logo

గుట్టలు కరిగాక.. గోతుల్లో వేట!

గ్రావెల్‌ మాఫియాపై చర్యలకు ఎట్టకేలకు రెవెన్యూ యంత్రాంగం కదలింది. మూడేళ్లుగా కళ్లుమూసుకున్న అధికారుల్లో.. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశంతో చలనం వచ్చింది.

Updated : 01 Feb 2023 05:59 IST

కావలిలో గ్రావెల్‌ తవ్వకాలపై రెవెన్యూలో కదలిక
చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు లేఖలు

ఈనాడు డిజిటల్‌, నెల్లూరు

రుద్రకోట సమీపంలో లీజు రద్దయిన ప్రాంతంలో మైనింగ్‌ తవ్వకాలు

గ్రావెల్‌ మాఫియాపై చర్యలకు ఎట్టకేలకు రెవెన్యూ యంత్రాంగం కదలింది. మూడేళ్లుగా కళ్లుమూసుకున్న అధికారుల్లో.. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశంతో చలనం వచ్చింది. ఇప్పటి వరకు ప్రజాప్రతినిధుల అడుగులకు మడుగులు ఒత్తిన సిబ్బంది సైతం.. ఇక మా వల్ల కాదంటూ చేతులెత్తేసే పరిస్థితి వచ్చింది. ఆదేశాలు బేఖాతరు చేస్తే క్రిమినల్‌ కేసులు పెడతామని హెచ్చరించడంతో గతి లేక పోలీసులకు లేఖలు రాయాల్సి వచ్చింది.  కావలి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో అక్రమంగా గ్రావెల్‌ తరలిస్తున్నారని.. వాటికి రెవెన్యూశాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేవని.. రాత్రిళ్లు మరీ ఎక్కువగా దోపిడీ జరుగుతోందని.. వాటిని అడ్డుకుని కేసులు కట్టాలని తహసీల్దార్లు పోలీసులను కోరడం చర్చనీయాంశమైంది. ఇదేదో ఒక మండలంలో జరిగింది కాదు.. కావలి నియోజకవర్గంలోని అన్ని మండలాల తహసీల్దార్లు చర్యలు తీసుకోవాలని పోలీసులకు లేఖలు రాయడం అక్కడి పరిస్థితులకు అద్దం పడుతోంది.

జిల్లాలో నాణ్యమైన ఎర్రమట్టి నిల్వలకు కొదవ లేదు. కావలి, కోవూరు, ఆత్మకూరు, సర్వేపల్లి, నెల్లూరు గ్రామీణ నియోజకవర్గాల్లో విస్తారంగా ఉంది. దానిపై కన్నేసిన కొందరు అక్రమార్కులు వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తవ్వకాలు ప్రారంభించారు. రాత్రిపగలు తేడా లేకుండా భారీ యంత్రాలతో తవ్వకాలు జరుపుతూ.. టిప్పర్లతో జిల్లాలోని లేఅవుట్లతో పాటు.. పక్క జిల్లాలకూ విక్రయించి జేబులు నింపుకొంటున్నారు. ఆ క్రమంలో ప్రభుత్వ, ఇరిగేషన్‌ భూములతో పాటు అటవీ భూములనూ వదలడం లేదు. దాంతో ఎత్తయిన తిప్పలు కాస్త చెరువులుగా మారాయి. ఈ పరిస్థితులపై ‘ఈనాడు’ వరుస కథనాలు ప్రచురించగా.. అధికారులు స్పందించారు. ఇప్పటికే కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాళెంలోని వవ్వేరు పరిధిలో కనిగిరి రిజర్వాయరు ప్రాంతంలో జరుగుతున్న అక్రమ తవ్వకాలను అడ్డుకున్నారు. మైనింగ్‌ శాఖతో ఆ ప్రాంతాన్ని సర్వే చేయిస్తున్నారు. రెండు వారాల కిందట దగదర్తి మండల పరిధిలో రెండు టిప్పర్లను, ఒక పొక్లెయిన్‌ను పట్టుకున్న మైనింగ్‌ అధికారులు.. తహసీల్దారుకు అప్పగించారు. దాంతో జిల్లాలోని చాలా చోట్ల గ్రావెల్‌ తవ్వకాలు నిలిచిపోగా.. కావలి నియోజకవర్గంలో మాత్రం అడ్డుకట్ట పడలేదు. దీంతో కలెక్టర్‌, జేసీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. దాంతో చేసేదేమీ లేక.. తమ పరిధిలో గ్రావెల్‌ తవ్వకాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని.. ఎవరైనా తీసుకువెళుతుంటే చర్యలు తీసుకోవాలంటూ తహసీల్దార్లు పోలీసులను ఆశ్రయించారు.

అయినా.. దోపిడీ ఆగితేనా..

కావలి నియోజకవర్గంలో గ్రావెల్‌ దందా మొత్తం అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి కనుసన్నల్లో జరుగుతోంది. ఆయన్ను కాదని.. వాహనాలను అడ్డుకునే సాహసం చేసే అధికారే ఆ నియోజకవర్గంలో లేకపోవడం గమనార్హం. జిల్లా ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చినా.. అక్కడ గ్రావెల్‌ దందాకు అడ్డుకట్ట పడలేదు. రోజూ రాత్రిళ్లు రుద్రకోట నుంచి రామాయపట్నం పోర్టుకు వందలాది టిప్పర్లతో తరలిస్తున్నారు. రాజువారి చింతలపాళెం, కొత్తపల్లి, బుడంగుంట, బోగోలు మండలం కప్పరాళ్లతిప్ప, దగదర్తి మండలం దామవరం ఎయిర్‌పోర్టు భూముల్లో యథేచ్ఛగా తవ్వకాలు చేసి.. నెల్లూరు చుట్టుపక్కల ఉన్న లేఅవుట్లకు తరలిస్తున్నారు. ఇప్పటికైనా అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట పడితే అంతే చాలు అన్నమాట స్థానికుల నుంచి వినిపిస్తోంది. ఈ మొత్తం పరిణామాలపై జేసీ కూర్మనాథ్‌ను ‘ఈనాడు’ వివరణ కోరగా.. ఫిర్యాదుల నేపథ్యంలో విచారణకు ఆదేశించామని, ప్రక్రియ జరుగుతోందని తెలిపారు.

విచారణాధికారిగా కందుకూరు సబ్‌కలెక్టర్‌

కావలి నియోజకవర్గంలో జరుగుతున్న గ్రావెల్‌ దందా నిగ్గుతేల్చే బాధ్యతను జిల్లా అధికారులు కందుకూరు సబ్‌కలెక్టర్‌ శోభికకు అప్పగించారు. కావలి, అల్లూరు, బోగోలు మండలాల ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పత్రికల్లో వస్తున్న వార్తలు, ప్రజల ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని.. పూర్తిగా పరిశీలించాలని సూచించారు. దీనిపై ఆమె ఇప్పటికే విచారణ ప్రారంభించినట్లు సమాచారం. స్థానికుల నుంచి జిల్లా అధికారులకు చరవాణిలో వచ్చిన ఫిర్యాదులతో పాటు వారు పంపిన ఆధారాలను కావలి నియోజకవర్గంలోని అధికారులకు పంపడం సాధారణంగా జరిగే ప్రక్రియే. అక్కడి అధికారులు చర్యలు తీసుకోకపోగా.. అసలు అక్కడ అలాంటిది ఏమీ జరగడం లేదని సమాధానం ఇస్తుండటంతో జిల్లా అధికారులు ముక్కున వేలేసుకునే పరిస్థితి వచ్చింది. ఆ క్రమంలోనే తాజాగా ఈ చర్యలు చేపట్టినట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని