logo

జల్‌జీవన్‌.. లక్ష్యానికి దూరం

జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ కుళాయిల ద్వారా తాగునీరు అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ‘జల్‌ జీవన్‌ మిషన్‌(జేఎంఎం) పథకాన్ని అమల్లోకి తెచ్చారు.

Published : 29 Jan 2023 01:58 IST

సంగం మండలం పరిధిలో పైపులైను పనులు పరిశీలిస్తున్న అధికారులు

ఈనాడు డిజిటల్‌, నెల్లూరు: జడ్పీ, న్యూస్‌టుడే: జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ కుళాయిల ద్వారా తాగునీరు అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ‘జల్‌ జీవన్‌ మిషన్‌(జేఎంఎం) పథకాన్ని అమల్లోకి తెచ్చారు. 2024 నాటికి పనులు పూర్తి చేసి.. నీరందించేలా గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు ప్రణాళిక రూపొందించారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించిన ఈ పథకం పనులను నాలుగేళ్లపాటు విడతల వారీగా పూర్తి చేయాలన్నది లక్ష్యం. ఇప్పటికీ మూడేళ్లు గడిచినా.. సకాలంలో గుత్తేదారులకు బిల్లుల చెల్లింపు జరగకపోవడంతో జిల్లాలో పురోగతి ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. మార్చి 2024 నాటికి పనులు పూర్తి చేయాలన్న లక్ష్యం ఆచరణలో అమలయ్యేలా కనిపించడం లేదు.

లక్ష్యం సాధించేనా..

జల్‌ జీవన్‌ మిషన్‌ కింద 2022-23లో లక్ష కుటుంబాలకు కుళాయి కనెక్షన్లు ఇచ్చేందుకు మంజూరు తీసుకోగా.. ఇప్పటి వరకు 55,126 ఇళ్లకు మాత్రమే ఇచ్చారు. మరో 44,874 కుటుబాలకు ఇవ్వాల్సి ఉండగా.. మార్చి నెలాఖరు నాటికి లక్ష్యాలు పెట్టుకున్నారు. జరుగుతున్న పనులు చూస్తే.. ఇది సాధ్యపడేలా కనిపించడం లేదు. జిల్లాలో మొత్తం రూ. 193.50 కోట్లతో 1601 పనులు మంజూరు చేయగా.. 772 ప్రారంభించారు. 350 టెండరు దశలో ఉన్నాయి. 439 పనులకు ఒప్పందం చేసుకున్నా.. గుత్తేదారులు ముందుకు రావడం లేదు. ఆరు నెలలుగా బిల్లులు మంజూరు కాకపోవడంతో.. పనులు ప్రారంభం కాలేదు. మార్చి నెలాఖరులోపు బిల్లులు వస్తాయని.. పనులు వేగవంతం చేయాలని అధికారులు పదేపదే కోరుతున్నా.. గుత్తేదారులు స్పందించడం లేదు. అప్పులు తెచ్చి.. పెట్టిన పెట్టుబడులకు వడ్డీలు కట్టలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


రూ. 8.46 కోట్ల బకాయిలు

జేఎంఎం పథకానికి వెచ్చిస్తున్న నిధుల్లో 50 శాతం కేంద్రం భరిస్తుండగా- 50 శాతం రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తోంది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రూ. 5 లక్షలు, రూ. 40 లక్షలు, రూ. 2 కోట్లపైన విలువైనవిగా విడగొట్టి.. టెండర్లు పిలిచి గుత్తేదారులకు అప్పగిస్తున్నారు. విలువ ఆధారంగా డివిజన్‌, సిర్కిల్‌ కార్యాలయాల్లో టెండర్లు పిలిచి ఆమోదిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా పిలిస్తే గుత్తేదారులు ఆసక్తి చూపడం లేదు. మండలాల వారీగా అదే పరిస్థితి.. దీంతో పనుల వారీగా టెండర్లు పిలిచి ఒప్పందం కుదర్చుకుంటున్నారు. కేంద్ర భాగస్వామ్యం ఉండటంతో బిల్లులు వస్తాయన్న ఉద్దేశంతో.. మొదట్లో వేగంగా ప్రారంభమయ్యాయి. అందుకు తగ్గట్టుగానే బిల్లులు అందాయి. గత ఆరు నెలలుగా చెల్లింపులు నిలిచిపోయాయి. ఆ మొత్తం రూ. 8.46 కోట్లుగా ఉండటంతో.. ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయాయి. ఒకరిద్దరు.. అదీ మొక్కుబడిగా చేస్తున్నట్లు ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులే చెబుతున్నారు.


త్వరితంగా పూర్తి చేసేలా చర్యలు
శ్రీనివాసకుమార్‌, ఈఈ, ఆర్‌డబ్ల్యూఎస్‌

జల్‌జీవన్‌ మిషన్‌ పథకాన్ని త్వరితంగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నాం. బిల్లులు పెండింగ్‌లో ఉన్న మాట వాస్తవమే. ఆ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. త్వరలోనే వస్తాయని తెలిపారు. నగదు పడిన వెంటనే వేగం పెంచుతాం. కొందరు జడ్పీటీసీ సభ్యులు పలు మండలాల్లో సమస్యలు ఉన్నట్లు చెప్పారు. వాటిని వీలైనంత త్వరగా పరిష్కరిస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని