logo

దోపిడీ అధనం!

మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా నిత్యావసర సరకుల ధరలు పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు గ్యాస్‌ సిలిండరు  గుదిబండగా మారింది. గ్యాస్‌ కంపెనీలు నిర్ణయించిన ధరకు అదనంగా డోర్‌ డెలివరీ సిబ్బంది వసూలు చేస్తున్నారు.

Updated : 30 Jan 2023 05:39 IST

వినియోగదారులపై ఏటా రూ.47.16 కోట్ల భారం
న్యూస్‌టుడే, నెల్లూరు (కలెక్టరేట్‌)

* అనంతపురంలో ఓ వినియోగదారును గ్యాస్‌ సిలిండరు డెలివరీ బాయ్‌ రూ.30 అదనంగా ఇవ్వాలని కోరాడు. ఆ మొత్తం ఇవ్వనందుకు సిలిండరును వెనక్కి తీసుకెళ్లిపోయాడు. దాంతో ఆ వ్యక్తి వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. వాదనలు విన్న తర్వాత రూ.లక్ష పరిహారం చెల్లించాలని ఫోరం తీర్పునిచ్చింది.

* నెల్లూరు నగరంలో డెలివరీ సిబ్బంది రూ.40 నుంచి రూ.50 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. గ్రామాల్లో రూ.50 నుంచి రూ.70 వరకు తీసుకుంటున్నారు.

మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా నిత్యావసర సరకుల ధరలు పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు గ్యాస్‌ సిలిండరు  గుదిబండగా మారింది. గ్యాస్‌ కంపెనీలు నిర్ణయించిన ధరకు అదనంగా డోర్‌ డెలివరీ సిబ్బంది వసూలు చేస్తున్నారు. దాంతో ఎవరికి చెప్పుకోవాలో వినియోగదారులకు తెలియడం లేదు. గ్యాస్‌ ఏజెన్సీల సరఫరాను పర్యవేక్షించే జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కనీసం దాడులు చేసిన దాఖలాల్లేవు. దాంతో ఏజెన్సీల సిబ్బంది ఇష్టారాజ్యంగా వసూళ్లకు పాల్పడుతున్నారు.

నిబంధనలున్నా.. బేఖాతర్‌

జిల్లాలో 7,87,483 గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. ప్రతి ఇంట్లో నెలకు ఒక్కో సిలిండరును వినియోగిస్తున్నారు. వంట గ్యాస్‌పై ఇస్తున్న రాయితీని కేంద్ర ప్రభుత్వం దశల వారీగా ఉపసంహరించుకుంది. 14 కిలోల సిలిండరు ధర ప్రస్తుతం రూ.1098లకు చేరుకుంది. దీనికితోడు రవాణా ఛార్జీల పేరుతో జిల్లా కేంద్రమైన నెల్లూరులో దూరాన్ని బట్టి రూ.40 నుంచి రూ.50 వసూలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలకు వారానికోసారి గ్యాస్‌ సిలిండర్ల సరఫరా వాహనం వెళుతోంది. ఎక్కువ మంది వ్యవసాయ కూలీలు, ఇతర పనులకు వెళ్లేవారు కావడంతో ఆటో మళ్లీ ఎప్పుడు వస్తుందోనని ముందస్తుగా సిలిండర్లను నిల్వ ఉంచుకుంటున్నారు. ఒక్కో సిలిండరుకు సిబ్బంది రూ.60 వరకు తీసుకుంటున్నారు. గ్యాస్‌ ఏజెన్సీకి 5 కిలోమీటర్ల పరిధిలోని వినియోగదారుల నుంచి రవాణా ఛార్జీలు వసూలు చేయకూడదు. 15 కిలోమీటర్ల వరకు రూ.20, ఆపై దూరానికి రూ.30 ఛార్జీగా వసూలు చేస్తారు. సిబ్బంది ఈ నిబంధనలు పట్టించుకోవడం లేదు. ఎవరైనా బిల్లుపైన ధరే కదా అని ప్రశ్నిస్తే ‘ఇష్టమైతే తీసుకోండి.. లేకపోతే గోదాము వద్దకు వచ్చి తీసుకెళ్లండి’ అంటూ బెదిరింపులకు దిగుతున్నారు. కొందరు వినియోగదారులు గోదాము వద్దకు వెళ్లినా అక్కడ కూడా అదనంగా వసూలు చేస్తుండటం గమనార్హం.

ఒప్పందాలతోనే..

ఒక్కో డెలివరీ బాయ్‌ రోజుకు 60 సిలిండర్ల వరకు సరఫరా చేస్తుంటాడు. ఒక్కో దానికి సరాసరిన రూ.50 చొప్పున అదనంగా వసూలు చేసినా రూ.3 వేల వరకు ఆర్జిస్తున్నాడు. ఈ మొత్తంలో సగం ఏజెన్సీకి ఇవ్వాల్సి ఉందని వారు చెబుతున్నారు. చాలాచోట్ల ఏజెన్సీ యజమానులతో ముందస్తు ఒప్పందం చేసుకుని రవాణాదారులు ఆటోలు పెట్టుకుంటున్నారు. జిల్లాలోని 7,87,483 కుటుంబాలు నెలకు ఒక్కో సిలిండరు చొప్పున వినియోగించినా దాదాపు రూ.3.93 కోట్ల అదనపు భారం మోయాల్సిన పరిస్థితి. ఈమేరకు ఏడాదికి రూ.47.16 కోట్ల దోపిడీ జరుగుతోంది.


జిల్లాలో మొత్తం గ్యాస్‌ ఏజెన్సీలు : 49  

మొత్తం కనెక్షన్లు : 7,87,483  

గృహ అవసరాల సిలిండర్లు : 4,64,871  

దీపం : 2,67,421 

ఉజ్వల : 18,986  

సీఎస్‌ఆర్‌ : 33,589  

వాణిజ్య  : 2,616


నగదు వసూలు చేస్తే కఠిన చర్యలు

వెంకటేశ్వర్లు, డీఎస్‌వో

వినియోగదారుల నుంచి అదనంగా నగదు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. అయిదు కిలోమీటర్లలోపు వారి నుంచి అదనంగా ఒక్క రూపాయి కూడా తీసుకోకూడదు. బిల్లుపై ఎంత ఉంటే అంతే వసూలు చేయాలి. తనిఖీలు నిర్వహించి అలాంటి వారిపై చర్యలు తీసుకుంటాం.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని