logo

ఎకో టూరిజం ప్రాజెక్టులకు ప్రాధాన్యం

రాష్ట్రంలో రానున్న ఆరు నెలల్లో వంద ఎకో టూరిజం ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని గుంటూరు చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్టు శ్రీనివాసులురెడ్డి తెలిపారు.

Published : 07 Feb 2023 02:35 IST

సీసీఎఫ్‌ శ్రీనివాసులురెడ్డి

డీఎఫ్‌వోలతో కలిసి మాట్లాడుతున్న సీసీఎఫ్‌ శ్రీనివాసులురెడ్డి

ఉదయగిరి, న్యూస్‌టుడే: రాష్ట్రంలో రానున్న ఆరు నెలల్లో వంద ఎకో టూరిజం ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని గుంటూరు చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్టు శ్రీనివాసులురెడ్డి తెలిపారు. డీఎఫ్‌వో చంద్రశేఖర్‌, స్క్వాడ్‌ డీఎఫ్‌వో మారుతీప్రసాద్‌తో కలిసి సోమవారం ఆయన ఉదయగిరి అటవీశాఖ రేంజి కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జాతీయ రహదారులు, ప్రజలు ఎక్కువగా సందర్శించే ప్రాంతాల్లో ఎకో టూరిజం ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వీటి వల్ల అడవుల పరిరక్షణతో పాటు ఆదాయం, ప్రజలకు ఆహ్లాదం కలుగుతుందన్నారు. జిల్లాలో రూ. 29 కోట్లతో ఉదయగిరి అటవీరేంజ్‌ పరిధిలో సిద్దేశ్వరం, ఉదయగిరి దుర్గంతో పాటు ఆత్మకూరు, కావలి, నెల్లూరు, మైపాడు బీచ్‌, పెంచలకోన ప్రాంతాల్లో ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తారన్నారు. అటవీశాఖ నిధులతో పాటు సీఎస్‌ఆర్‌, ప్రభుత్వ నిధులు కేటాయిస్తారన్నారు.  ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధానికి పటిష్ఠమైన నిఘా ఏర్పాటు చేశామని.. వేసవిలో ఎర్రచందనం నరికే కూలీలు అడవిలోకి ప్రవేశిస్తే.. గుర్తించేందుకు వీలుగా డ్రోన్‌ సాంకేతికతను వినియోగిస్తున్నామన్నారు. వేసవిలో అడవులు అగ్నికి ఆహుతి కాకుండా ముందస్తు చర్యలు చేపట్టామని, సిబ్బందితో రెండు నెలలు పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఎర్రచందనం నరికే తమిళ కూలీలు ఎక్కువగా ఏలూరు, కొయంబత్తూరు, సేలం ప్రాంతాల నుంచి వస్తారని.. వారిని నిరోధించేందుకు ఆయా రైల్వేస్టేషన్లలో నిఘా పెట్టామన్నారు. జిల్లాలో 250 హెక్టార్లలో ప్లాంటేషన్‌ను ఏర్పాటు చేయడంతో పాటు మూడు వేల హెక్టార్లలో పనులు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రేంజ్‌ అధికారి టి.ఉమా మహేశ్వరరెడ్డి, డీఆర్వో శ్రీనివాసులు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని