logo

సూక్ష్మం.. దరిచేరని లక్ష్యం

బిందు, తుంపర సేద్య పరికరాలు రైతుల పొలాల్లో ఏర్పాటు చేసే పనులు సాగుతున్నాయి. త్వరితగతిన వాటిని అందజేస్తే తమకు మరింత ప్రయోజనకరంగా ఉంటుందని లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు.

Published : 27 Jan 2023 01:41 IST

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), న్యూస్‌టుడే

పొదలకూరు ప్రాంతంలో బొప్పాయి తోట (పాత చిత్రం)

బిందు, తుంపర సేద్య పరికరాలు రైతుల పొలాల్లో ఏర్పాటు చేసే పనులు సాగుతున్నాయి. త్వరితగతిన వాటిని అందజేస్తే తమకు మరింత ప్రయోజనకరంగా ఉంటుందని లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు.

తక్కువ నీటితో.. ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగుకు బిందు, తుంపర సేద్య పరికరాలు దోహదపడతాయి. దీంతో పర్యావరణ పరిరక్షణలో భాగంగా నీటి వృథాను అరికట్టడం.. భూగర్భ జలాలను సంరక్షించడం.. రైతులకు ఖర్చులు తగ్గించడం తదితరాల్లో భాగంగా రైతులకు ప్రభుత్వాలు వీటిని రాయితీపై అందిస్తున్నాయి. అయిదు ఎకరాల్లోపు ఉన్న వారికి బిందు సేద్య పరికరాలు 90 శాతం, అయిదెకరాలపై.. పది ఎకరాల వరకు 70 శాతం రాయితీ ఇస్తున్నాయి. తుంపర సేద్యం పరికరాలను అయిదు ఎకరాల్లోపు రైతులు 55 శాతం రాయితీపై పొందొచ్చు. రెండున్నర ఎకరాల్లోపు 30 పైపులు, 5 స్ప్రింక్లర్లు, 5 ఎకరాల్లోపు 41 పైపులు, 9 స్ప్రింక్లర్లు అందుతాయి. 5 నుంచి 12.50 ఎకరాల్లోపు 45 శాతం రాయితీ వర్తిస్తుంది. మూడేళ్ల తర్వాత.. గత ఏడాది మళ్లీ ఈ పథకం పట్టాలెక్కింది. 2022-23కు లక్ష్యాలు నిర్దేశించారు. జిల్లాలో చేజర్ల, రాపూరు, వరికుంటపాడు, కలువాయి, పొదలకూరు, సైదాపురం తదితర ప్రాంతాల్లో సూక్ష్మ సేద్యం కింద పంటలు ఎక్కువగా సాగవుతున్నాయి. సుదీర్ఘ విరామం తర్వాత రాయితీ పథకం అందుబాటులోకి రావడంతో పెద్దఎత్తున రైతులు గ్రామస్థాయిలో ఆయా పరికరాలకు దరఖాస్తు చేసుకున్నారు.

ఇప్పటి వరకు 1873 హెక్టార్లలోనే..

జిల్లా వ్యాప్తంగా 2022-23 సంవత్సరానికి అయిదు వేలకు పైగా హెక్టార్లలో సూక్ష్మ సేద్యాన్ని అమలు చేయాలనుకున్నా... దాన్ని 2,900 హెక్టార్లకు మార్చి లక్ష్యం నిర్దేశించారు. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన ఆంధ్రప్రదేశ్‌ సూక్ష్మనీటి విభాగం (ఏపీఎంఐపీ) అధికారులు అర్హత ఉన్న వారిని ఎంపిక చేసి సర్వే చేశారు. ఇప్పటి వరకు 1873 మంది రైతులకు సంబంధించి.. 2204 హెక్టార్లలో బిందు, తుంపర సేద్యం పరికరాల ఏర్పాటుకు పరిపాలన అనుమతి లభించింది. అందులో 1550 హెక్టార్లకు సంబంధించి.. 1351 మందికి రాయితీపై పరికరాలను అందించారు.


నిర్దేశిత లక్ష్యాన్ని పూర్తి చేస్తాం

ఈ ఏడాది జిల్లాలో సూక్ష్మసేద్యం ప్రాజెక్టు కింద నిర్దేశించుకున్న 2,900 హెక్టార్లల్లో బిందు, తుంపర సేద్య పరికరాలను ఏర్పాటు చేస్తాం. 1550 హెక్టార్లకు సంబంధించిన రాయితీ పరికరాలను అందించాం. మిగిలిన పనులను.. గడువులోపే పరికరాలను అందజేస్తాం. 

శ్రీనివాసులు, జిల్లా సూక్ష్మసేద్య పథకం అధికారి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు