logo

ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు ఫంగస్‌ దెబ్బ

జువ్వలదిన్నె బ్రేక్‌ వాటర్‌లో ప్రయోగాత్మకంగా చేపట్టిన నాచు పెంపకంలో ప్రతికూలత ఎదురైంది.

Published : 01 Feb 2023 01:31 IST

ఫంగస్‌ సోకి ఇలా..

జువ్వలదిన్నె(బిట్రగుంట), న్యూస్‌టుడే: జువ్వలదిన్నె బ్రేక్‌ వాటర్‌లో ప్రయోగాత్మకంగా చేపట్టిన నాచు పెంపకంలో ప్రతికూలత ఎదురైంది. నాచు ఎదుగుదలపై ఆరా తీసేందుకు భీమవరం నుంచి వచ్చిన నిపుణుల బృందం ఫంగస్‌ సోకినట్లు గుర్తించి.. కారణాలు తెలుసుకునేందుకు నమూనాలను తీసుకువెళ్లింది. బోగోలు మండలం జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ సమీపంలో అలల తాకిడి లేని బ్రేక్‌ వాటర్‌ ప్రాంతంలో ప్రయోగాత్మకంగా నాచు పెంపకం చేపట్టారు. మత్స్యశాఖ, ఇఫ్కో ఆర్థిక సాయంతో మత్స్యకార కుటుంబాల మహిళల ఆర్థికాభివృద్ధికి తోడ్పాడాలన్నది దీని లక్ష్యం. వారం రోజుల కిందట పెంపకం ప్రక్రియ చేపట్టారు. మంగళవారం నాచు ఎదుగుదల పరిశీలనకు భీమవరంలోని ల్యాబ్‌ ఉన్నతాధికారి జీఎస్‌ఎన్‌ రాజు, టెక్నీషియన్‌ అశోక్‌ వచ్చారు. క్షేత్రస్థాయి అధికారులతో కలిసి బోటులో వెళ్లి సదరు ప్రాంతాన్ని పరిశీలించారు. నాచు ఆశించిన స్థాయిలో ఎదగలేదని.. అక్కడక్కడా ఫంగస్‌ ఉన్నట్లు గుర్తించారు. ఎక్కువ కాలం నిల్వ ఉన్న నీటిలో ఉండటం వల్ల అలా జరిగిందేమోనని.. కాస్త అలల తాకిడి ప్రాంతానికి మార్చారు. నీటిలో ఉప్పు శాతం తగు పాళ్లలో ఉందా? లేదా? అనేది అధ్యయనం చేస్తున్నారు. నీరు, ఫంగస్‌ సోకిన నాచు వేర్లను ల్యాబ్‌లో పరీక్షించేందుకు భీమవరం తీసుకువెళ్లారు. మత్స్యశాఖ ఏడీ శ్రీనివాసులు, జిల్లా జేడీఏ నాగేశ్వరరావును ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా.. రెండు రోజుల్లో తాము కూడా పరిశీలనకు వెళ్లనున్నట్లు తెలిపారు. ల్యాబ్‌ పరీక్షల్లో కారణాలు వెల్లడయ్యాక.. అవసరమైన చర్యలు చేపడతామన్నారు. మత్స్యకార కుటుంబాల్లోని మహిళల ఆర్థికాభివృద్ధి కోసమే ఈ ప్రాజెక్టు చేపట్టామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని