logo

అభివృద్ధిపై ఆశలు.. అన్నదాతకు వరాలు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌.. మహిళలు, అన్నదాతలు, యువత, వయోవృద్ధులకు ప్రయోజనం చేకూర్చేలా ఉంది. ప్రధానంగా వ్యవసాయ రంగంతో పాటు మత్స్యకారులకు వరాల జల్లు కురిపించింది.

Published : 02 Feb 2023 02:24 IST

యువత, మహిళల ఆర్థికాభివృద్ధికి అవకాశం
కేంద్ర బడ్జెట్‌పై జిల్లా వాసుల్లో భిన్నాభిప్రాయాలు
ఈనాడు డిజిటల్‌, నెల్లూరు: స్టోన్‌హౌస్‌పేట, న్యూస్‌టుడే

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌.. మహిళలు, అన్నదాతలు, యువత, వయోవృద్ధులకు ప్రయోజనం చేకూర్చేలా ఉంది. ప్రధానంగా వ్యవసాయ రంగంతో పాటు మత్స్యకారులకు వరాల జల్లు కురిపించింది. మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేయడంతో జిల్లాలోని రోడ్లు, ఇతర అభివృద్ధి పనులకు నిధులు మంజూరయ్యే అవకాశం ఉందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం కేంద్ర ఆర్థిక మంత్రి హోదాలో నిర్మలా సీతారామన్‌ దేశ ఆర్థిక దార్శనిక పత్రం (బడ్జెట్‌)లోని సంక్షేమ మంత్రాన్ని చదివి వినిపించారు. రైతులు, మహిళలు, మధ్యతరగతి ప్రజలే లక్ష్యంగా సంక్షేమ పథకాలను రూపొందించారని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 2023-24 ఆర్థిక సంత్సరానికి సంబంధించి ఆదాయం, ఖర్చులకు సంబంధించి ఆర్థిక పత్రాన్ని చదివి వినిపించారు. ఇందులో ప్రధాన వర్గాలను ఆకర్షించడమే లక్ష్యంగా పథకాలు, అంకెలు కనిపించాయి.

నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట

కేంద్ర బడ్జెట్లో మహిళలకు ప్రత్యేకంగా మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ అనే పథకాన్ని ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టారు. ఇందులో రూ.2 లక్షల వరకు డిపాజిట్‌ చేసుకునే అవకాశం ఉండటం అతివలకు భరోసా ఇవ్వనుంది. దీనికి పాక్షిక మినహాయింపులు ఇవ్వడంతో జిల్లాలో దాదాపు 9.73 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. యువతకు నేషనల్‌ డిజిటల్‌ లైబ్రరీని ఏర్పాటు చేయనున్నట్లు బడ్జెట్లో ఆర్థికమంత్రి ప్రకటించారు. ఫలితంగా నాణ్యమైన పుస్తకాల లభ్యత పెరిగి 8.50 లక్షల మంది యువతకు ఎంతగానో ఉపయోగపడనుంది. మూలధన వ్యయానికి రూ.10 లక్షల కోట్లు కేటాయించడంతో ఉపాధి అవకాశాలు మెరుగుపడే అవకాశముంది. సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి వెళ్లే వందే భారత్‌ రైలు నెల్లూరు నుంచి వెళుతుండటంతో ట్రాక్‌ అభివృద్ధితో పాటు రవాణా సౌకర్యం మరింత మెరుగుపడనుంది.

వేతన జీవులకు ఉపశమనం

వేతనజీవులకు ఊరట కల్పించేలా ఆదాయపన్ను మినహాయింపు మొత్తాన్ని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి ప్రకటించారు. రూ.2.5 లక్షలు మించితే పన్ను స్లాబులోకి వచ్చేవారు. కనీస ఆదాయపన్ను పరిమితి రూ.3 లక్షలకు పెంచడం చాలామందికి ఊరట కలిగిస్తోంది. రాబోయే రోజుల్లో ఆదాయం ఉన్న వారందరూ కొత్త పన్ను విధానంలోకి వచ్చే దిశగా అడుగులు వేశారు. జిల్లాలో దాదాపు 70 వేల మంది వేతన జీవులు ఉండగా.. కేంద్రం ప్రకటించిన పరిధిలోకి వచ్చే వారి సంఖ్య 25- 30 వేల వరకు మాత్రమే ఉంటారని అంచనా. మౌలిక సదుపాయాల కల్పనకు రూ.10 లక్షల కోట్లు కేటాయించడంతో ప్రగతికి బాటలు పడనున్నాయి. మౌలిక వసతుల కల్పనలో భాగంగా రోడ్లు, వంతెనలు, ఇతర సౌకర్యాల కల్పనకుఇనుము, సిమెంటు, నిర్మాణ సామగ్రి వినియోగించాల్సి ఉండటంతో ఉపాధి అవకాశాలు పెరిగి ఆర్థిక వృద్ధికి దోహదపడుతుంది.

ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం

పెట్టుబడి వ్యయం తగ్గించేందుకు కేంద్రం పీఎం-ప్రణామ్‌ పథకాన్ని ప్రకటించింది. జిల్లాలో ప్రకృతి సాగు చేస్తున్న వారికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. బయో ఇన్‌పుట్‌ రీసోర్స్‌ సెంటర్ల ద్వారా అవసరమైన వనరులు అందించి సేంద్రియ సాగును విస్తరించనుంది. స్టార్టప్‌లకు ప్రోత్సాహం ఇస్తామని చెప్పడంతో ఆ రంగం వైపు యువత అడుగులు వేసే అవకాశాలు పెరిగాయి. జిల్లాలో ఇప్పటికే దాదాపు 20 వేల మంది రైతులు ప్రకృతి సాగు చేస్తున్నారు. ఆత్మనిర్భర్‌ హార్టికల్చర్‌ క్లీన్‌ ప్లాంట్‌ పథకం ద్వారా నాణ్యమైన మొక్కల లభ్యత పెరిగితే.. జిల్లాలో 2.50 లక్షల ఎకరాల్లోని ఉద్యానసాగు పెరిగే అవకాశం ఉంటుంది. పీఏసీఎస్‌లకు నిధులు కేటాయించడంతో జిల్లాలోని 78 కేంద్రాలు కంప్యూటరీకరణ కానున్నాయి. వీటిలో డిజిటల్‌ సేవలు అందుబాటులోకి వస్తాయి. ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన ద్వారా తీరప్రాంతంలోని దాదాపు 35 వేల మంది మత్స్యకారులకు లబ్ధి చేకూరనుంది.


కొంతవరకు ఆమోదయోగ్యం

కోట గురుబ్రహ్మం, డైరెక్టర్‌, ఏపీ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ ఫెడరేషన్‌

జీఎస్టీపై అధికారులు, వ్యాపారులకు అవగాహన లేకపోవడంతో కొన్ని తప్పులు జరిగాయి. దీనిపై క్షమాభిక్ష పథకం తీసుకురావాలని ఏపీ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ ఫెడరేషన్‌ కేంద్రాన్ని కోరింది. దాన్ని పట్టించుకోలేదు. ఇది వ్యాపారులకు ఇబ్బందికరమైన అంశం. మధ్య తరగతి, ఉద్యోగులకు పన్ను మినహాయింపు కల్పించడం ఆనందించదగ్గ విషయం. ఎంఎస్‌ఎంఈలకు రూ.2 లక్షలు కేటాయించడం, వడ్డీపై ఒక శాతం రాయితీ ఇవ్వడంతో యువ పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చే అవకాశం ఉంది. మౌలిక సదుపాయాలకు అధిక నిధులు కేటాయించడం శుభపరిణామం.  


వయోవృద్ధులను పట్టించుకోలేదు

కేవీ చలమయ్య, ఆంధ్రా ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, కార్యవర్గ సభ్యుడు

పాత విధానంలో రూ.3.50 లక్షల వరకు పన్ను లేదు. ప్రస్తుతం ప్రవేశపెట్టిన బడ్జెట్లో దాన్ని రూ.7 లక్షలు చేశారని చెప్పారు. అయితే ఎలాంటి మినహాయింపులు ఇవ్వలేదు. దాంతో పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. వయోవృద్ధులను పట్టించుకోలేదు. రాష్ట్రానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించకపోవడం నిరాశ కలిగిస్తోంది.


ఉద్యోగులకు నిరాశే..

మోహన్‌దాస్‌, ఏపీటీఎఫ్‌, స్టేట్‌ కౌన్సిలర్‌

చేసిన పనికి ఇచ్చే జీతానికి పన్నేయడం ఏంటి? ఉద్యోగులేమైనా వ్యాపారులా? ప్రస్తుతమున్న పన్ను విధానంలో ఎలాంటి మార్పులు లేవు. కొత్త బడ్జెట్లో ప్రకటించిన మేరకు రూ.7 లక్షల లోపు ఎలాంటి పన్ను లేదని తెలిపారు. పాత విధానంలోని ఇంటి అద్దె, సీపీఎస్‌, 80సీ, 80డీ, గృహ రుణాల్లో మినహాయింపులు ఉండవన్నారు. ఉద్యోగులకు ఎప్పటిలాగే నిరాశే మిగిలింది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని