logo

అక్రమార్కులపై ఎందుకంత ప్రేమో!

వారంతా అక్రమార్కులు.. ఉద్దేశపూర్వకంగా అటవీ భూములకు పట్టాలు పుట్టించిన అవినీతిపరులు.. ఏకంగా 30.44 ఎకరాలను ప్రైవేటు వ్యక్తుల పేర్లపై రికార్డులు సృష్టించిన ఘనులు.

Published : 07 Feb 2023 02:35 IST

క్రిమినల్‌ కేసు కట్టి 15 రోజులు దాటినా చర్యలు శూన్యం

చవటపల్లి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయరు

వారంతా అక్రమార్కులు.. ఉద్దేశపూర్వకంగా అటవీ భూములకు పట్టాలు పుట్టించిన అవినీతిపరులు.. ఏకంగా 30.44 ఎకరాలను ప్రైవేటు వ్యక్తుల పేర్లపై రికార్డులు సృష్టించిన ఘనులు.. అవి ముంపునకు గురవుతున్నాయని చెప్పి.. ప్రభుత్వాన్ని మోసం చేసి పరిహారం కాజేసిన వారు.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించినా.. ఆత్మకూరు ఆర్డీవో క్రిమినల్‌ కేసు పెట్టినా.. చర్యలు తీసుకోవడంలో తాత్సారం చేస్తున్నారు. కొందరు వైకాపా నాయకుల అండదండలతో నిందితులు దర్జాగా తిరుగుతుండటంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.

ఈనాడు డిజిటల్‌, నెల్లూరు

కలువాయి మండలం చవటపల్లి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయరును నిర్మించాలని 2008లో నాటి ప్రభుత్వం నిర్ణయించింది. ఫలితంగా సమీపంలోని చవటపల్లి, వెరుగొట్లపల్లి, వెదనపర్తి, దాచూరు గ్రామాలకు చెందిన భూములు ముంపునకు గురవుతున్నట్లు అధికారులు గుర్తించారు. వాటికి పరిహారం చెల్లించాలని నిర్ణయించగా.. ప్రభుత్వం అంగీకరించింది. మొత్తం 620 ఎకరాలు గుర్తించగా- దానిలో 150 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. మరో 218 ఎకరాలు పట్టా, మిగిలింది సీజేఎఫ్‌ఎస్‌, డీకేటీ పట్టా భూములు ఉన్నట్లు నిర్ధారించారు. పరిహారం చెల్లింపులో జాప్యం.. అక్రమార్కులకు వరంగా మారింది. రెవెన్యూ అధికారులతో చేతులు కలిపి.. అటవీ భూములకు పట్టాలు పుట్టించారు. వాటిని చూపి ప్రభుత్వం నుంచి రూ. 1.43 కోట్ల పరిహారం పొందారు. ఈ వ్యవహారంలో పెద్దఎత్తున నగదు చేతులు మారినట్లు సమాచారం. దీనిపై ఆత్మకూరు ఆర్డీవో విచారణ జరిపి.. అక్రమాలు నిజమని తేల్చారు. వాటికి సహకరించిన తహసీల్దార్లు వై.నాగరాజు, వి.లావణ్య, ఎస్‌.ఎం.హమీద్‌లను సస్పెండ్‌ చేశారు. వీరితో పాటు.. అవినీతిలో భాగస్వాములైన 9 మందిపై ఆర్డీవో కరుణకుమారి ఫిర్యాదు చేయడంతో గత నెల 23న కలువాయి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.


ఆర్డీవో విచారణనే తప్పుబడుతూ...

చవటపల్లి భూముల కేసు గందరగోళంగా మారింది. దాదాపు 29.5 ఎకరాల అటవీ భూమి, 22ఏలో ఉన్న 0.94 సెంట్ల భూమిని ఉద్దేశపూర్వకంగానే రికార్డులు మార్చి ప్రభుత్వ సొమ్మును కాజేసినట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించిన ఆధారాలను పోలీసులకు తెలిపారు. ఆర్‌ఎస్‌ఆర్‌లో సర్వే నంబరు 1072-5, 1072-6, 1072-8, 1080-4, 1080-5, 1080-6, 1084-12, 1084-9, 1070-11, 1073-6, 1077-8, 1074-17, 1077-8ల్లోని అటవీ భూమిని.. పట్టాలుగా మార్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ఆర్డీవో విచారణనే తప్పు బట్టేలా ఉంది.ఆ నివేదికను పక్కన పెట్టి.. విచారణ జరుపుతున్నారు. అంతటితో ఆగకుండా.. అసలు ఆ ప్రాంతంలో అటవీ భూములే లేవని చెబుతుండటం గమనార్హం. కొందరు అధికారులు.. అధికార పార్టీ నాయకుల వద్ద స్వామిభక్తి చాటుకునేందుకు.. కేసును నీరుగార్చేందుకు యత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.


రాజకీయ ప్రోద్బలంతో జాప్యం

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో.. చిల్లకూరు మండలం తమ్మినపట్నంలోని సర్వే నంబరు 94-3లోని 209 ఎకరాల పోర్టు భూములను 11 మంది ప్రైవేటు వ్యక్తుల పేరుతో వెబ్‌ల్యాండ్‌లో మార్పులు చేశారు. దానిపై ఆర్డీవో విచారణ జరిపారు. తప్పు తేలడంతో తహసీల్దారుతో పాటు మరికొందరిపై క్రిమినల్‌ కేసులు పెట్టడం.. అరెస్టు చేయడం వెనువెంటనే జరిగాయి. కలువాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. సబ్‌ డివిజనల్‌ మేజిస్ట్రేట్‌(ఆర్డీవో) ఫిర్యాదు చేసిన కేసుపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. క్రిమినల్‌ కేసుల్లో వీలైనంత త్వరగా నిందితులను పట్టుకోవాల్సి ఉన్నా.. ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. సమగ్ర విచారణ జరిపిన ఆర్డీవో.. కలెక్టర్‌ ఆదేశాలతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రాథమిక సాక్ష్యాలు అందజేశారు. ఇప్పటికే కొందరు అధికారులు ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అరెస్టు కాకుండా అడ్డుకోవాలని ప్రాధేయపడటంతో కొందరు వారికి హామీ ఇచ్చినట్లు సమాచారం. ఆ క్రమంలోనే కాలయాపన చేస్తున్నట్లు తెలుస్తోంది.


కేసులో నిజమెంతో పరిశీలిస్తున్నాం

- కోటారెడ్డి, డీఎస్పీ, ఆత్మకూరు

ఆత్మకూరు ఆర్డీవో ఫిర్యాదు మేరకు కట్టిన కేసులో నిజానిజాలెంతో పరిశీలిస్తున్నాం. అసలు ఆ ప్రాంతంలో అటవీ భూములే లేవని కొందరు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. దీనిపై లిఖితపూర్వకంగా వివరాలు ఇవ్వాలని కోరాం. ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని