logo

వెడల్పు తగ్గించారు మరి

కావలి- సీతారామపురం జాతీయ రహదారి విస్తరణ, అభివృద్ధి పనుల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయా? జరుగుతున్న ప్రక్రియను చూస్తే అధికారుల నుంచి అవుననే సమాధానమే వస్తోంది.

Published : 09 Feb 2023 01:22 IST

కావలి- దుత్తలూరు రహదారి విస్తరణలో మరో జాప్యం

రహదారి విస్తరణ పనులు

కావలి, న్యూస్‌టుడే: కావలి- సీతారామపురం జాతీయ రహదారి విస్తరణ, అభివృద్ధి పనుల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయా? జరుగుతున్న ప్రక్రియను చూస్తే అధికారుల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. వెడల్పు తగ్గింపు అనివార్యమన్న మాట వినిపిస్తోంది. జాతీయ రహదారి అంటే కనీసం 40 మీటర్ల వెడల్పైనా ఉండాలి. ఈ రహదారి విషయానికి వచ్చేసరికి వివిధ కారణాలతో వెడల్పును ఇప్పటికే 34 మీటర్లకు తగ్గించారు. తాజాగా మరో మూడు మీటర్లు తగ్గిస్తే గానీ నిధుల సర్దుబాటు కాదని ఎన్‌హెచ్‌ఏఐ రెవెన్యూశాఖను కోరుతోంది. అంటే రహదారి మధ్య నుంచి ఇరువైపులా 17 మీటర్ల నుంచి 15.5 మీటర్లకు తగ్గిస్తున్నారు. మొత్తం 110 కి.మీ. కాగా.. తొలి విడతలో 70 కి.మీ. వరకు అభివృద్ధి చేయనున్నారు.

చాలా చోట్ల 31 మీటర్లకే పరిమితం..

కావలి- సీతారామపురం జాతీయ రహదారి.. రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోని రహదారులు భవనాలశాఖ నుంచి ఎన్‌హెచ్‌ఏఐలో చేరి ఒకటిన్నర దశాబ్దమవుతోంది. నిధులు మంజూరై మూడేళ్లవుతోంది. రెండేళ్ల కిందట విజయవాడకు వచ్చిన కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి గడ్కరీ చేతుల మీదుగా పనులకు శంకుస్థాపన చేశారు. తొలి విడతగా ఈ మార్గంలో దుత్తలూరు వరకు అభివృద్ధి చేస్తున్నారు. రహదారి విస్తరణలో భాగంగా మంజూరైన మొత్తంలో భూసేకరణ నిధులు నిర్దుష్ట పరిధి దాటడమే వెడల్పు కుదింపునకు కారణంగా తెలుస్తోంది. ఆ క్రమంలోనే రహదారిని చాలా చోట్ల 31 మీటర్లకే పరిమితం చేయాలని నిర్ణయించారు.

రూ. 415 కోట్లు మంజూరు

తొలి విడతగా కావలి- దుత్తలూరు 167 బీజీ రహదారి విస్తరణకు రూ. 415 కోట్లు మంజూరయ్యాయి. మొత్తం తారు రోడ్డు వేయనున్నారు. ప్రస్తుతం పలు ప్రాంతాల్లో 20 మీటర్ల వరకు ఉన్న రహదారిని గరిష్ఠంగా 31 మీటర్లకు విస్తరించనున్నారు. జలదంకి వద్ద బైపాస్‌గా అభివృద్ధి చేయడంతో పాటు కలిగిరి మేజర్‌ పంచాయతీ వద్ద గ్రామ కూడలి మీదుగానే కొనసాగనుంది. వింజమూరు పంచాయతీలో బంగ్లా కూడలి మీదుగా దుత్తలూరు వైపునకు విస్తరణ ప్రక్రియ సాగనుంది. తొలుత ఆ గ్రామ కూడలిలో రూపొందిన నమూనాలను మార్చుతున్నారు. కావలి- దుత్తలూరు మధ్య ఏర్పాటయ్యే టోల్‌ప్లాజా ద్వారా.. పాతికేళ్లలో.. ఇప్పుడు అయ్యే వ్యయం తిరిగొచ్చేలా ప్రణాళిక రూపొందించారు.

అవును.. వాస్తవమే...

అనిల్‌, డీఈఈ, ఎన్‌హెచ్‌ఏఐ

కావలి- సీతారామపురం రహదారి విస్తరణలో భాగంగా.. నిబంధనల ప్రకారం చేయాల్సిన వెడల్పు కంటే 31 మీటర్ల తగ్గింపుతో భూసేకరణ జరుగుతున్న విషయం వాస్తవమే. ఆ మేరకు  రెవెన్యూశాఖను కోరాం. గత రెండు నెలలుగా ఈ విషయమై కార్యాచరణ సాగుతోంది. మరో పది రోజుల్లోగా పూర్తి కావచ్చు. ప్రస్తుతం చేపట్టిన తొలి విడత పనులు త్వరలోనే వేగవంతమవుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని