logo

పన్ను పేరుతో రూ. 2.40 కోట్లకు టోకరా

పొలం విక్రయించగా వచ్చిన నగదును పన్ను కడతామని నమ్మించి రూ.2.40 కోట్లు సొమ్ము కాజేసిన ఏఆర్‌ కానిస్టేబుల్‌ ఉదంతమిది.

Updated : 02 Feb 2023 05:20 IST

ఓ కానిస్టేబుల్‌ నిర్వాకం

నెల్లూరు (నేర విభాగం), న్యూస్‌టుడే: పొలం విక్రయించగా వచ్చిన నగదును పన్ను కడతామని నమ్మించి రూ.2.40 కోట్లు సొమ్ము కాజేసిన ఏఆర్‌ కానిస్టేబుల్‌ ఉదంతమిది. వేదాయపాళెం పోలీసుల కథనం మేరకు.. బీవీనగర్‌ సంఘమిత్ర స్కూలు సమీపంలో మనుబోలు విజయలక్ష్మి, ఆదినారాయణరెడ్డి దంపతులు ఉంటున్నారు. ఆదినారాయణరెడ్డి ఆర్మీలో పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ స్పోర్ట్స్‌లో విజయలక్ష్మి కార్యదర్శిగా పనిచేస్తున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వీరు యూకేలో డాక్టర్లుగా స్థిరపడ్డారు. వీరి రెండో కుమార్తె మీనారెడ్డి అత్త కృపామయిరెడ్డి 2011లో నవలాకులతోటలో ఉన్న పొలాన్ని విక్రయించారు. దీనికి సంబంధించి పన్ను ప్రభుత్వానికి చెల్లించలేదు. 2015లో ఆమె అనారోగ్యంతో మృతి చెందారు. ప్రభుత్వానికి పన్ను చెల్లించకపోవడంతో జరిమానాతో చెల్లించాలని విజయలక్ష్మి అల్లుడు అశోక్‌రెడ్డికి మెయిల్‌ రావడంతో నవలాకులతోటలో ఉన్న మరో 7.20 ఎకరాల భూమిని విక్రయించి ఆ నగదును పన్నుగా చెల్లించాలనుకున్నారు. 2020లో విజయలక్ష్మి యూకేలో ఉన్న కుమార్తె వద్దకు వెళ్లారు. పొలం విక్రయించే విషయం కుమార్తె, అల్లుడు చెప్పడంతో ఆ బాధ్యతను పరిచయం ఉన్న ఏఆర్‌ కానిస్టేబుల్‌ వినయ్‌కుమార్‌, ఏఎస్సై యుగంధర్‌కు అప్పగించారు. వారిద్దరూ రఫీ అనే మధ్యవర్తి ద్వారా పి.వెంకటేశ్వరరెడ్డి, పి.శేషయ్య, ఎం.భాస్కర్‌రెడ్డి, ఎన్‌.సుకుమార్‌రెడ్డి కొనుగోలుకు సిద్ధంగా ఉన్నారని విజయలక్ష్మికి తెలియజేసి విక్రయించాక రూ.2.40 కోట్లు తీసుకున్నారు. ఈ నగదును తనకు తెలిసిన ఆడిటర్‌ ద్వారా ప్రభుత్వానికి పన్ను చెల్లిస్తున్నామని చెప్పి నమ్మించి సొమ్ము చేసుకున్నాడు. 2021లో విజయలక్ష్మి యూకే నుంచి నెల్లూరుకు తిరిగి వచ్చారు. గతేడాది డిసెంబరులో విజయలక్ష్మి కుమార్తె మీనారెడ్డికి ఆడిటర్‌ ఫోన్‌ చేసి పన్ను చెల్లింపునకు గడువు ముగుస్తోందని చెప్పడంతో ఆమె తల్లికి ఫోన్‌ చేసి చెప్పారు. దాంతో విజయలక్ష్మి ఆడిటర్‌ను విచారించగా డాక్యుమెంటరీ ఛార్జీలకు వినయ్‌కుమార్‌ తనకు రూ.5 లక్షలు ఇచ్చాడని చెప్పారు. దాంతో ఆమె.. ఏఆర్‌ కానిస్టేబుల్‌ను నగదు విషయమై ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ నరసింహారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు