logo

పరీక్షల కాలం.. ఆరోగ్యంపై శ్రద్ధ వహిద్దాం

జిల్లాలో 429 ఉన్నత పాఠశాలల నుంచి మొత్తం 29,401 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. వీరిలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు 18,350 మంది ఉన్నారు.

Published : 06 Feb 2023 02:19 IST

న్యూస్‌టుడే, దుత్తలూరు, ఉదయగిరి

నందిపాడులో పది పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు

జిల్లాలో 429 ఉన్నత పాఠశాలల నుంచి మొత్తం 29,401 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. వీరిలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు 18,350 మంది ఉన్నారు. ఇటీవల విద్యాశాఖ పరీక్షల షెడ్యూలును విడుదల చేసింది. ఏప్రిల్‌ 3 నుంచి 18వ తేదీ వరకు జరగనున్నాయి. ఉదయం ఏడు గంటలకు పాఠశాలకు వస్తే రాత్రి 6.30 వరకు చదువుపైనే దృష్టి పెడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఒత్తిడి దరిచేరకూడదని విద్యా నిపుణులు, వైద్యులు సూచిస్తున్నారు.
నిద్ర ఎంతో ఉపశమనం :  పరీక్షలు దగ్గరపడుతున్న కొద్దీ విద్యార్థులు కేవలం చదువుపైనే దృష్టి పెట్టి మంచి ఉత్తీర్ణత సాధించాలని అహర్నిశలు కృషి చేస్తుంటారు. చాలా మంది ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోరు. దీంతో పలు రకాల సమస్యలు వచ్చే అవకాశముందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలసిన శరీరానికి నిద్ర ఎంతో ఉపశమనం ఇస్తుంది. ప్రతి రోజూ ఎనిమిది గంటల పాటు నిద్ర ఉండేలా చూసుకోవాలి.

సాత్విక ఆహారం ఎంతో మేలు..: ప్రస్తుతం ఎండ, చలి రెండు రకాల వాతావరణం ఉండటంతో ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. అధికంగా నీరు తాగుతూ  రోజుకు అరగంటైనా వ్యాయామం చేస్తుండాలని,  జీర్ణమయ్యే సాత్విక ఆహారం మంచిదని పేర్కొంటున్నారు. ఆహారం తీసుకోవడంలో సమయపాలన పాటించాలి.

పరిశుభ్రతతో ఉత్సాహం...

విద్యార్థులు ఉత్సాహంగా ఉండటంలో పరిశుభ్రత ఎంతో కీలకం. రెండు పూటలా స్నానం చేయకపోతే చర్మవ్యాధులు వస్తాయి. ఎక్కువగా చదివి నీరసించడంతో కళ్లు లోపలికి పోవడం, అధిక దాహం, జ్వరం, మూత్రం సరిగా రాకపోవడం వంటి సమస్యలొస్తాయి. అలసినప్పుడల్లా చల్లని నీటితో ముఖం కడుక్కోవడం చేయాలి.


తల్లిదండ్రులు దృష్టి పెట్టాలి

-డాక్టర్‌ మాశిలామణి, చిన్న పిల్లల వైద్య నిపుణులు, విశ్రాంత డీఎంహెచ్‌వో

వార్షిక పరీక్షల సమయంలో విద్యార్థులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. తల్లిదండ్రులు పిల్లల చదువుతోపాటు ఆహారం, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఇప్పటి నుంచే మంచి ఆహార నియమావళిని అనుసరిస్తే మేలు. బాగా జీర్ణమయ్యే ఆహారాన్ని పిల్లలకు అందించాలి.


సందేహాలను నివృత్తి చేసుకోవాలి

- జయభారతి, ప్రధానోపాధ్యాయురాలు, దుత్తలూరు ఉన్నత పాఠశాల

పరీక్షల సమయంలో ఒత్తిడికి గురై చదివిన అంశాలు మరిచిపోయి పరీక్షలు సరిగా రాయలేని పరిస్థితి ఎదురవుతుంది. పాఠ్యాంశాలను అర్థం చేసుకుంటూ చదివితే పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు. సందేహాలను ఎప్పటికపుడు ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని