆర్‌ఐఎఫ్‌ కింద 4 పనులు చేసేందుకు రూ. 115 కోట్లు కేటాయించాం. నాడు-నేడు కింద 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పూర్తి చేశాం. జల్‌జీవన్‌ మిషన్‌ కింద మొదటి విడతగా 1,941 పనులకు రూ. 253.16 కోట్లు మంజూరు కాగా.. ఇప్పటి వరకు రూ. 18.78 కోట్లు ఖర్చు చేసి 55,126 ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఇచ్చాం. ఐటీడీఏ కార్యాలయ ప్రాంగణంలో శాశ్వత ఆధార్‌ నమోదు కేంద్రం, సంచార ఆధార్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ వివరించారు.

అగ్నిమాపకశాఖ ప్రదర్శన

* ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి యామిని, జడ్పీ ఛైర్‌పర్సన్‌ ఆనం అరుణమ్మ, ఎమ్మెల్సీలు వాకాటి నారాయణరెడ్డి, బల్లి కల్యాణ్‌చక్రవర్తి, జేసీ ఆర్‌.కూర్మనాథ్‌, కందుకూరు సబ్‌ కలెక్టర్‌ ఎస్‌.ఎస్‌.శోభిక, వీఎస్‌యూ ఉపకులపతి ఆచార్య సుందరవల్లి, అదనపు ఎస్పీలు హిమవతి, ప్రసాద్‌, సబ్‌ జేడీ శ్రీలక్ష్మి, డీఆర్వో వెంకట నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు.

పారిశ్రామికాభివృద్ధికి తోడ్పాటు

బోగోలు మండలం జువ్వలదిన్నెలో రూ. 288.89 కోట్ల వ్యయంతో చేపట్టిన ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణానికి  76.89 ఎకరాలు సేకరించాం. అందులో డ్రెడ్జింగ్‌, బ్రేక్‌ వాటర్స్‌, టెట్రాపాడ్‌ వేయడం పూర్తయింది. 1250 పడవలకు బెర్తింగ్‌ సదుపాయం కలిగిన ఈ హార్బర్‌ ద్వారా 4 వేల మందికి ప్రత్యక్షంగా, 6వేల మందికి పరోక్షంగా లబ్ధి చేకూరుతుంది. 2021-22కి ‘బెస్ట్‌ మెరైన్‌ జిల్లా’గా జాతీయ అవార్డు లభించడం గర్వకారణం. ప్రధానమంత్రి జన వికాస కార్యక్రమం కింద ఉదయగిరి మండలంలోని కొండాయపాళెంలో రూ.47.26 కోట్ల అంచనాలతో ఎంపికైన ఎనిమిది పనులు నిర్మాణ దశలో ఉన్నాయి. ఏపీఐఐసీ పరిధిలో 7.04 ఎకరాల్లో పారిశ్రామిక ప్లాట్లను 12 పరిశ్రమలకు కేటాయించాం. రూ. 42.20 కోట్ల పెట్టుబడితో పెట్టే ఈ పరిశ్రమల ద్వారా 210 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మిథాని, క్రిబ్కో తదితర భారీ పరిశ్రమల ఏర్పాటుకు తగిన సౌకర్యాలు కల్పిస్తున్నాం. రూ.5,039 కోట్ల పెట్టుబడితో ప్రారంభమయ్యే పరిశ్రమల ద్వారా 1,940 మందికి ఉపాధి లభిస్తుంది. ఆత్మకూరు నియోజకవర్గంలో ‘ప్లాస్టిక్‌ ప్యాకేజింగ్‌’ పరిశ్రమల కోసం రూ. 23 కోట్లతో అభివృద్ధి చేసిన ఎంఎస్‌ఎంఈ పార్కు త్వరలో ప్రారంభం కానుంది. నెల్లూరులో రూ. వంద కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి కోసం నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని ఏపీఐఐసీకి కేటాయించాం. ఆటో నగర్‌లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 20 కోట్లతో డ్రెయిన్ల నిర్మాణం జరుగుతోంది. బొడ్డవారిపాళెం, కొత్తపల్లి కౌరుగుంట గ్రామాల్లో దాదాపు 90 ఎకరాల్లో ప్లాట్లను కేటాయించడంతో పాటు జిల్లా పరిధిలో 4,146 ఎకరాలు సేకరించి.. 22 పారిశ్రామిక వాడలుగా అభివృద్ధి చేశాం.

విజయీభవ రూపకం

పురోగతిలో సాగునీటి పథకాలు

రూ.500 కోట్లు ఖర్చు చేసి సంగం, నెల్లూరు బ్యారేజీలను పూర్తి చేశాం. రూ. 83.70 కోట్లతో చేపట్టిన సర్వేపల్లి కాలువ రిటైనింగ్‌ వాల్‌ పనులు 40 శాతం పూర్తయ్యాయి. సర్వేపల్లి రిజర్వాయరు శాశ్వత పునరుద్దీకరణ పనులు 60 శాతం జరగ్గా.. దీని కోసం రూ. 9.40 కోట్లు ఖర్చు చేస్తున్నాం. రూ. 75.03 కోట్లతో చేపట్టిన జాఫర్‌ సాహెబ్‌ కాలువ గోడల నిర్మాణం జరుగుతోంది. పెన్నా డెల్టా సిస్టంలోని మలిదేవి మేజర్‌ డ్రెయిన్‌ ఆధునికీకరణ పనులు రూ. 69.9 లక్షలతో చేపట్టగా.. 40 శాతం పూర్తి చేశాం. ఏపీఐఐసీ పథకం కింద రూ. 88.81 కోట్లతో చేపట్టిన 65 పనులు వేగంగా జరుగుతున్నాయి. ఏపీఐఎల్‌ఐపీ పథకం కింద 27 చెరువులకు.. 8 ప్యాకేజీలుగా రూ. 27.59 లక్షల పనులు చేస్తున్నాం. సంజీవరెడ్డి సోమశిల ఎత్తిపోతల పథకం కోసం రూ. 858.82 కోట్లు అగ్రిమెంట్‌ కుదుర్చుకోగా.. రూ. 532.52 లక్షలు ఖర్చు చేశాం.

భళా.. దింసా నృత్యం

జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పిస్తున్న కలెక్టర్‌, ఎస్పీ, ఇతర అధికారులు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు