logo

కానుక.. మూడు నెలలకోసారి!

నిరుపేద నవ దంపతులను ఆదుకునేందుకు కొత్త మార్గదర్శకాలతో గత ఏడాది అక్టోబరు ఒకటో తేదీన ప్రవేశపెట్టిన వైఎస్సార్‌ షాదీకా తోఫా, వైఎస్సార్‌ కల్యాణమస్తు పథకానికి జిల్లాలో ఆయా సచివాలయాల్లో 151 మంది దరఖాస్తు చేసుకున్నారు.

Published : 05 Feb 2023 01:19 IST

న్యూస్‌టుడే, నెల్లూరు (సంక్షేమం)

నిరుపేద నవ దంపతులను ఆదుకునేందుకు కొత్త మార్గదర్శకాలతో గత ఏడాది అక్టోబరు ఒకటో తేదీన ప్రవేశపెట్టిన వైఎస్సార్‌ షాదీకా తోఫా, వైఎస్సార్‌ కల్యాణమస్తు పథకానికి జిల్లాలో ఆయా సచివాలయాల్లో 151 మంది దరఖాస్తు చేసుకున్నారు. వధూవరులు పదో తరగతి ఉత్తీర్ణులు కావడంతో పాటు మరికొన్ని నిబంధనలతో ఎక్కువ మంది ఈ పథకానికి అర్హులు కాలేకపోయారు. అవగాహన లేకపోవడంతో పాటు సచివాలయాల్లో దీనిపై ప్రత్యేక దృష్టిసారించక పోవడంతో నాలుగు నెలల్లో ఈ పథకానికి తక్కువ మందే దరఖాస్తు చేశారు.

పదో తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి

వివాహాలు ఎక్కువ మంది చేసుకుంటున్నప్పటికీ నిబంధనలతో ఎక్కువ మంది అర్హత సాధించలేకపోతున్నారు. వధువు, వరుడు పదో తరగతి ఉత్తీర్ణత సాధించినట్లు ధ్రువీకరణ పత్రం, కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10 వేలు, పట్టణాల్లో రూ.12 వేలు ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగి, ప్రభుత్వ పింఛనర్లు ఉండరాదు, నాలుగు చక్రాల వాహనాలు కలిగి ఉన్నా సాయం అందదు. నెలవారీ విద్యుత్తు వినియోగం ఏడాదికి సగటు 300 యూనిట్‌కు తక్కువ ఉండాలి. కుటుంబం ఆదాయ పన్ను చెల్లించరాదు. మాగాణి మూడెకరాలు, మెట్ట పదెకరాలు మించి ఉండరాదు.  

సచివాలయాల్లో దరఖాస్తు

గత ఏడాది అక్టోబరు ఒకటో తేదీ తర్వాత వివాహం చేసుకున్న దంపతులు 60 రోజుల్లో ఆయా సచివాలయాల్లో డిజిటల్‌ అసిస్టెంట్‌కు దరఖాస్తు చేయాలి. దరఖాస్తులో పెళ్లి కార్డు, పెళ్లి ఫొటోలు, వివాహ ధ్రువపత్రం, వధువు, వరుడు, తల్లిదండ్రుల ఆధార్‌ కార్డులు, పదో తరగతి సర్టిఫికేట్‌, విభన్న ప్రతిభావంతులైతే సదరం సర్టిఫికేట్లు, కుల సర్టిఫికేట్లతో దరఖాస్తు చేయాల్సి ఉంది.

కొత్త పథకంలో భాగంగా..

ప్రభుత్వం మూడు నెలలకోసారి వధువు ఖాతాకు నేరుగా నిధులు జమ చేయనుంది. అక్టోబరు నుంచి డిసెంబరు వరకు దరఖాస్తు చేసుకున్న వారికి ఫిబ్రవరిలో నిధులు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంది. గత ఏడాది అక్టోబరు ఒకటో తేదీ తర్వాత పెళ్లి చేసుకున్న వారికే ఈ పథకాలు వర్తిస్తాయి. వైఎస్సార్‌ కల్యాణమస్తు పథకం కింద ఎస్సీ, ఎస్టీ కులానికి చెందిన వధువు అదే కులానికి చెందిన వారిని వివాహం చేసుకుంటే రూ.లక్ష, ఇతర కులానికి చెందిన వారిని పెళ్లి చేసుకుంటే రూ.1.20 లక్షలు అందిస్తోంది. బీసీ కులానికి చెందిన వధువు అదే కులస్థులను వివాహం చేసుకుంటే రూ.50 వేలు, ఇతర కులస్థులను చేసుకుంటే రూ.75 వేలు ఇస్తోంది. విభిన్న ప్రతిభావంతులైతే వధువు, వరుడులో ఏ ఒక్కరికి అంగ వైకల్యమున్నా రూ.1.50 లక్షలు మంజూరు చేస్తోంది. షాదీకా తోఫా పథకం కింద ముస్లిం వర్గీయులకు రూ.లక్ష ఇస్తారు. కులాంతర వివాహానికి సంబంధించి ప్రస్తావించలేదు. వధువు తరఫున కులాన్ని పరిగణనలోకి తీసుకుని నిధులు మంజూరు చేయనున్నారు. పెళ్లి కుమార్తె వయస్సు 18, వరుడి వయస్సు 21 ఏళ్లు ఉండాలి. ఇందులో మొదటి సారి వివాహం చేసుకున్న వారికే ఈ పథకాలు వర్తించనున్నాయి. వితంతు మహిళ వివాహం చేసుకుంటే వర్తించేలా సడలింపు ఇచ్చారు.


ఆరు దశల ప్రక్రియ తర్వాత..

ఇప్పటి వరకు వైఎస్సార్‌ షాదీకా తోఫా, వైఎస్సార్‌ కల్యాణమస్తు పథకాలకు 151 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆరు దశల ఎంపిక ప్రక్రియ పూర్తయిన తర్వాత అర్హులను గుర్తించడం జరుగుతుంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకం వర్తిస్తుంది.

సాంబశివారెడ్డి, పీడీ, డీఆర్డీఏ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని