logo

ఆ విచారణ కంచికేనా!

కావలి వెంగళరావునగర్‌, దక్షిణ జనతాపేట తదితర ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాలో తరచూ హెచ్చుతగ్గులు ఏర్పడి వినియోగదారులు అవస్థలు పడుతున్నారు. గత ఆదివారం (22.1.23న) కావలిలో పగటిపూట మూడు గంటలకు పైగానే అంతరాయం కలిగింది.

Published : 27 Jan 2023 01:41 IST

న్యూస్‌టుడే, కావలి

రూ. 1.2 కోట్ల ఖర్చు.. ఈ శిలాఫలకంతో సరి

కావలి వెంగళరావునగర్‌, దక్షిణ జనతాపేట తదితర ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాలో తరచూ హెచ్చుతగ్గులు ఏర్పడి వినియోగదారులు అవస్థలు పడుతున్నారు. గత ఆదివారం (22.1.23న) కావలిలో పగటిపూట మూడు గంటలకు పైగానే అంతరాయం కలిగింది. ఒక్కోసారి నడిరేయిలోనూ కరెంటు పోయి.. ఇబ్బందులు పడాల్సి వస్తోంది. గ్రిడ్‌ నుంచి పంపిణీ నిలిపివేత కాదని.. స్థానికంగా సరఫరాలో ఇబ్బందులేనని అధికారులు చెబుతున్నారు.

పశుసంవర్ధకశాఖ కావలి కార్యాలయం ఆవరణలో ఎనిమిదేళ్ల కిందట విద్యుత్తు సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి భూమిపూజ చేశారు. డిస్కం నిధులు రూ. 1.2 కోట్లు ఖర్చయినా.. అక్కడ సబ్‌ స్టేషన్‌ నిర్మాణమే జరగలేదు. అది ఎటుపోయిందనేది అంతుపట్టని వ్యవహారం. ఆ నిధులను తుమ్మలపెంట వద్ద ఏర్పాటు చేసిన ఇండోర్‌ సబ్‌స్టేషన్‌లోనే ఖర్చు చేశామని రికార్డుల్లో సర్దుబాటు చేసినా.. ప్రాథమిక విచారణలో అదంతా అవాస్తవమని తేలింది. ఏళ్లుగా విచారణ జరుగుతున్నా.. ఈ వ్యవహారం కొలిక్కిరాకపోవడం పలు సందేహాలకు తావిస్తోంది.

కావలి పురపాలక సంస్థ పరిధిలో విద్యుత్తు సరఫరాలో తరచూ అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ఏళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. పట్టణంలోని పలు ప్రాంతాల్లో సరఫరాలో హెచ్చుతగ్గులూ షరామామూలే అన్నట్లుగా ఉంది. హై ఓల్టేజీ కారణంగా చాలా ఇళ్లలో టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఇతర విద్యుత్తు ఆధారిత గృహోపకరణాలు దెబ్బతింటున్నాయి. మరి దీనికి పరిష్కారం లేదా? కారణాలు ఏమిటీ అంటే? ఇక్కడి సబ్‌స్టేషన్లు, ట్రాన్‌్్సఫార్మర్ల లెక్కల్లో తేడాలు! విద్యుత్తు తీగలు, నాటిన స్తంభాలకు సమగ్ర ఆడిట్‌ నిర్వహిస్తే కారణాలతో పాటు వాస్తవాలు వెలుగు చూస్తాయనే మాట వినిపిస్తోంది. రికార్డుల ప్రకారం నమోదైన వాటికి, క్షేత్రస్థాయిలో నెలకొల్పిన సంఖ్యకు వ్యత్యాసం ఉందన్న విమర్శలు నెలకొన్నాయి. అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నా.. అవసరమైనన్ని ట్రాన్స్‌ఫార్మర్లు ఎప్పటికప్పుడు నెలకొల్పుతున్నా.. సరఫరా మాత్రం మెరుగుపడటం లేదన్న అసంతృప్తి వ్యక్తమవుతోంది.

గతంలోనే ఒకరిపై చర్యలు

గతంలో మొత్తం రూ. 6 కోట్ల వరకు అవకతవకలు జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఓ అధికారిపై చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన కేసుల నుంచి విముక్తి పొందినా.. ఆ అక్రమాల పర్వంలో పలువురిపై విచారణ ఎంతకూ ఎడతెగకుంది. అయిదున్నరేళ్లుగా సాగుతూనే ఉంది. ఇందులో ఇంకా లోతుగా వెళితే.. అందరికీ అవస్థేనని.. అందుకే ఈ జాప్యం జరుగుతోందన్న విమర్శ నెలకొంది. విద్యుత్తు సంస్థలో అక్రమాల నియంత్రణకు సొంతంగా విజిలెన్స్‌ విభాగం ఉంది. చిన్నపాటి ఫిర్యాదులనూ పరిశీలిస్తుంటారు. ఎక్కడైనా అక్రమ కనెక్షన్లు ఉంటే.. కఠిన చర్యలు తీసుకుంటారు. భారీగా అపరాధ రుసుం విధిస్తుంటారు. ఇక్కడి వ్యవహారాలపై అలాంటి విజిలెన్స్‌ విచారణలు జరుగుతున్నా.. ఏసీబీ దృష్టికి కూడా ఈ వ్యవహారం వెళ్లింది.


ఏసీబీకి వివరాలిస్తున్నాం
- విజయకుమార్‌రెడ్డి, ఈఈ, ఏపీఎస్‌పీడీసీఎల్‌, కావలి డివిజన్‌

ఏసీబీ అధికారులు తరచూ వివిధ నివేదికలు కోరుతూనే ఉన్నారు. వారు అడిగినవన్నీ ఇస్తూనే ఉన్నాం.. అవన్నీ పాత విషయాలే. ప్రస్తుతం విద్యుత్తు సరఫరాలో ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా సమర్థంగా చూస్తున్నాం.


రికవరీకి ప్రయత్నిస్తున్నాం

రికవరీ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. ఇంజినీరింగ్‌ విభాగం అధికారులపై విచారణ కొనసాగుతోంది. మొత్తం 240 అంశాల్లో నిబంధనలకు విరుద్ధంగా నిధులు విడుదల చేశారు. ఇప్పటి వరకు 130 అంశాల్లో మాత్రమే వివరాలు అందజేశారు.

రామ్మోహన్‌, డీఎస్పీ, అవినీతి నిరోధకశాఖ, నెల్లూరు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు