logo

వివాహిత అనుమానాస్పద మృతి

పెళ్లైన ఆరునెలలకే ఆ యువతికి నూరేళ్లునిండాయి. కోటి ఆశలతో ఆత్తారింట్లో అడుగుపెట్టిన యువతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు.

Published : 06 Feb 2023 02:19 IST

మృతురాలు దివ్య (పెళ్లినాటి చిత్రం)

గుడ్లూరు, న్యూస్‌టుడే: పెళ్లైన ఆరునెలలకే ఆ యువతికి నూరేళ్లునిండాయి. కోటి ఆశలతో ఆత్తారింట్లో అడుగుపెట్టిన యువతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఈ ఘటన మండలంలోని రావూరులో శనివారం రాత్రి జరిగింది. కందుకూరు డీఎస్పీ శ్రీనివాసులు అందించిన వివరాల ప్రకారం దగదర్తి మండలం బోడగుడిపాడు గ్రామానికి చెందిన పోలుబోయిన రఘురాములు కుమార్తె దివ్య (21)ను గుడ్లూరు మండలం రావూరుకు చెందిన గొల్లప్రోలు సుబ్బారావు కుమారుడు వెంకట రాజేంద్రకు ఇచ్చి గత సంవత్సరం ఆగస్టులో పెళ్లి చేశారు. పెళ్లి సమయంలో ఎకరా మాగాణి, 18 సవర్ల బంగారం, రూ.50 వేల నగదు వరకట్నంగా ఇచ్చారు. ఆపై అత్తగారింటికి వచ్చినప్పటి నుంచి అదనంగా నగదు తీసుకు రావాలంటూ అత్త రామతులసమ్మ, భర్త రాజేంద్ర వేధించారన్నారు. ఈ నేపథ్యంలో యువతి అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకుని మృతిచెందారన్నారు. దివ్య తండ్రి రఘురాములు ఇచ్చిన ఫిర్యాదుతో భర్త, అత్తపై వరకట్న వేధింపులతోపాటు హత్యాయత్నం కింద కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ వివరించారు.

పెళ్లి అయినప్పటి నుంచి అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని దివ్య తండ్రి రఘురాములు ఆరోపించారు. దీంతో దివ్య రెండు మూడుసార్లు పుట్టింటికి వచ్చిందన్నారు. శనివారం రాత్రి మీ అమ్మాయి ఉరివేసుకుని చనిపోయిందంటూ ఫోన్‌ చేసి చెప్పారన్నారు. తాము వచ్చి చూసేసరికి గాయాలతో కుర్చీలో కూర్చోబెట్టిన మృతదేహాన్ని చూపించారన్నారు. భర్త రాజేంద్ర, అత్త పరారయ్యారన్నారు. దీనిపై గుడ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు. తాము ఇచ్చినట్లు ఫిర్యాదు తీసుకోలేదన్నారు. దీంతో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు స్టేషను వద్ద వేచి ఉన్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. దివ్య సొంతూరు నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన బంధువులు రాజేంద్రపై దాడికి ప్రయత్నించారు. దివ్యకు ఎడమచేయి కొద్దిగా పనిచేయదని, ఆమె స్వయంగా ఫ్యానుకు చీర వేసుకుని ఎలా ఉరి వేసుకుంటుందని కుటుంబసభ్యులు ప్రశ్నించారు. మృతదేహాన్ని అలానే ఉంచకుండా కిందకు దించి కుర్చీలో కూర్చోబెట్టారన్నారు. గుడ్లూరు పోలీసులు కేసు నమోదులో జాప్యం చేశారని వాపోయారు. కేసు నమోదులో జాప్యం చోటుచేసుకోలేదని గుడ్లూరు సీఐ సుబ్బారావు తెలిపారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది మృతదేహాన్ని శ్మశానానికి తరలించి అంత్యక్రియలు పూర్తి చేయించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు