logo

మలి వయసులో.. మెరుపులు

వారు మలివయసులో ఉన్న మహిళలు.. కొందరు ఏడు పదులు దాటారు. అయినా ఆటల్లో ముందుంటున్నారు. వయసులో ఉన్న వారికి తీసిపోని విధంగా ప్రతిభ చూపుతున్నారు.

Updated : 06 Feb 2023 06:25 IST

న్యూస్‌టుడే, కావలి

వారు మలివయసులో ఉన్న మహిళలు.. కొందరు ఏడు పదులు దాటారు. అయినా ఆటల్లో ముందుంటున్నారు. వయసులో ఉన్న వారికి తీసిపోని విధంగా ప్రతిభ చూపుతున్నారు. పోటీల్లో పతకాలు సాధిస్తూ కావలి ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఓ వైపు కుటుంబ బాధ్యతలు మోస్తూ, మరోవైపు క్రీడా పోటీల్లో పతకాలు సాధిస్తున్నారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఈనెల 2న జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి బహుమతులందుకున్నారు. అఖిల భారత మాస్టర్‌ గేమ్స్‌ ఛాంపియన్‌ -2023 వెటరన్‌ క్రీడా పోటీల్లో కావలి వనితలు సత్తా చాటి బెస్ట్‌ టీం అవార్డు పొందారు.


రక్తదానంపై అవగాహన కల్పిస్తూ..

రెడ్‌క్రాస్‌లో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా డాకారపు పద్మావతి నిత్యం రక్త సేకరణ, వితరణ కార్యక్రమాల్లో విధులు నిర్వహిస్తున్నారు. పోటీల్లో 50 సంవత్సరాల విభాగంలో ఘనత సాధించారు. ఈమె 110 మీటర్ల హర్డిల్స్‌, హేమర్‌త్రో, 1500 మీటర్ల పరుగు, ట్రిపుల్‌ జంప్‌, 4×400 రిలే పరుగులో బంగారు పతకాలు సాధించారు.మొత్తం ఏడు పతకాలు దక్కించుకున్నారు. రక్తదాన ప్రచారం చేస్తున్నారు. ఏడు పతకాలు సాధించారు.


సేవాతత్పరతకు చిరునామా

రెడ్‌క్రాస్‌ మహిళా విభాగం కన్వీనర్‌గా సుదీర్ఘకాలం సేవలందిస్తున్న పార్వతీశంకర్‌ 65 సంవత్సరాల విభాగంలో మూడు కిలోమీటర్ల నడక, హేమర్‌త్రోలో స్వర్ణాలు అందుకున్నారు. డిస్కస్‌త్రోలో రజితం, జావెలెన్‌త్రోలో కాంస్య పతకాలు పొందారు. రెడ్‌క్రాస్‌ తరఫున అనేక సందర్భాల్లో పేదలకు ఆహారం పంపిణీ, వస్త్రదానం వంటి కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించారు. ఈమె 29 పర్యాయాలు రక్తదానం చేశారు.


ఏడు పదులు దాటినా..

పట్టణంలోని జవహర్‌ భారతి కళాశాల విశ్రాంత ఫిజికల్‌ డైరెక్టర్‌ కోటేశ్వరమ్మకు ఏడు పదుల్లో ఉన్నారు.  వెటరన్‌ జట్టుకు మార్గదర్శకం వహిస్తున్నారు. ఈమె షాట్‌పుట్‌, డిస్కస్‌ త్రో, హేమర్‌త్రో, 4×100 మీటర్ల పరుగు పోటీల్లో ప్రథమ స్థానాల్లో నిలిచి బంగారు పతకాలను సాధించారు. గతంలో పీడీగా ఎంతోమందిని ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దారు. విశ్రాంత జీవితంలోనూ కూడా ఓ క్రీడాకారిణిగా రాణిస్తున్నారు.


ఉపాధ్యాయురాలిగా రాణిస్తూ..

పట్టణానికి చెందిన ప్రైవేట్‌ పాఠశాల ఉపాధ్యాయని ఏ.తులశమ్మ 55 సంవత్సరాల విభాగంలో లాంగ్‌జంప్‌, ట్రిపుల్‌ జంప్‌లో స్వర్ణ పతకాలు సాధించారు. హేమర్‌త్రోలో రజిత పథకాన్ని పొందారు. విద్యార్థులకు కూడా చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలని సూచిస్తున్నారు. వివిధ సేవా కార్యక్రమాల్లో నిత్యం పాల్గొంటున్నారు.


విశ్రాంత జీవితంలో..

విశ్రాంత ఉపాధ్యాయురాలిగా కావలివాసులకు సుపరిచితమైన కె. లలితమ్మ 65 సంవత్సరాల విభాగంలో వివిధ పోటీల్లో పాల్గొన్నారు. జావెలిన్‌త్రోలో రజితం, హేమర్‌త్రోలో కాంస్య పతకాలు సాధించారు. భవిష్యత్తులో కూడా పతకాలు సాధిస్తానని ఈమె చెబుతుంది. ఈమెకు గురువుగా కోటేశ్వరమ్మ వ్యవహరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని