logo

ఆక్వా రంగానికి.. షాక్‌!

ఆక్వా రైతులకు కరెంటు బిల్లుల కష్టాలు తీరడం లేదు. ఓ వైపు ఆకాశాన్ని అంటుతున్న మేత, మందుల ధరలు.. దిగుబడికి సరైన ధరలు లేక విలవిలలాడుతుంటే.. ప్రభుత్వ నిర్ణయంతో విద్యుత్తు ఛార్జీలు మరింత భారంగా మారాయి.

Updated : 05 Feb 2023 02:19 IST

ప్రభుత్వ ఆంక్షలతో నష్టపోతున్న సాగుదారులు
రాయితీ లేని బిల్లులతో ఆందోళన
ఈనాడు డిజిటల్‌, నెల్లూరు: ఇందుకూరుపేట, న్యూస్‌టుడే

సాగుకు సిద్ధం చేసిన రొయ్యల చెరువు

ఆక్వా రైతులకు కరెంటు బిల్లుల కష్టాలు తీరడం లేదు. ఓ వైపు ఆకాశాన్ని అంటుతున్న మేత, మందుల ధరలు.. దిగుబడికి సరైన ధరలు లేక విలవిలలాడుతుంటే.. ప్రభుత్వ నిర్ణయంతో విద్యుత్తు ఛార్జీలు మరింత భారంగా మారాయి. ఇప్పటికే నష్టాలను తట్టుకోలేక కొన్ని మండలాల్లో రైతులు పంట విరామం ప్రకటించగా.. మిగిలిన వారు అదే ఆలోచనలో ఉన్నారు. గతంలో ఆక్వాజోన్‌తో సంబంధం లేకుండా విద్యుత్తు రాయితీని అందించిన ప్రభుత్వం.. ఇటీవల కొద్ది మార్పులతో జోన్‌ పరిధిలోని అయిదు ఎకరాలకు రాయితీని పరిమితం చేసింది. దాంతో అధికంగా వస్తున్న బిల్లులతో సాగు గిట్టుబాటు గాక లబోదిబోమంటున్నారు. గత ప్రభుత్వంలో విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్లు ఉచితంగా ఇవ్వడంతో పాటు ఎలాంటి ఆంక్షలు లేకుండా రాయితీ వర్తింపజేశారని.. వైకాపా ప్రభుత్వ నిర్ణయంతో తాము ఇబ్బందులు పడుతున్నామని సాగుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిర్లక్ష్యమే.. శాపం

గతంలో రైతుల నుంచి ఆధార్‌, పట్టాదారు పాసుపుస్తకం, చెరువుకు సంబంధించిన లైసెన్సులను విద్యుత్తుశాఖ అధికారులు సేకరించారు. అవే పత్రాలను మత్స్యశాఖ అధికారులకు రైతులు ఇచ్చి.. కొత్తగా ఎండార్స్‌మెంట్‌ చేయించుకుని అనుమతి పత్రం పొందాల్సి ఉంది. ఆయా శాఖల అధికారులు చెరువుల వద్దకే వచ్చి ఈ-ఫిష్‌ యాప్‌ సర్వే చేయాల్సి ఉన్నా.. అనుకున్న స్థాయిలో జరగలేదు. దీంతో వేలాది మంది రైతులు రాయితీకి నోచుకోలేదు. ప్రభుత్వం పదెకరాలలోపు చెరువులకు రాయితీ వర్తింపజేస్తామని ప్రకటించినా.. సచివాలయాల్లో కొర్రీల కారణంగా అది అమలు కావడం లేదని ఆరోపిస్తున్నారు. రాయితీకి అర్హులైనా.. చెరువులకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు సక్రమంగా లేవంటూ తిప్పి పంపుతున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అర్హత కోల్పోయిన వారే అధికం

జిల్లాలో దాదాపు 80వేల ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తుండగా- 31వేల ఎకరాల్లో పట్టా భూములు ఉన్నాయి. మిగిలినవి ఎసైన్డ్‌, సీజేఎస్‌ఎఫ్‌, కొన్ని ప్రభుత్వ భూములు. ప్రభుత్వం ఆక్వా రంగంలో విద్యుత్తు యూనిట్‌ ధరను రూ. 1.50 నుంచి రూ. 3.84కు పెంచింది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు పదెకరాల్లోపు సాగుదారులకు రాయితీపై విద్యుత్తు సరఫరా చేస్తామని చెప్పారు. ప్రస్తుతం ఆంక్షలు విధించడంతో వేలాది మంది సాగుదారులు నష్టపోతున్నారు. ఆక్వా జోన్‌ పరిధిలో ఉండటంతో పాటు 60 హెచ్‌పీ కంటే తక్కువ సామర్థ్యం ఉండాలనే నిబంధన ఉంది. దీంతో ప్రైవేటు భూముల్లోని 31 వేల ఎకరాల్లో సుమారు 12వేల మందికి మాత్రమే రాయితీ అందుతోంది. ఉదాహరణకు.. ఇందుకూరుపేట, తోటపల్లి గూడూరు మండలాల్లో 5,892 ఆక్వా కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో కేవలం 1,523 సర్వీసులకు మాత్రమే ఈ నెల రాయితీ వచ్చింది. మిగిలిన 4,486 వివిధ కారణాలతో అందలేదు. మనుబోలు, వెంకటాచలం, బుచ్చిరెడ్డిపాళెం, సంగం, కొడవలూరు ప్రాంతాలను పూర్తిగా నాన్‌ ఆక్వాజోన్‌గా ఉండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ఈయన పేరు ఈగ చారుముడయ్య. ఏడేళ్లుగా గంగపట్నం మండలంలో ఒకటిన్నర ఎకరాలో రొయ్యల సాగు చేస్తున్నారు. గత నెల వరకు విద్యుత్తుకు ప్రభుత్వం రాయితీ ఇచ్చేది. నెలకు సుమారు రూ.15వేల వరకు బిల్లు వచ్చేది. ప్రస్తుతం తన పొలాన్ని నాన్‌ ఆక్వాజోన్‌గా మార్చడంతో రాయితీ వర్తించడం లేదు. ఫలితంగా రెండున్నర రెట్లు ఎక్కువ మొత్తం కట్టాల్సి వస్తోందని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన చెరువు పక్కనే ఉన్న పొలం ఆక్వాజోన్‌లో ఉండగా.. తనను మాత్రం ఇలా చేయడం ఏమిటని వాపోతున్నారు.


గంగపట్నం గ్రామానికి చెందిన చిల్లర దుర్గాప్రసాద్‌కు మూడు ఎకరాల్లో రొయ్యల చెరువులు ఉన్నాయి. దాదాపు పదేళ్లుగా సాగు చేస్తున్నారు. రెండేళ్ల కిందట వచ్చిన వరదలకు చెరువులు దెబ్బతినడంతో.. సాగు ఆపేశారు. ఇటీవలే మళ్లీ సిద్ధం చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో తన పొలం నాన్‌ ఆక్వాజోన్‌లోకి వచ్చిందని తెలియడంతో ఆలోచనలో పడ్డారు. ఇప్పటికే మేత, పిల్లల ధరలతో ఇబ్బందులు పడుతున్నామని, ఇలాగైతే సాగు చేయడం కష్టమని చెబుతున్నారు.


అర్హులైన వారికి వర్తిస్తోంది
- నాగేశ్వరరావు, జేడీ, మత్స్యశాఖ

జిల్లాలో ఆక్వా సాగు చేస్తున్న రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తాం. అర్హులైన ప్రతిఒక్కరికి ప్రభుత్వం విద్యుత్తుపై అందించే రాయితీ అందాలని వివరాలను పంపించాం. కొందరిని అనర్హులుగా గుర్తించింది. దీనిపై మళ్లీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. ప్రతి రైతుకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని