logo

జీవో నెం.1.. వర్తించదా మరి?

‘జీవో నంబరు 1లోని నిబంధనలు ప్రతిపక్షాలకే కాదు.. అధికారంలో ఉన్న వైకాపాకూ వర్తిస్తాయి. వాటికి లోబడే వైకాపా సభలు నిర్వహించుకోవాల్సి ఉంటుంది’- ఇవీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాటలు.

Published : 07 Feb 2023 02:35 IST

రోడ్‌షోలో ఎంపీ ఆదాల, పక్కన మంత్రి గోవర్ధన్‌రెడ్డి, వేమిరెడ్డి,
బీద మస్తాన్‌రావు, ఆనం విజయకుమార్‌రెడ్డి తదితరులు

ఈనాడు డిజిటల్‌, నెల్లూరు: కార్పొరేషన్‌: ‘జీవో నంబరు 1లోని నిబంధనలు ప్రతిపక్షాలకే కాదు.. అధికారంలో ఉన్న వైకాపాకూ వర్తిస్తాయి. వాటికి లోబడే వైకాపా సభలు నిర్వహించుకోవాల్సి ఉంటుంది’- ఇవీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాటలు. జిల్లాలో మాత్రం అవేమీ కనిపించలేదు.ఆ జీవో మాకు వర్తించదని చెప్పకనే చెప్పారు. నెల్లూరు రూరల్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఎంపికైన తర్వాత నగరానికి విచ్చేస్తున్న ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డికి వైకాపా నాయకులు ఘన స్వాగతం పలికేందుకు భారీగా జన సమీకరణ చేశారు. రహదారులపై సభలు, సమావేశాలు, ర్యాలీలు, రోడ్డుషోలకు అనుమించరాదన్న నిబంధనను అపహాస్యం చేశారు. ఎలాంటి అనుమతి తీసుకోకుండా.. నగరం మధ్యలో నుంచి రోడ్‌షో నిర్వహించారు. డీజే పాటలతో పాటు బాణసంచా కాల్చారు. పతిచోటా వైకాపా నాయకుల తీరు.. మమ్మల్ని అడిగేవారు లేరనే తీరులో సాగింది. దాదాపు 4 కి.మీ. సాగిన ఈ ర్యాలీలో ఆదాలతో పాటు మంత్రి కాకాణి, అనిల్‌కుమార్‌యాదవ్‌, ఎంపీలు వేమిరెడ్డి…, బీద మస్తాన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

కార్యకర్తలకు అండగా ఉంటా: ఆదాల ప్రభాకర్‌రెడ్డి, ఎంపీ

నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంలోని వైకాపా కార్యకర్తలకు అండగా ఉంటానని ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ర్యాలీ అనంతరం తన కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కార్పొరేటర్లు మద్ధతు ఇవ్వడం అభినందనీయమన్నారు. ఎవరూ బయపడాల్సిన అవసరం లేదని.. ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే వెంటనే తమకు చెప్పాలని కోరారు. మంత్రి కాకాణి మాట్లాడుతూ.. రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నమ్మకద్రోహం చేసి వెళ్లిపోయారన్నారు.  వచ్చే ఎన్నికల్లో వైకాపా అన్ని నియోజకవర్గాల్లో విజయకేతనం ఎగురవేస్తుందన్నారు. అనిల్‌కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. నెల్లూరు కంచుకోటను మళ్లీ గెలుచుకుంటామన్నారు. రెండుసార్లు టికెట్టు ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపిస్తే కోటంరెడ్డి వెళ్లిపోయాడన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ..  మేయర్‌గా తనను శ్రీధర్‌రెడ్డి చేశారని చెబుతున్నారని, జగన్‌ వల్లే ఆ పదవి దక్కిందనే విషయాన్ని మర్చిపోకూడదన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డి, నుడా ఛైర్మన్‌ ముక్కాల ద్వారకనాథ్‌, వైకాపా నాయకులు ఆనం విజయకుమార్‌రెడ్డి, వైవి.రామిరెడ్డి, కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు