logo

అర్జీలు చూడకపోవడం సరైన విధానం కాదు

స్పందన అర్జీలకు అత్యధిక ప్రాధాన్యమిచ్చి సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు అధికారులను ఆదేశించారు.

Published : 07 Feb 2023 02:35 IST

వృద్ధుడి సమస్య తెలుసుకుంటున్న కలెక్టర్‌ చక్రధర్‌బాబు

నెల్లూరు (కలెక్టరేట్‌), న్యూస్‌టుడే : స్పందన అర్జీలకు అత్యధిక ప్రాధాన్యమిచ్చి సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో జేసీ రోణంకి కూర్మనాథ్‌, డీఆర్వో వెంకటనారాయణమ్మతో కలిసి స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొందరు జిల్లా అధికారులు వారికి వచ్చిన స్పందన అర్జీలను చూడకపోవడం సరైన విధానం కాదన్నారు. ప్రతిరోజు వారి లాగిన్లను తెరచి ప్రజల వినతులను సకాలంలో పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో పరిష్కారమవుతున్న స్పందన అర్జీల నాణ్యతను పరిశీలించేందుకు ఆడిట్‌ బృందం ఒకటి పని చేస్తోందని, అందులోని సభ్యులు వివిధ ప్రభుత్వ శాఖల్లో వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి వారం అందించే నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతున్నట్లు పేర్కొన్నారు. పరిష్కారంలో విధిగా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ, డ్వామా, మెప్మా పీడీలు కేవీ సాంబశివారెడ్డి, డి.వెంకటరావు, రవీంద్ర, జడ్పీ సీఈవో చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.


నమ్మించి మోసం చేశారు..

షేక్‌ గొల్లపల్లి మస్తాన్‌బీ, అనంతసాగరం

పోలీసుల సహాయంతో కలెక్టరేట్‌లోకి వస్తూ..

నాకు నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు. చిన్న కుమార్తె గౌసున్నీ, ఆమె కుమారులు యూనిస్‌, ఉమ్రాన్‌ నమ్మించి మోసం చేశారు. నా బాగోగులు అంతా చూసుకుంటామని ఇల్లు రిజిష్టర్‌ చేయించుకున్నారు. ఎనిమిది సవర్ల బంగారం, రూ.2 లక్షలు దాచి పెడతామని తీసుకున్నారు. ఏడాది పాటు ఒక పూట భోజనం పెట్టారు. తర్వాత మేం చూడం, దిక్కున్న చోట చెప్పుకోమని ఇంటి నుంచి బయటకు పంపించేశారు. నా దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు. నేను ఎలా బతకాలి. నాకు న్యాయం చేయండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు