logo

వసతిగృహాల్లో నాడు- నేడు పనులెన్నడో..?

ప్రభుత్వ భవనాల్లో నిర్వహిస్తున్న సాంఘీక సంక్షేమశాఖ వసతిగృహాలను నాడు-నేడు పథకంలో అభివృద్ధి చేసేందుకు ఐదు నెలల క్రితం అధికారులు ఎంపిక చేశారు.  వాటికి సంబంధించిన నిధులు, ఇతర వివరాలను ఉన్నతాధికారులకు నివేదించారు.

Published : 30 Jan 2023 01:48 IST

న్యూస్‌టుడే, దుత్తలూరు, కలిగిరి

నాడు-నేడు పథకం కింద ఎంపికైన కలిగిరి మండలం శిద్ధనకొండూరు వసతిగృహం

ప్రభుత్వ భవనాల్లో నిర్వహిస్తున్న సాంఘీక సంక్షేమశాఖ వసతిగృహాలను నాడు-నేడు పథకంలో అభివృద్ధి చేసేందుకు ఐదు నెలల క్రితం అధికారులు ఎంపిక చేశారు.  వాటికి సంబంధించిన నిధులు, ఇతర వివరాలను ఉన్నతాధికారులకు నివేదించారు. నూతన భవనాల నిర్మాణం కాకుండా మరమ్మతులు చేసేందుకు ప్రాధాన్యమిచ్చారు. నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. వసతిగృహాల్లో నెలకొన్న సమస్యలతో విద్యార్థులు నిత్యం సతమతమవుతున్నారు. ఉదయగిరి సహాయ సంక్షేమశాఖ పరిధిలో మొత్తం ఎనిమిది సాంఘీక సంక్షేమ శాఖ వసతిగృహాలున్నాయి. వీటిల్లో నాడు- నేడు పథకం కింద ఆరు ఎంపిక చేశారు.  సీతారామపురం, కలిగిరి మండలం శిద్ధనకొండూరు, వింజమూరుతో పాటు మర్రిపాడు మండలంలోని మూడు దాకా ఉన్నాయి. వసతిగృహాల్లో భవనాల గోడలు, శ్లాబ్‌ పైకప్పు మరమ్మతులు చేయడం, తాగునీటి సౌకర్యం, విద్యుత్తు తీగలు బహిరంగంగా కనిపించకుండా పైపులు వేయడం, గోడలపై చిత్రలేఖనం, వసతిగృహాల ప్రాంగణాలను సుందరంగా తీర్చిదిద్దడం వంటి పనులు చేయాలని అధికారులు నిర్ణయించారు. విద్యార్థుల సంఖ్యననుగుణంగా మరుగుదొడ్లు, స్నానపు గదులు నిర్మించేందుకు అనుమతి ఇచ్చారు.

నిధుల కోసం ఎదురుచూపులు...

నివేదికలు పంపించి నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. గత జూన్‌ నెలలో ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.  అక్టోబరులో అధికారులు నివేదికలు పంపించారు. అప్పటి నుంచి ప్రభుత్వం నుంచి నిధుల విడుదలతో పాటు ఎలాంటి ఉత్తర్వులు రాకపోవడంతో అసలు పనులు జరుగుతాయే లేదోనని అధికారులు సందిగ్ధంలో ఉన్నారు.


ఉన్నతాధికారులకు  నివేదించాం

ఆదిలక్ష్మీ, ఏఎస్‌డబ్ల్యూవో, ఉదయగిరి

ఉదయగిరి సాంఘీక సంక్షేమశాఖ పరిధిలో ఉన్న ఎనిమిది వసతిగృహాల్లో ఆరు వసతిగృహాలను ఎంపిక చేశాం. అక్కడున్న సమస్యలు, వాటికయ్యే ఖర్చులకు సంబంధించి ఉన్నతాధికారులకు నివేదికలు పంపించాం. నిధులు విడుదల కాగానే వసతిగృహాల్లో పనులు ప్రారంభించేలా తగిన ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాం. ప్రస్తుతం వసతిగృహాల్లో విద్యార్థులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని