logo

ప్రవల్లిక.. క్రీడల్లో మెరిక

ఆ విద్యార్థినికి క్రీడలంటే మక్కువ... చదువుతో పాటు ఆటల్లో రాణిస్తోంది. ప్రతిభను గుర్తించిన వ్యాయామ ఉపాధ్యాయినులు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.

Updated : 01 Feb 2023 05:57 IST

న్యూస్‌టుడే, దుత్తలూరు

సాధించిన పతకాలు చూపిస్తున్న విద్యార్థిని

ఆ విద్యార్థినికి క్రీడలంటే మక్కువ... చదువుతో పాటు ఆటల్లో రాణిస్తోంది. ప్రతిభను గుర్తించిన వ్యాయామ ఉపాధ్యాయినులు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. దశల వారీగా మండల, నియోజకవర్గ, జిల్లా, జాతీయ స్థాయిలో ప్రతిభ చూపింది. విద్యార్థినులకు తమకిష్టమైన క్రీడల్లో ప్రోత్సహించడంతోనే తాను జాతీయ స్థాయికి ఎంపికైనట్లు పేర్కొంది.

మర్రిపాడు మండలం చాబోలుకు చెందిన రేకలగుంట ప్రవల్లిక ప్రాథమిక విద్య సొంత మండలంలో చదివింది. తల్లిదండ్రులు బాలపోలయ్య, లక్ష్మీదేవిలు కూలీలుగా పనిచేస్తూ విద్యార్థిని చదివిస్తున్నారు. ప్రాథమిక విద్య అనంతరం నందిపాడులోని కస్తూర్బాలో 2016లో ఆరోతరగతిలో చేరింది. విద్యాలయంలో విద్యతోపాటు క్రీడల్లో ప్రత్యేక తర్ఫీదు ఇస్తుండటంతో పాటు క్రీడల్లో మక్కువ పెంచుకుంది. ప్రారంభంలో ఖోఖో, కబడ్డీ అంశాల్లో సాధన చేసింది. మండల, నియోజకవర్గస్థాయిలో గ్రిగ్స్‌ పోటీల్లో సత్తాచాటింది. వివిధ అంశాల్లో ప్రతిభ చాటుతుండటంతో వ్యాయామ ఉపాధ్యాయినులు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. త్రోబాల్‌తో పాటు షూటింగ్‌ బాల్‌లో విశేష ప్రతిభ చూపింది. విద్యాలయంలో ప్రతినిత్యం ఆయా అంశాల్లో సాధన చేస్తూ పలు పతకాలు సొంతం చేసుకుంది.

విజయాలివే...

* 2016 నుంచి 2018 వరకు జరిగిన సీఎం కప్‌ పోటీల్లో త్రోబాల్‌ విభాగంలో మండల, నియోజకవర్గస్థాయిలో ప్రథమ స్థానం సాధించి, జిల్లాస్థాయిలో పోటీల్లో ప్రతిభ చాటి చిత్తూరు జిల్లా పీలేరులో జరిగిన రాష్ట్ర పోటీలకు అర్హత సాధించింది. 2019లో నిర్వహించిన అసోసియేషన్‌ మీట్లో సీనియర్‌ త్రోబాల్‌ విభాగంలో ఏలూరులో జరిగిన రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది.  2022లో జరిగిన షూటింగ్‌ బాల్‌లో సీనియర్స్‌ టోర్నీ విభాగంలో తెనాలిలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తాచాటింది. ప్రతిభ కనబరచడంతో రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన జాతీయ స్థాయిలో పోటీలకు ఎంపికైంది. అక్కడ పతకం సాధించకపోయినా పోటీల్లో మంచి ప్రతిభ కనబరచడంతో పలువురి ప్రశంసలు అందుకుంది.

జాతీయ క్రీడాకారిణిగా రాణించడమే లక్ష్యం :  ప్రవల్లిక

చిన్నప్పటి నుంచి పాఠశాలల్లో జరిగే ప్రతి పోటీల్లో పాల్గొన్నా.  ఇష్టమైన త్రోబాల్‌, షూటింగ్‌ బాల్‌ పోటీల్లో పాల్గొన్నా. విద్యాలయ ప్రత్యేకాధికారిణులు, వ్యాయామ ఉపాధ్యాయుల సహకారంతోప్రత్యేక శిక్షణ తీసుకున్నా. త్రోబాల్‌, షూటింగ్‌ బాల్‌ విభాగాల్లో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడం ఉత్సాహన్నిచ్చింది. జాతీయ క్రీడాకారిణిగా రాణించడమే లక్ష్యం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు