logo

కనిపించకుండా పోయిన బిడ్డ.. 20 నెలల తర్వాత దొరికాడు

మూడేళ్ల బుడతడు.. తండ్రి వెనుకాలే అడుగులేసిన బిడ్డ.. కనిపించకుండా పోయాడు.  అనేక మలుపుల అనంతరం 20 నెలల తర్వాత.. ఆ ఇంటికి అనూహ్యంగా చేరడంతో కన్నవారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Updated : 07 Feb 2023 12:09 IST

కుమారుడిని ముద్దాడుతున్న తల్లి

కలువాయి, న్యూస్‌టుడే: మూడేళ్ల బుడతడు.. తండ్రి వెనుకాలే అడుగులేసిన బిడ్డ.. కనిపించకుండా పోయాడు.  అనేక మలుపుల అనంతరం 20 నెలల తర్వాత.. ఆ ఇంటికి అనూహ్యంగా చేరడంతో కన్నవారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ సంఘటన కలువాయి మండలం ఉయ్యాలపల్లిలో చోటు చేసుకుంది.

నాడు తప్పిపోయి.. దండు బుజ్జయ్య, వరలక్ష్మమ్మలకు ముగ్గురు కుమారులు. వారిలో రెండో బిడ్డ సంజు. జూన్‌ 29, 2021వ తేదీ ఉదయం 9 గంటలకు ఇంటి నుంచి బయటకు వచ్చాడు. బుజ్జయ్య రోజు మాదిరి మేకలు తోలుకుని అడవికి వెళ్లగా.. సంజు తండ్రిని అనుసరిస్తూ.. వెనుకాలే వెళ్లాడు. ఆ విషయం బుజ్జయ్య గమనించలేదు. బిడ్డ ఎంత సేపటికీ కనిపించకపోవడంతో చుట్టుపక్కలంతా గాలించారు. నాడు పోలీసులు కూడా నెల రోజుల పాటు అడవిని జల్లెడపట్టారు.

నిన్న తెలిసి.. రాజంపేటకు చెందిన ఓ మహిళ.. ఇటీవల కలువాయి మండలం తోపుగుంట ఎస్టీ కాలనీలోని బంధువుల ఇంటికి వచ్చింది. ఆమె వస్తూ వస్తూ ఓ బాలుడిని వెంట తీసుకొచ్చింది. చుట్టుపక్కల వాళ్లు ఆ బాబు ఎవరని ఆరా తీయగా.. ఉయ్యాలపల్లి వద్ద తన మరిదికి దొరికాడని చెప్పింది. ఆ తర్వాత ఆమె మళ్లీ పిల్లాడిని తీసుకుని తమ ఊరికి వెళ్లిపోయింది.

నేడు దరిచేరి.. ఆ సమాచారం ఆదివారం బాధిత తల్లిదండ్రులకు చేరింది.వారు తమ బిడ్డ అయి ఉండొచ్చేమోనన్న ఆశతో రాజంపేటకు తరలివెళ్లారు. అక్కడి వారు.. ఇటుక రాయి పని కోసం పామూరు వెళుతూ బాలుడిని సైతం తీసుకువెళ్లారని తెలిసింది. దాంతో సోమవారం కృష్ణంపల్లి గ్రామంలో ఇటుక రాయి పని వద్దకు వెళ్లారు. ఆ బాలుడు తమ బిడ్డేనని గుర్తించి.. ఇంటికి తీసుకువచ్చారు.  

ఆనందానికి అవధులు లేవు.. ‘బిడ్డను ఎవరైనా తీసుకువెళ్లి ఉంటారనే అనుమానం ఉండేది. అదే నిజమైంది. దేవుడు మాయందు ఉన్నాడు. మా ఆనందానికి అవధులు లేవు.

తల్లిదండ్రులు బుజ్జయ్య, వరలక్ష్మమ్మ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని