logo

తరచూ మొరాయిస్తున్న 108 వాహనం

సాధారణంగా అత్యవసర చికిత్సల కోసం రోగులను, ప్రమాదాల్లోని క్షతగాత్రులను వైద్యశాలకు తరలించే క్రమంలో అంబులెన్స్‌లు వేగంగా వెళుతుంటాయి.

Updated : 02 Feb 2023 03:38 IST

న్యూస్‌టుడే, కలిగిరి

సాధారణంగా అత్యవసర చికిత్సల కోసం రోగులను, ప్రమాదాల్లోని క్షతగాత్రులను వైద్యశాలకు తరలించే క్రమంలో అంబులెన్స్‌లు వేగంగా వెళుతుంటాయి. ఆ సమయంలో అంబులెన్స్‌ల కండిషన్‌ బాగుండాలి. 108 వాహనాలకు వినియోగించే టైర్లు అధ్వానంగా ఉన్నాయి. ఒకవైపు దారాలు, తీగలు బయటపడి రంధ్రాలు పడేలా ఉన్నాయి. ఇలాంటి టైర్లతో వాహనాలు వేగంగా వెళ్లే సమయంలో పగిలి ప్రమాదాలు జరిగే అవకాశముంది.

మండల కేంద్రమైన కలిగిరి కేంద్రంగా ఏర్పాటుచేసిన 108 అంబులెన్స్‌ వాహనం తరచూ మొరాయిస్తుండటంతో అత్యవసర సేవలు అవసరమైన రోగులు, ప్రమాదాల బారిన పడి క్షతగాత్రులు ఇబ్బందులు పడుతున్నారు. వారంలో నాలుగు రోజులు మరమ్మతులకు గురవుతోంది. కొన్ని రోజుల క్రితం అంబులెన్స్‌కు సెల్ఫ్‌ సమస్య ఉండేది. వాహనం కదలాలంటే నెట్టాల్సి రావడంతో షెడ్డుకు తీసుకెళ్లారు. ఆ సమస్యను మాత్రమే పరిష్కరించి జిల్లా అధికారులు తిరిగి పంపారు. వచ్చిన రెండు రోజులకే మళ్లీ వాహనం కదలడం లేదు. దీని స్థానంలో ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసిన అంబులెన్స్‌ సైతం మొరాయిస్తుంది.

కొండాపురం వాహనమే దిక్కు

కలిగిరిలోని అంబులెన్స్‌ సేవలు నిలిచిపోవడంతో ఇక్కడి నుంచి వెళ్లే ఫోన్ కాల్స్ను కొండాపురంలోని వాహన సిబ్బందికి కాల్‌సెంటర్‌ సిబ్బంది బదలాయిస్తున్నారు. కలిగిరికి సమీపంలో కొండాపురం మార్గంలో మంగళవారం రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. ఆ మార్గంలోని ప్రయాణికులు క్షతగాత్రులను వైద్యశాలకు చేర్చేందుకు 108 అంబులెన్స్‌కు ఫోన్‌ చేశారు. కలిగిరిలో అంబులెన్స్‌ అందుబాటులో లేదని, కొండాపురం వాహనానికి కాల్‌సెంటర్‌ సిబ్బంది కేసును అప్పగించారు. కొండాపురం నుంచి గోతుల రహదారిపై అంబులెన్స్‌ రావడం ఆలస్యమైంది. ఈలోగా ప్రైవేటు వాహనంలో వారిని ఆసుపత్రికి తరలించారు. కలిగిరి-కొండాపురం సమీపంలోని ఆదిమూర్తిపురం వద్ద ఘర్షణ జరిగింది. గాయపడిన వారిని వైౖద్యశాలకు తీసుకెళ్లేందుకు 108కు ఫోన్‌ చేయగా కొండాపురం అంబులెన్స్‌ వేరే కేసులో ఉంది. కలిగిరిలో వాహనం లేదు. తప్పనిసరి పరిస్థితిలో క్షతగాత్రులను ప్రైవేట్‌ వాహనంలో కొండాపురంలోని ఆసుపత్రికి తరలించారు. ఇలాంటి సంఘటనలు నిత్యం జరుగుతున్నా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు.

పొంతన లేని అధికారుల సమాధానం

దీనిపై 108 జిల్లా అధికారి పవన్‌కుమార్‌ను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా కలిగిరిలోని అంబులెన్స్‌ను మరమ్మతులకు పంపామని, ప్రత్యామ్నాయంగా మరో అంబులెన్స్‌ను కలిగిరి కేంద్రంగా ఉంచామన్నారు. ఆ వాహనం మరమ్మతులకు గురైందని చెప్పగా.. లేదు వాహనం బాగానే ఉందని, కండిషన్‌లో ఉందని పొంతన లేని సమాధానమిచ్చారు. ఇక్కడ వాహనం బాగుంటే సమీపంలో జరిగిన కేసులను కాల్‌సెంటర్‌ సిబ్బంది కొండాపురం అంబులెన్స్‌కు ఎందుకు బదలాయిస్తున్నారో వారికే తెలియాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని