logo

నిధులు దండి.. ప్రగతి లేదండి!

రాళ్లుతేలిన వావిళ్ల - అలగానిపాడు రోడ్డుఅన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా మారింది కేంద్ర నిధులతో జరుగుతున్న పనుల పరిస్థితి. జిల్లాలో వివిధ పథకాల ద్వారా ఏడాదిన్నర కిందట రూ.కోట్లు మంజూరయ్యాయి.

Updated : 06 Feb 2023 06:22 IST

కేంద్ర పథకాల పనుల్లో మందగమనం
అధికారులు స్పందిస్తేనే పురోగతి
న్యూస్‌టుడే, నెల్లూరు (జడ్పీ)

రాళ్లుతేలిన వావిళ్ల - అలగానిపాడు రోడ్డుఅన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా మారింది కేంద్ర నిధులతో జరుగుతున్న పనుల పరిస్థితి. జిల్లాలో వివిధ పథకాల ద్వారా ఏడాదిన్నర కిందట రూ.కోట్లు మంజూరయ్యాయి. అప్పట్లో ఆర్భాటంగా మొదలైన పనులు నేటికీ పూర్తికాలేదు. అన్నీ పూర్తయినట్లు జిల్లా అధికారులు నివేదికలు అందజేయకపోవడంతో గత ఏడాది కేంద్రం నుంచి రావాల్సిన కొన్ని నిధులు సైతం ఆగిపోయాయి. దాంతో పల్లె రోడ్లకు ఇప్పట్లో మోక్షం కనిపించడం లేదు.

ఉమ్మడి జిల్లాలో 46 మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలోని పల్లెల్లో వివిధ పథకాల ద్వారా కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నా.. సకాలంలో పనులు పూర్తి కావడం లేదు. పూర్తయిన వాటికి బిల్లులు రాకపోవడంతో మిగతావి చేసేందుకు గుత్తేదారులు ముందుకు రావడం లేదు. దాంతో ఎక్కడి పనులక్కడే మందగించాయి. కొన్ని ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోలేదు. కేంద్ర నిధులను ఖర్చు చేయడం, పనులను పూర్తి చేయడంలో పంచాయతీరాజ్‌, ఇతర ఇంజినీరింగ్‌ శాఖ అధికారులు విఫలమవుతున్నారనే ఆరోపణలున్నాయి.

* జిల్లాలో ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన మూడో విడత, ప్రధానమంత్రి ఆదర్శగ్రామ యోజన, పీఎం గ్రామ సడక్‌ ఇంటెన్సివ్‌ (రహదారుల నిర్వహణ నిధులు), నాబార్డు, 15వ ఆర్థిక సంఘం, తదితర కేంద్ర నిధులతో వివిధ పనులు సాగుతున్నాయి. వీటిలో అంతులేని జాప్యం నెలకొంది. వీటి వెనక కారణాలను గుర్తించి సరిదిద్ది వేగవంతం చేసేలా అధికారులు చర్యలు చేపట్టడం లేదు.

* ప్రధానమంత్రి గ్రామ సడక్‌ యోజన మూడో విడత పనులు 2021లో మంజూరయ్యాయి. మొత్తం రూ.67.36 కోట్లతో వివిధ గ్రామాల్లో 13 రోడ్ల పనులకు శ్రీకారం చుట్టారు. ఒకటిన్నర ఏడాది గడిచినా కేవలం అయిదు మాత్రమే పూర్తయ్యాయి. మిగతావి జరుగుతూనే ఉన్నాయి.

* ప్రధానమంత్రి సడక్‌ యోజన కింద రహదారుల నిర్వహణకు 2020-21లో రూ.7.89 కోట్లతో 13 పనుల నిర్వహణ, మరమ్మతులు చేయాల్సి ఉంది. ఇవి ప్రారంభమై ఏడాది పూర్తి కావొస్తున్నా ఒక్కటీ పూర్తికాలేదు.

* ఆదర్శ గ్రామాలను తీర్చిదిద్దేందుకు పీఎంఏపీవై 2021లో భాగంగా 15వ ఆర్థిక సంఘం, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు రూ.5.67 కోట్లతో 122 పనులు మంజూరయ్యాయి. వీటిని ప్రారంభించి దాదాపు ఏడాది కావొస్తోంది. ఇప్పటికీ కేవలం 73 పనులు మాత్రమే పూర్తయ్యాయి. మరో 19 పురోగతిలో ఉండగా.. 30 పనులను నేటికీ ప్రారంభించలేదు. నాబార్డు గ్రాంట్‌తో జరిగే అనేక పనుల్లోనూ జాప్యం నెలకొంది.

ప్రధాన కారణాలివీ..

బిల్లులు సకాలంలో మంజూరు కాకపోవడం, సిమెంటు, ఇసుక, స్టీలు ధరలు పెరగడం కూడా పనుల జాప్యానికి ప్రధాన కారణాలు. కొన్ని పనుల వద్ద స్థల వివాదాలు, తదితర సమస్యలున్నా వాటిని పరిష్కరించే నాథులు లేకపోవడం గమనార్హం.


అత్యవసర సేవలకు సుస్తీ

జిల్లాలోని మండలాలకు చెందిన 108 వాహనాలను మరమ్మతుల నిమిత్తం నెల్లూరు జీజీహెచ్‌ ఆసుపత్రిలోని షెడ్డుకు తరలిస్తున్నారు. బ్రేకు నిర్వహణ, తలుపులు, దీపాలు, ఇంజిన్‌, చక్రాలు, తదితర మరమ్మతుల్లో జాప్యం నెలకొంటోంది. అవసరమైన సామగ్రి వచ్చేందుకు నాలుగు రోజులు పడుతుండటంతో ఆయా మండలాల్లో వాహనాల్లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాహనాలను సకాలంలో బాగుచేస్తే అత్యవసర సేవలకు ఇబ్బందులు ఉండవని ప్రజలు కోరుతున్నారు.

న్యూస్‌టుడే, నెల్లూరు(నగరపాలకసంస్థ)


వేగవంతం చేస్తాం

పి.అశోక్‌కుమార్‌, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ

జిల్లాలో కేంద్ర ప్రభుత్వ నిధులతో అనేక పనులు మంజూరయ్యాయి. దాదాపు అన్నీ ప్రారంభమయ్యాయి. వివిధ కారణాలో కొన్ని వేగంగా సాగడం లేదు. ఆ లోపాలను గుర్తించాం. వాటిని అధిగమించి వేగవంతం చేస్తాం. బిల్లుల చెల్లింపుల్లో జాప్యాన్ని నివారిస్తాం. పనులన్నింటినీ త్వరలో పూర్తి చేశాం.


పీఎంఏజీవై బిల్లులన్నీ మంజూరు చేశాం

చిరంజీవి, జడ్పీ సీఈవో

ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన పనుల బిల్లులన్నీ ఇచ్చాం. ఇంకా కొన్ని పనులు పూర్తి చేయాల్సి ఉందని జడ్పీటీసీ సభ్యులు ఇటీవల సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. వాటిని కూడా పూర్తి చేయించి బిల్లులు అందిస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని