logo

వైకాపాలో...మరో ధిక్కార స్వరం!

జిల్లాలో అధికార పార్టీపై మరో వైకాపా ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలో పరిశీలకుడి ఏర్పాటుపై ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి మండిపడ్డారు.

Updated : 02 Feb 2023 03:20 IST

ప్రభుత్వం నియమించిన పరిశీలకుడిపై మేకపాటి విమర్శలు
ఈనాడు డిజిటల్‌, నెల్లూరు: వరికుంటపాడు, న్యూస్‌టుడే

జిల్లాలో అధికార పార్టీపై మరో వైకాపా ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలో పరిశీలకుడి ఏర్పాటుపై ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్యేకు ప్రభుత్వానికి పరిశీలకుడు వారిధిగా ఉండాలన్న ఆయన.. తన నియోజకవర్గంలో ధనుంజయరెడ్డి అనే వ్యక్తి చిచ్చు పెడుతున్నారని ధ్వజమెత్తారు. మొదట్లో ఆనం రామనారాయణరెడ్డి కూడా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపైనే ధిక్కార స్వరం వినిపించారు. తనకు ప్రాధాన్యం తగ్గిపోతోందని పరోక్షంగా చెబుతూనే.. తర్వాత అభివృద్ధికి ప్రభుత్వం సహకరించడం లేదని విమర్శిస్తూ వచ్చారు. ఆ తర్వాత నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిదీ ఇదే పరిస్థితి. ఓ వైపు ముఖ్యమంత్రి జగన్‌కు అభినందనలు తెలుపుతూ.. తన నియోజకవర్గంలో అభివృద్ధికి అధికారులు సహకరించడం లేదని వ్యాఖ్యానించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. చివరకు పార్టీ అనుసరిస్తున్న విధానాలను తీవ్రంగా వ్యతిరేకించడంతో పాటు.. వచ్చే ఎన్నికల్లో వైకాపా పార్టీ తరఫున పోటీ చేసేదే లేదని స్పష్టం చేసిన విషయం విదితమే. తాజాగా మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి విమర్శలకు దిగారు. ఎమ్మెల్యేగా తాను ఉన్నప్పటికీ.. పరిశీలకుడిగా మరొకరిని పెట్టి ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. దాంతో జిల్లాలో వైకాపా నుంచి మరొకరు పార్టీకి దూరమవుతున్నారనే ప్రచారం మొదలైంది.

కొలిక్కిరాని గ్రామీణం పంచాయితీ

నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం వ్యవహారం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి దగ్గరకు చేరింది. బాలినేని శ్రీనివాసులరెడ్డితో పాటు.. కొందరు జిల్లా నాయకులతో సీఎం చర్చించారు. వెంటనే నియోజకవర్గ సమన్వయకర్తను నియమించాలని నిర్ణయించారు. ఎవరనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఆనం విజయకుమార్‌రెడ్డితో మొదలై ఆదాల ప్రభాకర్‌రెడ్డి వరకు చాలా మంది పేర్లు చర్చకు వచ్చాయి. అయినా ఇప్పటివరకు ఈ ప్రక్రియ కొలిక్కి రాలేదు. బుధవారం కోటంరెడ్డి సోదరులు ఇద్దరు విలేకర్ల సమావేశం పెట్టి.. ఫోన్‌ ట్యాపింగ్‌కు సంబంధించిన ఆధారాలను బయటపెట్టడంతో పాటు.. పార్టీ నుంచి పోటీ చేయనని తేల్చిచెప్పారు. మరోవైపు వైకాపా నాయకుడు ఆనం విజయకుమార్‌రెడ్డి కోటంరెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో ఎప్పుడు, ఏం జరుగుతుందోనని వైకాపా నాయకులు, కార్యకర్తల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.


మేకపాటి ఏమన్నారంటే..

రికుంటపాడు మండలం తూర్పురొంపిదొడ్లలో బుధవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నియమించిన పరిశీలకుడు ధనుంజయరెడ్డిని తీవ్రంగా విమర్శించారు. నియోజకవర్గంలో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే వాటిని సమన్వయం చేసి ఎమ్మెల్యేకు ఇబ్బంది లేకుండా వారధిగా వ్యవహరించేందుకు నియమించిన పరిశీలకుడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ పార్టీకి చెడ్డపేరు తెస్తున్నారని మండిపడ్డారు. తనకు కానివారిని దగ్గరకు చేర్చుకుని.. పెత్తనం చెలాయించాలనుకుంటే కుదరదని హెచ్చరించారు. వైఎస్సార్‌ కుటుంబానికి తాను విధేయుడినని, తనపై పెత్తనం చేయాలంటే అధిష్ఠానం, మంత్రి, ఇంకెక్కడికైనా వెళ్లేందుకు సిద్ధమేనని తేల్చి చెప్పారు. ధనుంజయరెడ్డి తెదేపాకు చెందినవారని, తెదేపా నాయకులకు పనులు చేయాలని అధికారులకు సూచిస్తున్నారన్నారు. ఈ విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. ఓ వర్గానికి కొమ్ముకాస్తూ.. పోలీసుస్టేషన్లలో పంచాయితీలు చేస్తున్నాడన్నారు. ఇప్పటికే వెంకటగిరి ప్రాంతంలో అప్పులు చేశాడని, ఇప్పుడు ఉదయగిరిలో మొదలుపెట్టినట్లు పేర్కొన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే నియోజకవర్గంలో వర్గభేదాలు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని