logo

కొలువు కల... మోసగాళ్ల వల!

ఇటీవల కాలంలో ఈ తరహా మోసాలు అధికమవగా- ఎస్పీ కార్యాలయంలో జరిగే స్పందనలో తరచూ ఫిర్యాదులు అదే స్థాయిలో ఉంటున్నాయి.

Published : 07 Feb 2023 02:35 IST

పోలీసు ‘స్పందన’కు ఫిర్యాదుల వెల్లువ

* రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించాడు. ఎలాంటి ఆధారాలు లేకుండానే రూ. లక్షలు వసూలు చేశాడు. తీరా ఉద్యోగం ఇప్పించమని అడిగితే.. ఎవరికి చెప్పుకొంటావో చెప్పుకోమని బెదిరిస్తున్నాడు.


* ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి.. పక్కింట్లో ఉండే వ్యక్తి నమ్మించాడు. రూ. 1.50 లక్షలు ఇస్తే వస్తుందంటూ డబ్బు తీసుకున్నాడు. తీరా.. మోసం చేశాడు. ఏమని అడిగితే పలకడమే లేదు. కోవూరు పడుగుపాడుకు చెందిన ఓ నిరుద్యోగి.

జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన స్పందనలో ఎస్పీకి వచ్చిన ఫిర్యాదులు ఇవి.

న్యూస్‌టుడే, నెల్లూరు (నేర విభాగం)


ఇటీవల కాలంలో ఈ తరహా మోసాలు అధికమవగా- ఎస్పీ కార్యాలయంలో జరిగే స్పందనలో తరచూ ఫిర్యాదులు అదే స్థాయిలో ఉంటున్నాయి. ఈ విషయమై జిల్లా పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నా.. ప్రతి సోమవారం అర్జీలు మాత్రం ఆగడం లేదు. ధైర్యం చేసి ఫిర్యాదు చేయడానికి వస్తున్న వారు కొందరేనని.. బయటకు రాని వారు వేలల్లోనే ఉంటారనేది అంచనా.


నిరుద్యోగమే.. వారి ఆసరా

పారిశ్రామికంగా జిల్లా అభివృద్ధి చెందుతోంది.  కృష్ణపట్నం పోర్టు, థర్మల్‌ ప్లాంట్లు, సెజ్‌లు, పారిశ్రామిక వాడలు, పలు ప్రైవేటు కంపెనీలు జిల్లాకు వస్తుండగా- సరిగ్గా, ఈ పరిస్థితినే కొందరు ఆసరాగా చేసుకుని ఉద్యోగాల వ్యాపారం చేస్తున్నారు. తమకు ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఉన్నాయని.. తాము ఎంత చెబితే అంతే.. కాకుంటే కాస్త ఖర్చవుతుందని నమ్మబలుకుతున్నారు. రూ. లక్షలు వసూలు చేసి పరారవుతున్నారు. ఇలా మోసపోతున్న నిరుద్యోగుల్లో ఎక్కువగా బీటెక్‌, ఎంటెక్‌, ఎంబీఏ తదితర ప్రొఫెషనల్‌ కోర్సులు చేసిన యువకులే ఉంటుండటం గమనార్హం. మాయమాటలతో నగదు ఇవ్వాలని మభ్యపెడతారు. ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ప్రాంగణ ఎంపికలు చేసేలా నటిస్తారు. సొమ్ము అందగానే అడ్డం తిరుగుతుండగా.. బాధితులు లబోదిబోమంటున్నారు.


గుర్తించుకోవాలి మరి

* ఇచ్చిన ఉద్యోగ ప్రకటన వెబ్‌సైట్‌ సరైనదో కాదో క్షుణ్నంగా పరిశీలించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ.. అందులో పేర్కొన్న మొబైల్‌ నంబర్లకు ఫోన్‌ చేసి వివరాలు తీసుకోకూడదు. స్వయంగా కార్యాలయాన్ని సంప్రదించాలి. అప్పుడే పూర్తి వివరాలు తెలుస్తాయి. * ఏ సంస్థ కూడా తమ ఉద్యోగుల నుంచి పని కల్పించేందుకు డబ్బు వసూలు చేయదు. నేను వెళ్లేది పని చేయడానికి.. మరి అలాంటప్పుడు నేనెందుకు డబ్బు చెల్లించాలి? అని ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.


అప్రమత్తత అవసరం

- సీహెచ్‌ విజయరావు, ఎస్పీ

ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం చేసే వ్యక్తుల పట్ల యువత, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగాలపై క్షేత్రస్థాయిలో ఆరా తీయాలి. సంస్థ ఎక్కడుంది? నిర్వాహకులు ఎవరు? తదితర అన్ని వివరాలు తెలుసుకోవాలి. ఉద్యోగాల పేరుతో జరిగే ప్రచారాలను నమ్మి మోసపోవద్దు.


‘ఓ వ్యక్తి.. బ్యాంకులో ఉద్యోగం ఇప్పిస్తామంటూ కావలికి చెందిన ముగ్గురు యువకులతో నమ్మబలికాడు. గుంటూరు, హైదరాబాద్‌లో బ్రాంచీలు ఉన్నాయంటూ ఇంటర్వ్యూలు సైతం నిర్వహించారు. ఒక్కో పోస్టుకు రూ. 1.80 లక్షలు వసూలు చేశాడు. అందులో తనకు రూ. 70 వేలు పర్సెంటేజీ అని బహిరంగంగానే ప్రచారం చేశాడు. తీరా ఉద్యోగాలు కాదు కదా! ఇంటర్వ్యూలు నిర్వహించిన ఆ బ్రాంచిలే మూతపడ్డాయి. గుంటూరు, హైదరాబాద్‌ ప్రాంతాల్లో తిరిగినా.. ఎలాంటి కార్యాలయం కనిపించలేదు. చివరకు తాము మోసపోయినట్లు తెలుసుకుని.. న్యాయం కోసం పోలీసుల చుట్టూ తిరుగుతున్నారు.’

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని