logo

చర్చలతో సరి.. పరిష్కారంపై ఏదీ గురి?

జడ్పీ సర్వసభ్య సమావేశానికి మరోమారు అంతా సిద్ధమైంది. శుక్రవారం ఉదయం 10.30 గంటల నుంచి నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Published : 27 Jan 2023 01:41 IST

నేడు జడ్పీ సర్వసభ్య సమావేశం

నెల్లూరు(జడ్పీ), న్యూస్‌టుడే: జడ్పీ సర్వసభ్య సమావేశానికి మరోమారు అంతా సిద్ధమైంది. శుక్రవారం ఉదయం 10.30 గంటల నుంచి నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌, వ్యవసాయ తదితర ఆరు ప్రధాన శాఖలపై నేడు చర్చ జరగనుంది. ఈ పర్యాయం కూడా జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి హాజరయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. గత నవంబరులో జరిగిన సమావేశానికీ ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తప్ప ఎవరూ రాలేదు. మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి సభ్యుల సమస్యలను వింటూ.. తమ వంతుగా సమావేశాలను ముందుకు తీసుకువెళుతున్నారు.

కదలని పనులు.. వాస్తవానికి గత సమావేశాల్లో జరిగిన చర్చలకు తగ్గ పురోగతి ప్రగతి పనుల్లో కనిపించడం లేదనే అసంతృప్తి సభ్యుల్లో ఉంది. అందుకు అధికారులు ఇచ్చే నివేదికలే అద్దం పడుతున్నాయన్న మాట వినిపిస్తోంది. గ్రామ సచివాలయాల నిర్మాణాల్లో 669 భవనాలకు.. ఇప్పటి వరకు 370 లోపు మాత్రమే పురోగతిలో ఉన్నట్లు చూపుతున్నారు. గత సమావేశాల్లోనూ ఇవే లెక్కలు కనిపించాయి. గ్రామ ఆరోగ్య కేంద్రాలు, రైతు భరోసా కేంద్రాలు, డిజిటల్‌ లైబ్రరీలు, పాలశీతలీకరణ కేంద్రాలు.. ఇలా చెప్పుకొంటూ పోతే.. గడిచిన మూడు నెలలుగా వేటిలోనూ ఆశించిన మార్పు లేదు.

మళ్లీ అవే అంశాలేనా.. గత సమావేశంలో.. మా మండలంలో అనేక రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని, ఫలితం కానరాకుంటే తాను దీక్షకు కూర్చుంటానని మర్రిపాడు మండల జడ్పీటీసీ సభ్యుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. మా మండలంలో జరిగిన సీసీ రోడ్ల పనులకు సంబంధించిన బిల్లులు రాలేదని, ఆర్టీసీ బస్సుల సమస్య మొదలు.. అంగన్‌వాడీ భవనాల వరకు అన్నింటినీ కలువాయి సభ్యుడు ఏకరవు పెట్టారు. అనంతసాగరం, వాకాడు, సైదాపురం, వింజమూరు, ఉదయగిరి తదితర మండలాల్లో పీఆర్‌ నుంచి రహదారులు భవనాలశాఖ పనుల వరకు సభ్యులు ఆవేదన చెందారు. ఇప్పటికీ వాటిల్లో కదలిక లేదన్న ఆవేదన వ్యక్తమవుతోంది. మళ్లీ అవే అంశాలు చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అలా కాకుండా లేవనెత్తిన అంశాల్లో కొన్ని అయినా నెరవేరితే.. పరిష్కారమైతే బాగుంటుందన్న అభిప్రాయం జడ్పీటీసీ సభ్యుల్లో వ్యక్తమవుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు